బీఎస్పీ పతనం..చిరాగ్‌కు ఛాన్స్! యూపీ రాజకీయాల్లో పాగా వేయడం సాధ్యమేనా?
x

బీఎస్పీ పతనం..చిరాగ్‌కు ఛాన్స్! యూపీ రాజకీయాల్లో పాగా వేయడం సాధ్యమేనా?

బీఎస్పీ బలహీనతను అవకాశంగా మలచుకోవాలని ప్రయత్తిస్తోన్న చిరాగ్ పాశ్వాన్.. 2027 యూపీ ఎన్నికల్లో దళిత ఓటర్లను ఆకర్షించి సత్తా ఉందా?


Click the Play button to hear this message in audio format

ఉత్తరప్రదేశ్ - 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, దళిత ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఒకప్పుడు యూపీ రాజకీయాల్లో కీలక శక్తిగా ఉన్న బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) బలహీనపడటంతో ఆ పార్టీ ఓటు బ్యాంకుపై అందరి దృష్టి పడింది. ఇప్పుడు ఈ పోటీలోకి కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ కూడా ప్రవేశిస్తున్నారు.


403 స్థానాల్లో పోటీకి సిద్ధం..

సీట్ల పంపకంలో తమకు తగిన ప్రాధాన్యం ఇస్తే.. భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో కలిసి లేదా స్వతంత్రంగా యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని చిరాగ్ ప్రకటించారు. ముఖ్యంగా పాసీ సహా జాటవేతర దళిత వర్గాల్లో మద్దతు పెంచుకోవాలని ఆయన భావిస్తున్నారు. బీహార్‌లో తనకు ఉన్న రాజకీయ బలాన్ని ఉత్తరప్రదేశ్‌లోనూ విస్తరించాలన్నది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది.


క్షీణిస్తున్న బీఎస్పీ.. పెరుగుతున్న పోటీ..

అయితే, యూపీలో చిరాగ్‌కు రాజకీయంగా ఎదగడం అంత సులభం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర జనాభాలో దళితుల వాటా సుమారు 21 శాతం. వీరిలో పాసీ వర్గం కూడా రాజకీయంగా కీలకమైనది. ఒకప్పుడు దళిత ఓటర్లపై బలమైన పట్టున్న బీఎస్పీ ..ఇప్పుడు వరుస ఎన్నికల్లో తన ప్రభావాన్ని కోల్పోతోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 22.23 శాతంగా ఉన్న బీఎస్పీ ఓట్ల వాటా 2022లో 12.88 శాతానికి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో 9.4 శాతానికి పడిపోయింది.


బీఎస్పీ ఓటర్ల కోసం ప్రధాన పార్టీల పోటీ..

బీఎస్పీ బలహీనతను అవకాశంగా తీసుకుని, ఆ పార్టీకి దూరమైన ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ కూటమి జాటవేతర దళితుల్లోనూ మద్దతు సంపాదించింది. దీంతో ఈ ఓటర్లను తమవైపు తిప్పుకోవడం ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది.


చిరాగ్‌కు పోటీగా ఇతర పార్టీలు..

మరోవైపు, నిషాద్ పార్టీ, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలు కూడా కుల సమీకరణాల ఆధారంగా తమ బలాన్ని పెంచుకుంటున్నాయి. చంద్రశేఖర్ ఆజాద్‌కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీ కూడా దళిత రాజకీయాల్లో మరో ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్‌లో చిరాగ్ పాశ్వాన్‌కు ఉన్న ఆదరణ యూపీలోనూ దక్కుతుందని భావించడం సరికాదని విశ్లేషకులు అంటున్నారు.


గత ఎన్నికల్లో ఎల్‌జేపీకి నిరాశే..

ఎల్‌జేపీ గత ఎన్నికల ప్రదర్శన కూడా చిరాగ్‌కు పెద్దగా ఊరటనివ్వడం లేదు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. అయితే, ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. వచ్చిన ఓట్ల వాటా కేవలం 0.01 శాతం మాత్రమే. ప్రస్తుతం సంస్థాగత బలాన్ని పెంచుకుంటున్నామని ఎల్‌జేపీ చెబుతున్నా ఆ ప్రయత్నాలు ఎన్నికల విజయాలుగా మారతాయా అన్నది ప్రశ్నార్థకమే.


బీజేపీకి చిరాగ్ అవసరం ఎంతవరకు?

ఎల్‌జేపీని బీజేపీ తన వ్యూహంలో భాగంగా ఉపయోగించుకోవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. జాటవేతర దళిత ఓటర్లలో కోల్పోయిన మద్దతును తిరిగి పొందేందుకు చిరాగ్ పార్టీ ఉపయోగపడవచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే, పాసీ ఓటర్లలో బీజేపీకి ఇప్పటికే కొంత మద్దతు ఉందని ఆ వర్గాలను ఆకర్షించేందుకు బీజేపీకి సొంత నాయకులు, మిత్రపక్షాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.


సీట్ల సర్దుబాటే అసలు చిక్కు..

ఇక్కడ మరో కీలకమైన సమస్య సీట్ల పంపకం. యూపీలో బీజేపీ ఇప్పటికే నిషాద్ పార్టీ, అప్నా దళ్, ఎస్‌బీఎస్‌పీ, ఆర్‌ఎల్‌డీ వంటి మిత్రపక్షాలతో కలిసి పనిచేస్తోంది. వీరందరికీ సీట్లు కేటాయించిన తర్వాత చిరాగ్ పాశ్వాన్‌కు ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కుతాయా అన్నది అనుమానమే. ఒకవేళ ఆయన ఒంటరిగా పోటీ చేసినా, ఓట్లు చీలడం మినహా పార్టీకి ఎంతవరకు ప్రయోజనం ఉంటుందో స్పష్టంగా లేదు.


2027లో చిరాగ్‌కు అసలైన సవాల్..

మొత్తానికి, యూపీ దళిత రాజకీయాల్లో పాగా వేయాలంటే చిరాగ్ పాశ్వాన్‌కు కుల సమీకరణాలు మాత్రమే సరిపోవు. బలమైన పార్టీ నిర్మాణం, క్షేత్రస్థాయి నాయకత్వం, ప్రజలతో నిరంతర సంబంధాలు అవసరం. 2027 ఎన్నికలు ఆయన రాజకీయ ప్రాధాన్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడవచ్చు. కానీ, ఉత్తరప్రదేశ్‌లో తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకును నిర్మించుకోవడం మాత్రం చిరాగ్‌కు అసలైన సవాలుగా మారనుంది.

Read More
Next Story