పార్లమెంట్ ముట్టడికి సీజేపీ పిలుపు.. ఢిల్లీలో హై టెన్షన్!
x

పార్లమెంట్ ముట్టడికి సీజేపీ పిలుపు.. ఢిల్లీలో హై టెన్షన్!

బారికేడ్లు బద్దలు.. పోలీసులతో నిరసనకారుల ఘర్షణ


Click the Play button to hear this message in audio format

ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజే...రాజధాని వీధులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. వేలాది మంది విద్యార్థులు, యువత 'చలో సంసద్' పేరుతో పార్లమెంట్ వైపు కదిలారు. మరోవైపు...పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిరసనకారులు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో...ఘర్షణలు చోటుచేసుకున్నాయి. లాఠీలు కూడా వాడినట్లు వార్తలు వచ్చాయి. ఇంతకు ఢిల్లీలో ఏం జరిగిందో తెలుసుకుందాం.


కాక్రోచ్ జనతా పార్టీ పిలుపుతో.. వేలాది మంది విద్యార్థులు, యువ కార్యకర్తలు ఢిల్లీకి చేరుకున్నారు. NEET పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


పార్లమెంట్ మార్చ్‌ను దృష్టిలో పెట్టుకుని...ఢిల్లీ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మూడు అంచెల భద్రత అమలు చేశారు. ఐదు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు కూడా అమల్లోకి వచ్చాయి.


ఇటు వేలాది మంది నిరసనకారులు టాల్‌స్టాయ్ మార్గ్ - సంసద్ మార్గ్ కూడలి వరకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో...పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో... పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. లాఠీచార్జీ కూడా చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.


కొంత ఉద్రిక్తత తర్వాత...పోలీసులు కొన్ని బారికేడ్లను తొలగించినట్లు సమాచారం.దీంతో...నిరసనకారులు పార్లమెంట్ వైపు తమ మార్చ్‌ను కొనసాగించారు. అయితే...లాఠీచార్జ్ లేదా అరెస్టులపై ఢిల్లీ పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.


ఈ నిరసన...పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే జరగడం గమనార్హం. ఒకవైపు పార్లమెంట్‌లో ప్రతిపక్షం...

మరోవైపు బయట విద్యార్థుల ఆందోళన...దీంతో...NEET అంశం మరోసారి జాతీయ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.

మొత్తానికి...'చలో సంసద్' మార్చ్‌తో ఢిల్లీ మరోసారి ఉద్రిక్తంగా మారింది.


నిరసనకారులు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు...శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇక ఈ నిరసనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎలాంటి చర్చ జరుగుతుంది? అనేదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Live Updates

  • 20 July 2026 3:55 PM IST

    జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధుల భేటీ.. మూడు ప్రధాన డిమాండ్లు..

    'చలో సంసద్' మార్చ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కాక్రోచ్ జనతా పార్టీని చర్చలకు ఆహ్వానించింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో సీజేపీ అధికార ప్రతినిధి ఆశుతోష్ రాంకా మాట్లాడారు. తాము జేపీ నడ్డాను ఆయన నివాసంలో సుమారు 10 నిమిషాల పాటు సమావేశమైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముందు మూడు ప్రధాన డిమాండ్లను ఉంచినట్లు ఆయన వెల్లడించారు.

    ‘‘ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను వెంటనే విడుదల చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. NEET పరీక్షల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.’’ అనేవి ప్రధాన డిమాండ్లు. ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

  • 20 July 2026 3:43 PM IST

    ఢిల్లీలో 5 మెట్రో స్టేషన్లు మూసివేత.. ఇబ్బందుల్లో ప్రయాణికులు

    కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన 'చలో సంసద్' మార్చ్ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని ఐదు కీలక మెట్రోస్టేషన్లు రాజీవ్ చౌక్,జన్‌పథ్, పటేల్ చౌక్ సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థను తాత్కాలికంగా మూసివేసింది. పార్లమెంట్ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేయడంతో...ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉదయం ఉద్యోగాలకు, కాలేజీలకు వెళ్తున్న వారు ఒక్కసారిగా ఇబ్బందులు పడ్డారు. చాలామంది...మరో స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. మరికొందరు ఆటోలు, బస్సులు, క్యాబ్‌లను ఆశ్రయించారు. 

Read More
Next Story