పంచదార్ల కొండపై ఏమి జరుగుతోంది?
గ్రావెల్ తవ్వకాలకు ఈ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. తిరిగి రద్దు చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల కొండల్లో రెవెన్యూ భూములపై జరుగుతున్న గ్రావెల్, మట్టి తవ్వకాలు సాధారణ మైనింగ్ కాదు. ఇది పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కి, శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం, సహజ జలధారలను ప్రమాదంలో పడేస్తున్న దందా. ఈ విషయంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కఠిన ఆదేశాలు జారీ చేయడంతో ఈ అక్రమాలు బహిరంగమయ్యాయి.
పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులతో మాట్లాడి, ప్రాథమిక నివేదికను పరిశీలించారు. మైనింగ్ అనుమతులు పొందిన సంస్థ పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టమైంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పీసీబీ అధికారులను ఆదేశించారు. అక్రమ గ్రావెల్, మట్టి తవ్వకాలకు పాల్పడిన సంస్థపై నిబంధనల మేరకు జరిమానా విధించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని, పర్యావరణ పునరుద్ధరణ బాధ్యతను కూడా వేయాలని దిశానిర్దేశం చేశారు. ఆ సంస్థకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు, ఎస్టాబ్లిష్‌మెంట్, ఆపరేషన్స్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని స్పష్టం చేశారు.
పంచదార్ల కొండ కేవలం గ్రావెల్ వనరు కాదు. ఇక్కడి దిగువన ఉన్న శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినది. పంచధారలుగా పేరొందిన సహజ జలధారలు ఆలయ ప్రాంగణంలో ప్రవహిస్తూ భక్తులకు పవిత్రతను అందిస్తున్నాయి. మైనింగ్ కారణంగా ఈ జలధారల రంగు మారుతున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జాతీయ జలవిజ్ఞాన సంస్థ (NIH) శాస్త్రవేత్తలను ఆహ్వానించి, జలధార మూలాలను పరిశీలించి శాస్త్రీయ నివేదికలు తీసుకోవాలని, సహజ ప్రవాహ సంరక్షణకు చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఆలయ పరిరక్షణకు పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ సంయుక్త కార్యాచరణ చేపట్టాలని నిర్దేశించారు. పంచదార్ల కొండ పరిసరాలను ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలని రెవెన్యూ, మైనింగ్ శాఖలకు సూచించారు.
ఈ దందా కేవలం ఒక సంస్థ అక్రమం మాత్రమే కాదు. పుణ్యక్షేత్రం చుట్టూ మైనింగ్ అనుమతులు ఎలా ఇచ్పారు? రెవెన్యూ భూముల్లో పర్యావరణ సున్నిత ప్రాంతంలో తవ్వకాలు ఎలా సాగాయి? ప్రాథమిక నివేదికల్లోనే ఉల్లంఘనలు కనిపించినప్పుడు, ఇంతకాలం అధికార యంత్రాంగం ఏం చేసింది? జలధారల రంగు మార్పు, ఆలయ భద్రత ప్రమాదం వంటి అంశాలు ఇప్పుడు తేలుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆదేశాలు ముఖ్యమైనవి. అయితే ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన సరిపోదు. సమగ్ర విచారణ పారదర్శకంగా, కాలపరిమితిలో పూర్తి కావాలి. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై జరిమానా, అనుమతుల రద్దు, పర్యావరణ పునరుద్ధరణ బాధ్యతలు నిజంగా అమలు కావాలి.
పురాతన ఆలయాలు, సహజ వనరుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వం మీద మాత్రమే కాదు, సమాజం మీద కూడా ఉంది. పంచదార్ల కొండలో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలు ఇప్పుడు కేవలం స్థానిక సమస్య కాదు. ఇది పర్యావరణం, వారసత్వం, ప్రజాస్వామ్య పాలన మధ్య జరుగుతున్న పోరాటం. పవన్ కళ్యాణ్ ఆదేశాలు అమలయితేనే ఈ దందాకు ముగింపు పలుకుతుంది. లేకపోతే జలధారలు ఎండిపోయి, ఆలయం చుట్టూ మట్టి దిబ్బలు మిగులుతాయి.

