
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్‌డేట్స్
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరగనున్న పోలింగ్.. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూకట్టిన ఓటర్లు ..
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల పోలింగ్ మందకోడిగా జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల జోరుగా సాగుతోంది.
Live Updates
- 1 Nov 2026 11:43 AM IST
రీపోలింగ్ నిర్వహించాలి: మాజీ సీఎం జగన్
పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ చేశారు. పులివెందులలో 80 పోలింగ్ కేంద్రాలుండగా 70 కేంద్రాల్లో తమ పార్టీ ఏజెంట్లు లేరని పేర్కొన్నారు. పోలీసులు దగ్గరుండి టీడీపీ నేతలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని విమర్శించారు.
- 1 Nov 2026 11:37 AM IST
విశాఖలో ఓటేసిన గుడివాడ అమర్నాథ్
వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖ మింది ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతోన్న తీరు బాధ కలిగిస్తోందన్నారు. కొన్ని చోట్ల ఓటు వేసేందుకు వచ్చే వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పులివెందులను తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసిందన్నారు. ప్రతి ఓటరు నిర్భయంగా ఓటు వేయాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు.
- 1 Nov 2026 11:27 AM IST
గుంటూరులో 11 గంటలకు 17.82% పోలింగ్
గుంటూరులో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు 17.82శాతంగా పోలింగ్ నమోదైంది. ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు.
- 1 Nov 2026 11:23 AM IST
పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపటి క్రితం పులివెందుల చేరుకున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన ఆయన భాకరాపురంలోని హెలిప్యాడ్ వద్ద దిగారు. భాకరాపురంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
- 1 Nov 2026 11:20 AM IST
గుండెపోటుతో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి భర్త మృతి..
మున్సిపల్ ఎన్నికల వేళ ఏలూరులో విషాదం చోటుచేసుకుంది. నూజివీడు పట్టణం 30వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి కోటగిరి పూర్ణిమ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త కోటగిరి సతీష్ (53) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఒకవైపు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా, మరోవైపు పూర్ణిమ కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
- 1 Nov 2026 11:12 AM IST
‘పులివెందులలో వైసీసీ విధ్వంసం’
తమ ఉనికి కోల్పోతామనే భయంతో వైసీసీ నాయకులు, శ్రేణలు దాడులకు పలుచోట్ల దాడులకు తెగబడుతున్నారని టీడీపీ నేత బీటెక్ రవి ఆరోపించారు. ఇప్పటికే పలు చోట్ల రాళ్ల దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. కాగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పులివెందులలో ఆయనను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. కార్లను తగలబెట్టి విధ్వంసం సృష్టించారని చెప్పారు.
- 1 Nov 2026 11:06 AM IST
ప్రశాంతంగా పోలింగ్ ..
రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఐజీపీ రాజకుమారి తెలిపారు. ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నామన్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద ఇప్పటకే భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. మొబైల్ పోలీస్ టీంలను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఐజీపీ విజ్ఞప్తి చేశారు. రాయలసీమలో ఒకటి రెండు చోట్ల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశామని చెప్పారు.
- 1 Nov 2026 10:55 AM IST
ఉదయం 9 గంటలకు.. 7.7 శాతం
కడప కార్పొరేషన్ ఉదయం 9 గంటలకు పోలింగ్ 7.7 శాతంగా నమోదైంది. నెల్లూరు కార్పొరేషన్‌లో 5.89 శాతం, విశాఖలో 3.34 శాతంగా నమోదైంది. ఇక తెనాలి, వినుకొండలో 9 శాతం, చీరాలలో 12 శాతంగా రికార్డయ్యింది.
- 1 Nov 2026 10:52 AM IST
ఓటేసిన సినీనటుడు బాలకృష్ణ..
హిందూపురంలోని చౌడేశ్వరి కాలనీ మూడో పోలింగ్ కేంద్రంలో ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు భార్య వసుంధర ఉన్నారు.
- 1 Nov 2026 10:49 AM IST
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠ
విజయవాడ విటీపీఎస్ కాలనీ పోలింగ్ కేంద్రాన్ని ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠ కాసేపటి క్రితం పరిశీలించారు. ఓటింగ్ శాతం, పోలింగ్ సరళిపై పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అర్హులైన ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టగా.. 8 చోట్ల ఎన్నికలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 92 స్థానిక సంస్థల్లో ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,378 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

