పార్లమెంట్ ముట్టడికి సీజేపీ పిలుపు.. ఢిల్లీలో హై టెన్షన్!
x

పార్లమెంట్ ముట్టడికి సీజేపీ పిలుపు.. ఢిల్లీలో హై టెన్షన్!

బారికేడ్లు బద్దలు.. పోలీసులతో నిరసనకారుల ఘర్షణ


Click the Play button to hear this message in audio format

ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజే...రాజధాని వీధులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. వేలాది మంది విద్యార్థులు, యువత 'చలో సంసద్' పేరుతో పార్లమెంట్ వైపు కదిలారు. మరోవైపు...పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిరసనకారులు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో...ఘర్షణలు చోటుచేసుకున్నాయి. లాఠీలు కూడా వాడినట్లు వార్తలు వచ్చాయి. ఇంతకు ఢిల్లీలో ఏం జరిగిందో తెలుసుకుందాం.


కాక్రోచ్ జనతా పార్టీ పిలుపుతో.. వేలాది మంది విద్యార్థులు, యువ కార్యకర్తలు ఢిల్లీకి చేరుకున్నారు. NEET పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


పార్లమెంట్ మార్చ్‌ను దృష్టిలో పెట్టుకుని...ఢిల్లీ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మూడు అంచెల భద్రత అమలు చేశారు. ఐదు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు కూడా అమల్లోకి వచ్చాయి.


ఇటు వేలాది మంది నిరసనకారులు టాల్‌స్టాయ్ మార్గ్ - సంసద్ మార్గ్ కూడలి వరకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో...పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో... పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. లాఠీచార్జీ కూడా చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.


కొంత ఉద్రిక్తత తర్వాత...పోలీసులు కొన్ని బారికేడ్లను తొలగించినట్లు సమాచారం.దీంతో...నిరసనకారులు పార్లమెంట్ వైపు తమ మార్చ్‌ను కొనసాగించారు. అయితే...లాఠీచార్జ్ లేదా అరెస్టులపై ఢిల్లీ పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.


ఈ నిరసన...పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే జరగడం గమనార్హం. ఒకవైపు పార్లమెంట్‌లో ప్రతిపక్షం...

మరోవైపు బయట విద్యార్థుల ఆందోళన...దీంతో...NEET అంశం మరోసారి జాతీయ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.

మొత్తానికి...'చలో సంసద్' మార్చ్‌తో ఢిల్లీ మరోసారి ఉద్రిక్తంగా మారింది.


నిరసనకారులు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు...శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇక ఈ నిరసనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎలాంటి చర్చ జరుగుతుంది? అనేదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Live Updates

  • 20 July 2026 7:28 PM IST

    పార్లమెంట్ నిరసన డ్రోన్ వీడియోపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు

    పార్లమెంట్ సమీపంలో జరిగిన నిరసనలకు సంబంధించిన వైరల్ డ్రోన్ వీడియోపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డ్రోన్ నిబంధనలను ఉల్లంఘించి ఈ వీడియో చిత్రీకరించారా? అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

    పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో, వీడియో నిజమైనదేనా? డ్రోన్ ఎలా, ఎక్కడి నుంచి ఎగిరింది? అవసరమైన అనుమతులు తీసుకున్నారా? అనే అంశాలపై విచారణ జరుగుతోందని తెలిపారు. చట్టాలు, డ్రోన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

    పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణ ప్రారంభించారు. న్యూఢిల్లీ జిల్లా అత్యంత భద్రత కలిగిన ప్రాంతం కావడంతో అక్కడ డ్రోన్ ఎగరాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. అనుమతి లేకుండా డ్రోన్ వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు.

  • 20 July 2026 7:25 PM IST

    సీజేపీ నిరసనకు షబానా అజ్మీ మద్దతు..

    సీనియర్ నటి షబానా అజ్మీ సోమవారం ఢిల్లీలో జరిగిన సీజేపీ (కాక్‌రోచ్ జనతా పార్టీ) 'చలో సంసద్' నిరసనలో పాల్గొని మద్దతు తెలిపారు. పోటీ పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అవకతవకలపై జవాబుదారీతనం ఉండాలని, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులకు ఆమె సంఘీభావం ప్రకటించారు.

    "శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించింది. మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గాన్నే మేము అనుసరిస్తున్నాం. హింసకు మాకు ఎలాంటి ఉద్దేశం లేదు" అని షబానా అజ్మీ పీటీఐతో అన్నారు.

