ఉమ్మడి చిత్తూరు జిల్లా రోడ్లపై మోగుతున్న చావుడప్పు
x

ఉమ్మడి చిత్తూరు జిల్లా రోడ్లపై మోగుతున్న చావుడప్పు

తిరుపతికి వచ్చే 4 ప్రధాన రోడ్లపై ప్రతి నిత్యం ప్రమాదాలే.


ఉమ్మడి చిత్తూరు జిల్లా రోడ్లు ప్రతినిత్యం రక్తమోడుతున్నాయి. ఏటికేడాది తగ్గాల్సిన ప్రమాదాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జరిగే ప్రమాదాల్లో ఎక్కువగా ఘాట్ రోడ్లలోనే జరుగుతున్నాయి. ప్రధానంగా భాకరాపేట, మొగిలి ఘాట్ లో మరణమృదంగం కొనసాగుతోంది. రోడ్ల నిర్మాణంలో డిజైన్ల లోపంతో పాటు వాహనాలు నడిపే వాళ్ల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలవుతున్నాయి.



పలమనేరు నుంచి మొగిలి ఘాట్ వరకు 10 కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్. మొగిలి ఘాట్ లో ఒకటిన్నర కిలోమీటర్ అత్యంత ప్రమాదకరం. సముద్ర మట్టానికి దాదాపు 800 మీటర్ల ఎత్తులో ఉన్న మొగలి ఘాట్ రోడ్డు. తిరుపతి నుంచి చిత్తూరు వరకు సిక్స్ లైన్స్, చిత్తూరు నుంచి కర్ణాటక బోర్డర్ వరకు ఫోర్ లైన్స్ నేషనల్ హైవేలో మొగలి ఘాట్ డేంజరస్ స్పాట్. ఒక్కో లైన్ 60 అడుగులు ఉండాల్సిండగా మొగిలి ఘాట్ లో ఫోర్ లైన్స్ రోడ్డు కాస్తా 150 అడుగుల్లోపే ఉండడంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. మలుపులు ఉన్న చోట మరింత వెడల్పుగా ఉండాల్సిన రోడ్డు కుచించుకుపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఘాట్ రోడ్డులో బ్లింక్లర్లు, క్రాష్ బ్యారియర్స్ లేకపోవడంతో ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఘాట్ రోడ్లు అటవీ ప్రాంతం పరిధిలో ఉండటం వల్ల విస్తరణకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఫారెస్ట్ పర్మిషన్లు లేవంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు.


తిరుపతి జిల్లా చంద్రగిరి పీఎస్ పరిధిలో ఐతేపల్లి నుంచి గాదంకి టోల్ ప్లాజా వరకు గత 2023 జనవరి నుంచి ఇప్పటిదాకా 112 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 67 మంది చనిపోయారు. 112 మంది గాయపడ్డారు. భాకరాపేట ఘాట్ లో ఏడాది కాలంలో 10 ప్రమాదాలు 11 మంది మృతి చెందారు. 18 మంది గాయపడ్డారు.చిత్తూరు జిల్లాలో 2023లో 702 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 351 మంది మృతి చెందారు. 6503 మంది క్షతగాత్రులుగా మిగిలారు. 2024లో ఇప్పటివరకు 500 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 249 మంది మృత్యువాత పడగా 624 మంది గాయపడ్డారు.ఇక మొగిలి ఘాట్ అత్యంత ప్రమాదకరం. 2019 నవంబర్ 9న మొగిలి ఘాట్ రోడ్ లో జరిగిన ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డారు.2019 సెప్టెంబర్ 14న బెంగళూరు చిత్తూరు జాతీయ రహదారిపై మామడుగు వద్ద ఐదుగురు సజీవ దహనమయ్యారు.


2016 జనవరి 24న తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఇనోవాను ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.2015 నవంబర్ 20న మొగలి ఘాట్ లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకే కారులో ప్రయాణిస్తున్న 5 మంది చనిపోయారు. 2024 ఫిబ్రవరి నెలలో చెర్లోపల్లి వద్ద అంబులెన్స్ బోల్తా పడటంతో అందులోని ఉత్తరప్రదేశ్ కు చెందిన చెందిన ముగ్గురు చనిపోయారు. 2024 జనవరి లో కాణిపాకం సమీపంలోని చిగరపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో రెండు కార్లు ఢీకొనడంతో ఐదుగురు చనిపోయారు. తిరుపతి నుంచి చిత్తూరు వరకు 140 జాతీయ రహదారి ఉండగా చిత్తూరు నుంచి బెంగళూరు చెన్నై ఎన్ హెచ్ 4 జాతీయ రహదారి ఉంది. తిరుపతి నుండి కర్ణాటక బార్డర్ వరకు 137 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది. తిరుపతి నుంచి కర్ణాటక బార్డర్ వరకు చిత్తూరు జిల్లాలో పరిధిలోని ఐతేపల్లి, బి.కొత్తకోట, కాణిపాకం వద్ద గల చిగరపల్లి, బంగారు పాల్యం, మొగిలి ఘాట్ రోడ్, గంగవరం మండలంలోని మామడుగు ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్స్ గా గుర్తింపు. తిరుపతి నుంచి 130 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ఉంది. తిరుపతి నుంచి పలమనేరు మీదుగా కర్ణాటక రాష్ట్రానికి జాతీయ రహదారి విస్తరణ జరగలేదు.ఐతేపల్లి నుంచి కర్ణాటక రాష్ట్ర సరిహద్దు వరకు 90 కిలోమీటర్ల మేర తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 90 కిలోమీటర్ల ఈ జాతీయ రహదారిపై 5 డెడ్లీ ఆక్సిడెంట్ జోన్లను అధికారులు గుర్తించారు. అవి మొగిలి, కేజీ సత్రం, చిగరపల్లి, పూతలపట్టు, నేండ్రగుంట, ఐతేపల్.లి అందులో మొగలి ఘాట్ లో అత్యధిక ప్రమాదాలు నమోదు అయ్యాయి. గత ఏడాది కాలంలో మొగిలి ఘాట్ రోడ్ లో జరిగిన 15 ప్రమాదాల్లో 15 మంది మృతి చనిపోయారు. 45 మంది గాయపడ్డట్టు పోలీసు రికార్డుల్లో నమోదయింది. ఈ మృత్యుఘోషను ఆపేందుకు తక్షణమే అధికారులు ఏదో ఒకటి చేయకపోతే భావితరాలు మరింత నష్టపోవాల్సి వస్తుంది.


Read More
Next Story