జూన్ నాటికి పట్టణాల్లో 100 శాతం చెత్త క్లియర్
రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ముందుకెళ్తోంది. నేను 4వ సారి ముఖ్యమంత్రిగా పని చేస్తున్నాను. స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని 15 నెలలుగా నిర్వహిస్తున్నాం. ప్రతి నెలా 3వ శనివారం ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతున్నాను. ఈసారి జలధార-జలహారతి ధీమ్ తో ముందుకొచ్చాం. గత పాలకులు రాష్ట్రాన్ని చెత్తకుప్పగా మార్చేశారు. భూమి పైనే కాదు భూమి లోపల కూడా చెత్త వేశారు. ఎక్కడ చూసిన చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. ఒక పద్దతి ప్రకారం పని చేస్తున్నాం. ప్రజల్లోనూ చైతన్యం రావాలి. మన ఇల్లు, మన వీధి, మన ఊరు, మన ఆఫీసు, మన స్కూళ్లు, కాలేజీలు, పబ్లిక్ ప్లేస్‌లు, బీచ్‌లు, ఆలయాలు, పార్కులు పరిశుభ్రంగా ఉండాలి. జపాన్ లో రోడ్లపై ఒక్క చిన్న పేపర్ ముక్క కూడా కనిపించదు. ఆ స్పూర్తి మనలోనూ రావాలన్నారు.
ప్రతీ రోజూ పట్టణాల్లో 7,527 టన్నులు, గ్రామీణ ప్రాంతాల్లో 1,430 టన్నులు... మొత్తంగా 8,957 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణాల్లో 153 లక్షల టన్నుల చెత్తకు గాను, 114 లక్షల టన్నుల చెత్త తొలగించాం. ఈ జూన్ నాటికి 100 శాతం క్లియర్ చేస్తాం. ప్రభుత్వ చర్యలతో పట్టణాల్లో ఇంటింటికీ చెత్త సేకరణ 86 శాతం నుంచి 97 శాతానికి పెరిగింది. త్వరలోనే 100 శాతం సాధించేలా ఎలక్ట్రిక్ వాహనాలు తెస్తున్నాం. రాష్ట్రంలో చెత్త ప్రాసెసింగ్ 57 శాతం నుంచి 100 శాతానికి పెంచుతాం. రూ.603 కోట్లతో 107 ఆధునిక ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. అక్టోబర్ నాటికి ఇవన్నీ పని చేస్తాయి. స్వచ్ఛ రథాలు, గ్రీన్ షాప్స్ ద్వారా చెత్తను ఆదాయంగా మారుస్తున్నాం. రాష్ట్రంలోని 633 స్వచ్ఛ రథాలతో రోజుకు 125 టన్నుల పొడి చెత్త సేకరిస్తున్నాం. ఇప్పటి వరకు 12,371 గ్రామాలు ODF+ కి చేరుకోగా, సెప్టెంబర్‌కి అన్ని గ్రామాలను ODF+ గా చేస్తాం. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉండాలన్నారు.
ప్రతి ఒక్కరూ వంటింటి వ్యర్థ్యాలను కిచెన్ గార్డెన్ కు ఉపయోగించుకోవాలి. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి... 7.14 లక్షల కిచెన్ గార్డెన్స్, 1 లక్ష సోక్ పిట్స్, 8,000 కమ్యూనిటీ సోక్ పిట్స్, 100 కి.మీ. మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం. 13 నగరాలకు 71 స్వీపింగ్ యంత్రాలు సమకూర్చాం. మరో 14 యంత్రాలకు టెండర్లు పిలిచాం. 2028 నాటికి 6 Waste to Energy ప్రాజెక్టులు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 31.33 శాతంగా ఉన్న గ్రీన్ కవర్‌ను... 2030 నాటికి 37 శాతానికి, 2047 కల్లా 50 శాతానికి పెంచే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. సర్క్యులర్ ఎకానమీలో ఇండస్ట్రియల్ పార్కులు తీసుకొస్తున్నాం"అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి హామీలు
నియోజకవర్గ ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు చదివి వినిపించారు. వివిధ శాఖల పనితీరుకు సంబంధించిన నివేదికలను వివరించారు. పనితీరు సరిగా లేని అధికారులను వివరణ అడిగారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. అధికారులకు సహకరిస్తామని, వారంతా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పరిశ్రమలు తక్కువగా వస్తున్నాయని, ఇక్కడ వ్యవసాయంపైన ఆధారపడే వారు ఎక్కువగా ఉండటమే అందుకు కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఈ ప్రాంతంలో ఆక్వా కల్చర్ వల్ల రైతులకు కొంత వెసులుబాటు వచ్చింది. ఆక్వా వల్ల పొల్యూషన్ లేకుండా చర్యలు తీసుకుంటాం. కుళాయి ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందిస్తాం. నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత. స్థానికంగా చిన్న కాశిరేవు వంతెన పునర్మిర్మాణం చేపడతాం. ఇండోర్ స్టేడియం నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తాం. ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆస్పత్రిగా మారుస్తాం. ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి చేస్తాం. కంసాలిపాలెం నుంచి మాధవ వరం వరకు వంతెన నిర్మాణం, ఎర్ర కాలువ గండ్లు పూడ్చివేతతో పాటు రహదారుల నిర్మాణం, టిడ్కో ఇళ్లు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రామానాయుడు, కందుల దుర్గేష్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి సహా పలువురు ఉన్నతాధికారులు, నేతలు పాల్గొన్నారు.