    తాను, ప్రముఖ గేయరచయిత జావేద్ అక్తర్ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసి, నిరసనకారులతో చర్చలు ప్రారంభించాలని కోరినట్లు షబానా వెల్లడించారు.

  • 20 July 2026 5:57 PM IST

    వాంగ్‌చుక్ భార్యపై దాడి జరగలేదు: ఢిల్లీ పోలీసులు

    సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మోపై ఢిల్లీ పోలీసులు దాడి చేశారని, జుట్టు పట్టుకుని లాగారని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. నిరసన సందర్భంగా గీతాంజలి ఆంగ్మోపై పోలీసు సిబ్బంది శారీరకంగా దాడి చేశారన్న వార్తలు నిజం కాదని పేర్కొన్నారు.

    "ఎవరిపైనా ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదు. వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని బలప్రయోగం చేశారన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. అలాంటి ప్రచారం పూర్తిగా నిరాధారం" అని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

    NEET-UG 2026 ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతుండగా, ఈ వివరణను పోలీసులు విడుదల చేశారు.

  • 20 July 2026 5:41 PM IST

    సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

    సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వైద్య నివేదికలు, తాజా పరీక్షల ఫలితాలు సమర్పించాలని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. వాంగ్‌చుక్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలన్న పిటిషన్‌పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

    ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ, న్యాయమూర్తి తేజస్ కారియాల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ సందర్భంగా, తాజా రక్త పరీక్షల ఫలితాలు కూడా నివేదికలో ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.

    అలాగే, ఎయిమ్స్ ఇన్‌చార్జి డైరెక్టర్, వాంగ్‌చుక్‌కు చికిత్స అందిస్తున్న ఎయిమ్స్ అత్యవసర విభాగం వైద్యుడు, గతంలో చికిత్స చేసిన డాక్టర్ తదుపరి విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ప్రైవేట్ ల్యాబ్‌లో చేసిన రక్త పరీక్షల నివేదికలను సమర్పించాలని గీతాంజలి ఆంగ్మోకు సూచించింది.

    తన భర్తను అరెస్టు చేయకపోయినా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికే పరిమితం చేశారని, రోగికి చికిత్సను ఎంచుకునే హక్కును పరిగణనలోకి తీసుకోలేదని గీతాంజలి ఆంగ్మో తన అప్పీల్‌లో పేర్కొన్నారు.

    NEET పేపర్ లీక్ ఆరోపణ నేపథ్యంలో జూన్ 28 నుంచి నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్‌ను, దీక్ష 21వ రోజున ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ నుంచి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు.

  • 20 July 2026 5:38 PM IST

    నిరసనకారులే చర్చలకు వచ్చారు: జేపీ నడ్డా

    కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సోమవారం నిరసనకారులతో జరిగిన చర్చలపై స్పందించారు. ప్రభుత్వంతో చర్చలు జరపాలని ముందుగా నిరసనకారులే ప్రతిపాదన తీసుకొచ్చారని తెలిపారు.

    ఎక్స్‌లో ఆయన ఇలా పోస్టు చేశారు. "ఈ ఉదయం తొలిసారిగా నిరసనకారుల నుంచి చర్చలకు ప్రతిపాదన వచ్చింది. ఉదయం 11:50 గంటల నుంచి వారితో చర్చలు కొనసాగుతున్నాయి" అని నడ్డా పేర్కొన్నారు.

    చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, నిరసనకారుల ప్రతినిధి బృందం తమ డిమాండ్లపై మొదట మౌఖికంగా విస్తృతంగా చర్చించిందని చెప్పారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో తమ డిమాండ్లతో కూడిన లిఖితపూర్వక వినతిపత్రాన్ని సమర్పించినట్లు వెల్లడించారు.

    ఆందోళన విరమించాలని నిరసనలో పాల్గొంటున్న వారందరిని జేపీ నడ్డా కోరారు. "ధర్నాను ముగించి, సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు పరిపాలనకు సహకరించాలి" అని ఆయన కోరారు.

  • 20 July 2026 5:00 PM IST

    NEET నిరసనలపై ప్రియాంక ఫైర్..

    కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా NEET-UG 2026 ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో నిరసన చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు తీసుకున్న చర్యను తీవ్రంగా విమర్శించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజు పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన ఆమె, విద్యా విధానంలో ఉన్న సమస్యలపై చర్చించాలని ప్రతిపక్షం పదేపదే కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు.

    "విద్యా విధానంపై అనేక సమస్యలు ఉన్నాయి. వాటిపై చర్చ జరగాలని మేమంతా కోరుతున్నాం. కానీ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేదు" అని ప్రియాంక విమర్శించారు.

