ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌
x

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరగనున్న పోలింగ్.. పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూకట్టిన ఓటర్లు ..


Click the Play button to hear this message in audio format

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల పోలింగ్ మందకోడిగా జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల జోరుగా సాగుతోంది.

Live Updates

  • 1 Nov 2026 5:14 PM IST

    ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

    రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడా పెద్దగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తతలు, చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఓటరు తీర్పు బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైంది. అభ్యర్థుల భవితవ్యం తేలేందుకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు నవంబర్ 3న వెలువడనున్న ఫలితాల కోసం రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.

  • 1 Nov 2026 3:59 PM IST

    పట్టణాల్లోనే అధిక ఓటింగ్

    రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 48.03 శాతం నమోదయ్యింది. మొత్తం 96.89 లక్షల మంది ఓటర్లకు‌గాను 46.54 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యధికంగా కర్నూలు జిల్లా గూడూరు మున్సిపాలిటీలో 73.96 శాతం పోలింగ్ నమోదయ్యింది. అలాగే చీమకుర్తిలో 73.64 శాతం, కనిగిరిలో 73.20 శాతం, నగరిలో 71.78 శాతం, బద్వేల్‌లో 71.52 శాతం, జమ్మలమడుగులో 69.57 శాతం, కుప్పంలో 68.96 శాతం నమోదయ్యింది. అత్యల్పంగా విశాఖ జీవీఎంసీలో 39.72 శాతం పోలింగ్ రికార్డయ్యింది.

    ఇక ఆదోనిలో 40.11 శాతం, నెల్లూరులో 40.91 శాతం, గుంటూరు నగరంలో 40.99 శాతం, కడపలో 41.21 శాతం, విజయవాడలో 41.80 శాతం, తిరుపతిలో 42.12 శాతం, కర్నూలు నగరంలో 42.40 శాతం, ఏలూరులో 43.84 పోలింగ్ శాతం నమోదయ్యింది. విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు వంటి ప్రధాన నగరాల్లో 3 గంటలకూ 50 శాతం లోపే పోలింగ్ నమోదయ్యింది. పోలింగ్ ముగియడానికి మరో గంట సమయం ఉండడంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది 

  • 1 Nov 2026 3:43 PM IST

    ఓటు వేయకుండానే వెళ్లిపోయిన వైఎస్ జగన్..

    పోలింగ్ కేంద్రాల్లోకి తమ పార్టీ ఏజెంట్లను అనుమతించడం లేదని, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల రిటర్నింగ్ ఆఫీసు కార్యాలయం బైఠాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల ఏకపక్షంగా జరుగుతున్నాయని ఆరోపించిన జగన్ చివరకు.. చివరకు ఓటు వేయకుండానే పులివెందుల నుంచి బెంగళూరుకు వెళ్లిపోయారు. రీపోలింగ్‌ పెడితేనే వచ్చి ఓటు వేస్తానని ఆయన చెప్పారు. పోలింగ్ తీరును పరిశీలిస్తే.. SEC ఎవరి చేతుల్లో ఉందో అందరికీ తెలుస్తుందని పేర్కొన్నారు. 

  • 1 Nov 2026 3:22 PM IST

    విజయవాడ 69వ డివిజన్‌లో దొంగ ఓట్ల కలకలం

    ముత్యాలంపాడులో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన ఇద్దరిని పోలింగ్ ఏజెంట్లు గుర్తించారు. రెండోసారి ఓటు వేసేందుకు రావడంతో గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరిని పోలీసులు సత్యనారాయణ పురం‌ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. 

  • 1 Nov 2026 2:01 PM IST

    జమ్మలమడుగులో ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ

    జమ్మలమడుగులో వైసీపీ అభ్యర్థులు ఎన్నికలను బహిష్కరించారు. పోలింగ్ కేంద్రాల నుంచి ఆ పార్టీ అభ్యర్థులు, బూత్ ఏజెంట్లు బయటకు వచ్చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భుపేష్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆరోపించారు. బయటి ప్రాంతం నుంచి వచ్చిన వారితో దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఏజెంట్లు ఓటరు స్లిప్పులను బలవంతంగా లాక్కొని ఓట్లు వేస్తున్నారని ఆరోపించిన రామసుబ్బారెడ్డి.. ఎన్నికలను వాయిదా వేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

  • 1 Nov 2026 1:37 PM IST

    బైక్‌పై వచ్చి.. ఓటేసిన మంత్రి సవిత

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ద్విచక్ర వాహనంపై వచ్చి ఓటేశారు. పెనుకొండలోని 18వ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

  • 1 Nov 2026 1:30 PM IST

    ఆర్వో ఆఫీసు ముందు బైఠాయించిన వైఎస్ జగన్!

    పోలింగ్ కేంద్రాల్లోకి వైసీపీ ఏజెంట్లను అనుమతించడం లేదని, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల రిటర్నింగ్ ఆఫీసు కార్యాలయం బైఠాయించారు. 70 మంది వైసీపీ ఏజెంట్లతో కార్యాలయ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆఫీసులోకి అనుమతించకపోవడంతో జగన్ అక్కడే బైఠాయించారు.

  • 1 Nov 2026 1:08 PM IST

    ఓటింగ్ సరళిని బైక్ మీద వెళ్లి పరిశీలించిన కలెక్టర్..

    నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఓటింగ్ సరళిని కలెక్టర్ హిమాన్షు శుక్ల బైక్ మీద వెళ్లి పరిశీలించారు. నెల్లూరులో 28, బుచ్చిలో 20 కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది. జిల్లాలో ఎక్కడా ఉద్రిక పరిస్థితులు లేవు. భారీ వర్షం కురిసినా ఓటింగ్‌కి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

  • 1 Nov 2026 12:26 PM IST

    జగన్ వ్యాఖ్యలకు వర్గ రామయ్య కౌంటర్..

    పులివెందుల పోలింగ్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఓటమి భయంతోనే పులివెందులలో లేని హడావుడి సృష్టిస్తున్నాడని టీడీపీ నేత, ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఆరోపించారు. మూడు రోజుల్లో ఆయన రెండుసార్లు పులివెందులకు వెళ్లారని, ట్రాక్టర్లు, కార్లు దగ్ధం వెనుక ముందస్తు ప్రణాళిక ఉందన్నారు.  

  • 1 Nov 2026 12:08 PM IST

    ఉదయం 11 గంటల వరకు 22.08 శాతం పోలింగ్

    రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 22.08 శాతం పోలింగ్ నమోదయ్యిందని ఎన్నికల అధికారులు తెలిపారు. గుంటూరు కార్పొరేషన్‌లో ఉదయం 11 గంటల వరకు 18 శాతం పోలింగ్ నమోదు కాగా.. తిరుపతి కార్పొరేషన్‌లో ఉ.11 గంటల వరకు 20.12 శాతం పోలింగ్ నమోదయింది. పలమనేరులో 33.2 శాతం.. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 31 శాతం, వినుకొండలో 27 శాతం పోలింగ్ రికార్డయ్యింది.

Read More
Next Story