ఏపీలో ప్రారంభమైన పరిషత్ ఎన్నికల పోలింగ్
x

ఏపీలో ప్రారంభమైన పరిషత్ ఎన్నికల పోలింగ్

వర్షంలోనూ ఓటేసేందుకు వస్తున్న ఓటర్లు


Click the Play button to hear this message in audio format

ఆంధ్రప్రదేశ్ లో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం ఉత్సాహం పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాలలో నీరు నిలిచింది.

రాయలసీమలోని కొన్ని పోలింగ్ కేంద్రాలలో అధికార కూటమికి, ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య పరస్పర దాడులు జరిగాయి. పోలీసులు స్వల్ఫ లాఠీచార్జ్ లు జరిపి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ఇప్పటికే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి క్లీన్ స్వీప్ చేయగా, తాజాగా జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లోనూ వారి జోరే కొనసాగుతోంది

Live Updates

  • 5 Nov 2026 6:38 PM IST

    పోలింగ్ అధికారి హరిత గౌడ్ మృతిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంతాపం..

    అనంతపురం జిల్లా కూడేరు మండలం కాడదారకుంటలో విధులు నిర్వహిస్తున్న పోలింగ్ అధికారి, ఉపాధ్యాయురాలు హరిత గౌడ్ గుండెపోటుతో మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హరిత గౌడ్ మరణవార్త తనను కలచివేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాద సమయంలో హరిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా హరిత మృతిపై విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆమె మృతి బాధాకరమని పేర్కొన్నారు. 

  • 5 Nov 2026 6:00 PM IST

    ముగిసిన పోలింగ్‌..

    రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగిసింది. అయితే అప్పటికే క్యూ లైన్లలో చేరుకున్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు అధికారులు..

  • 5 Nov 2026 5:40 PM IST

    బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ అభ్యర్థి భర్త

    కడపజిల్లా గోపవరం మండలం రామాపురంలో వైసీపీ అభ్యర్థి భర్త ఓటు గల్లంతు కావడంతో అధికారులను నిలదీశారు. మీ ఓటు ఎవరో వేశారని చెప్పడంతో ఆగ్రహంతో బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోశాడు.

  • 5 Nov 2026 5:22 PM IST

    ‘మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీ గుణపాఠం’

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి ప్రజలిచ్చిన గుణపాఠమని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను నామినేషన్లు కూడా వేయనివ్వకుండా అడ్డుకున్నారని విమర్శించారు. పలు ప్రాంతాల్లో ఏకగ్రీవాల పేరుతో ఎన్నికల నిబంధనలను పక్కనపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. నాడు ప్రతిపక్షాలను వేధించిన వైసీపీ నేతలు.. నేడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు.

  • 5 Nov 2026 4:20 PM IST

    ఇవి ఎన్నికలా? లేక సెలక్షన్‌లా?: జగన్ ఆగ్రహం

    ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మహాభారతంలో శకుని మాయాపాచికల మాదిరిగా ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరుగుతోందని జగన్ ఆరోపించారు. ఇవి నిజంగా ఎన్నికలా? లేక సెలక్షన్‌లా? అంటూ ప్రశ్నించారు.   

  • 5 Nov 2026 4:02 PM IST

    ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి: పల్లా

    రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైసీపీ అబద్ధపు ప్రచారాలతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. కడప, పులివెందులలో జరిగిన గొడవలకు ఆ పార్టీ అధినేత జగనే కారణమని అన్నారు. హింస, దౌర్జన్యాలతో ఓట్లు సాధించాలని ప్రయత్నిస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని, జగన్ ప్రజల తీర్పును గౌరవించాలని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

  • 5 Nov 2026 3:59 PM IST

    కుప్పంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య గొడవ!

    చిత్తూరు జిల్లా కుప్పం: గుడిపల్లి మండలం చిన్న గొల్లపల్లిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • 5 Nov 2026 3:40 PM IST

    ఎన్నికల విధుల్లో టీచర్ మృతి

    అనంతపురం జిల్లాలో ఎన్నికల విధుల్లో టీచర్ హరిత గౌడ్‌ మృతి చెందారు. పోలింగ్‌ కేంద్రంలోనే కుప్పకూలడంతో వెంటనే కూడేరు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందారు. ఈ ఘటన కూడేరు మండలం కడదరకుంటలో చోటుచేసుకుంది.

  • 5 Nov 2026 2:53 PM IST

    బ్యాలెట్ పత్రాల్లో కనిపించని జనసేన, వైసీపీ గుర్తులు

    బాపట్ల జిల్లా: కొత్తపేట పోలింగ్‌ బూత్‌లో గందరగోళం నెలకొంది. బ్యాలెట్ పత్రాల్లో జనసేన, YCP గుర్తులు కనిపించలేదు. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులు పోలింగ్ ప్రక్రియను నిలిపివేశారు. 

  • 5 Nov 2026 2:08 PM IST

    ఎమ్మెల్యేపై దాడి.. గన్‌మెన్‌కు గాయాలు

    అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ నేతలు ఓటు వేయనివ్వకుండా బెదిరిస్తున్నారని ఎమ్మెల్యేకు సురేంద్రకు మహిళలు ఫోన్ చేశారు. పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గన్‌మెన్‌కు గాయాలయ్యాయి.

Read More
Next Story