    ఢిల్లీలో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసుల చర్యను ప్రస్తావిస్తూ, "చర్చకు బదులుగా విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు, లాఠీలతో కొడుతున్నారు. ఎందుకు? వాళ్లు మన పిల్లలే కదా" అని ప్రశ్నించారు.

  • 20 July 2026 4:33 PM IST

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై జేపీ నడ్డా ఎలాంటి హామీ ఇవ్వలేదు: సీజేపీ

    కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి తమ డిమాండ్లను వినిపించినట్లు పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే రాజీనామా చేయించాలని లేదా పదవి నుంచి తొలగించాలని ప్రధానంగా కోరినట్లు ఆయన వెల్లడించారు. అయితే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై జేపీ నడ్డా ఎలాంటి హామీ ఇవ్వలేదని సీజేపీ స్పష్టం చేసింది. 

  • 20 July 2026 4:20 PM IST

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: పవన్ ఖేరా

    పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ వెలుపల జరుగుతున్న నిరసనలను కాంగ్రెస్ నేత పవన్ ఖేరా సమర్థించారు. "ప్రజల సమస్యలను వినిపించాలంటే పార్లమెంట్ దగ్గర కాకుండా ఇంకెక్కడ నిరసన చేయాలి? ప్రజల గొంతు వినాల్సింది ప్రభుత్వమే. అందుకే పార్లమెంట్ వద్దే ఆందోళన చేస్తున్నాం" అని ఆయన అన్నారు. పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న యువత మాటలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. "దేశ యువత తమ భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ మీ వద్దకు వస్తే ప్రభుత్వం భయపడుతోంది. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం?" అని ప్రశ్నించారు. సీజేపీ డిమాండ్లను ప్రభుత్వం అమలు చేస్తే, ప్రతిపక్షం నుంచి పూర్తి సహకారం ఉంటుందని పవన్ ఖేరా అన్నారు. 

  • 20 July 2026 4:17 PM IST

    నిర్భయ నుంచి సీజేపీ వరకు..

    కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన 'చలో పార్లమెంట్' మార్చ్ సందర్భంగా పోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడం, పలువురిని అదుపులోకి తీసుకోవడం గత 15 ఏళ్లలో ఢిల్లీలో జరిగిన పలు చారిత్రక నిరసనలను గుర్తు చేసింది. అందులో ముఖ్యంగా 2021 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతుల ట్రాక్టర్ ర్యాలీని గుర్తుకు తెచ్చింది. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిపిన ఆందోళనలో భాగంగా నిరసనకారులు ఢిల్లీ కేంద్ర ప్రాంతంలోకి ప్రవేశించి పోలీసులతో ఘర్షణకు దిగారు. కొందరు ఎర్రకోటలోకి ప్రవేశించి నిశాన్ సాహిబ్తో పాటు రైతు సంఘాల జెండాలను ఎగురవేశారు. ఆ ఘటనలో 300 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు.

    ఇక సోమవారం జరిగిన సీజేపీ పార్లమెంట్ మార్చ్‌లో కూడా త్రివర్ణ పతాకాలు పట్టుకున్న కార్యకర్తలు బారికేడ్లను దాటి పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు బలప్రయోగం చేశారు.

    గతంలో కూడా ఢిల్లీ ఇలాంటి భారీ నిరసనలకు వేదికైంది. 2011లో అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం, లోక్‌పాల్ చట్టం కోసం లక్షల మందిని వీధుల్లోకి తీసుకొచ్చింది. 2012 నిర్భయ ఘటన తర్వాత పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ వైపు భారీ నిరసన ర్యాలీలు జరిగాయి. 2019-20లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు,

    రైతుల ఏడాది పాటు సాగిన ఉద్యమం, 2023లో రెజ్లర్ల నిరసనలు కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన సీజేపీ 'చలో సంసద్' మార్చ్ కూడా ఢిల్లీలో జరిగిన ప్రముఖ ప్రజా ఉద్యమాల జాబితాలో మరో ముఖ్యమైన నిరసనగా నిలిచింది.

  • 20 July 2026 3:59 PM IST

    అభిజీత్ దీప్కేను అరెస్టు చేయలేదు: సీజేపీ

    కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు అరెస్టు చేయలేదని పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ సోమవారం స్పష్టం చేశారు. అభిజీత్‌ను అరెస్టు చేశారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు. "దీప్కే ప్రస్తుతం పోలీసుల అదుపులో లేరు. ఆయనను అరెస్టు చేయలేదు" అని పేర్కొన్నారు.

Read More
Next Story