ఉద్యోగులకు గుడ్‌బై చెప్పినా భారీ ప్రయోజనాలు!
x

ఉద్యోగులకు గుడ్‌బై చెప్పినా భారీ ప్రయోజనాలు!

టెక్ దిగ్గజం కాన్వా సుమారు 1,271 మంది ఉద్యోగులపై వేటు వేసింది. అయితే ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉచిత మ్యాక్‌బుక్, ఏడాది ఆరోగ్య బీమా, కెరీర్ సపోర్ట్‌ ఇస్తోంది.


Click the Play button to hear this message in audio format

టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపుల పరంపర కొనసాగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల బాటలోనే ప్రముఖ డిజైన్ ప్లాట్‌ఫామ్ కాన్వా కూడా ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ నిర్ణయంతో సుమారు 1,271 మంది ఉద్యోగులు ప్రభావితమవుతున్నట్లు సమాచారం.

అయితే ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ, వారికి అందిస్తున్న ప్రయోజనాలు మాత్రం ఇప్పుడు టెక్ రంగంలో చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా ఉద్యోగం కోల్పోవడం అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడమే. కానీ కాన్వా మాత్రం ఉద్యోగులు కొత్త అవకాశాలను వెతుక్కునే వరకు అండగా నిలిచేలా ప్రత్యేక సెవరెన్స్ ప్యాకేజీని ప్రకటించింది. కంపెనీ ఆదాయ వృద్ధి అంచనాలు గతంలో ఉన్న 30 శాతం నుంచి 20 శాతానికి తగ్గడంతో ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలుస్తోంది.


‘ప్రసూతి సెలవులో ఉండగా ఉద్యోగం పోయింది’

కాన్వా మాజీ ఉద్యోగి శ్రద్ధా ఖులే తన ఉద్యోగ విరమణ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ ప్యాకేజీ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

జూలై 2023 నుంచి కాన్వాలో క్యూఏ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆమెకు, ప్రసూతి సెలవులో ఉన్న సమయంలోనే తన ఉద్యోగం ప్రభావితమైన విషయం తెలిసింది. తన లింక్డ్‌ఇన్ పోస్టులో ఆ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

తన భర్త ఉద్యోగం గురించి ఆ వార్త చెప్పిన సమయంలో తాను ఏడాది, ఐదేళ్ల వయసున్న పిల్లలతో ప్రశాంతంగా ఉదయం గడుపుతున్నానని తెలిపారు. ఆ రోజు తనకు ఇలాంటి వార్త ఎదురవుతుందని అస్సలు ఊహించలేదని పేర్కొన్నారు.

అయితే ఉద్యోగం కోల్పోయిన బాధ ఉన్నప్పటికీ, కాన్వాలో పనిచేసిన అనుభవాన్ని ఆమె సానుకూలంగా గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా ప్రసూతి సెలవు సమయంలో సంస్థ నుంచి లభించిన సహకారం, అర్థం చేసుకున్న తీరు తనకు ఎంతో విలువైనవని చెప్పారు.

ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ సమయంలో కూడా సంస్థ ప్రభావితమైన సిబ్బంది పట్ల చూపిస్తున్న శ్రద్ధ, మద్దతు అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.


ఉచిత మ్యాక్‌బుక్‌తో పాటు ఏడాది పాటు ఆరోగ్య సంరక్షణ!

కాన్వా అందిస్తున్న సెవరెన్స్ ప్యాకేజీలోని కొన్ని ప్రయోజనాలు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా సొంత ల్యాప్‌టాప్ లేని ఉద్యోగులు కంపెనీ అందించిన మ్యాక్‌బుక్‌ను తమ వద్దే ఉంచుకోవచ్చు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త సంస్థల్లో అవకాశాల కోసం ప్రయత్నించేటప్పుడు అవసరమైన పరికరం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ సదుపాయం కల్పిస్తున్నారు. అంతేకాదు, ఉద్యోగులకు మరో ఏడాది పాటు లింక్డ్‌ఇన్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తున్నారు.

కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి వన్-ఆన్-వన్ కెరీర్ కోచింగ్, ఇంటర్వ్యూలకు ప్రత్యేక శిక్షణ, ఉద్యోగ అవకాశాల అన్వేషణలో మార్గదర్శకత్వం వంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మాజీ ఉద్యోగులకు కంపెనీ పూర్వ ఉద్యోగుల టాలెంట్ డైరెక్టరీలో చోటు కల్పిస్తోంది. దీని ద్వారా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలను అన్వేషించేందుకు వీలుంటుంది.

ఇక ఆరోగ్య సంరక్షణ విషయంలోనూ సంస్థ వెనక్కి తగ్గలేదు. ప్రభావిత ఉద్యోగులకు 12 నెలల పాటు హెల్త్ కేర్ కవరేజ్ అందిస్తోంది.

సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి 10,000 డాలర్ల వరకు గ్రాంట్ కూడా అందిస్తున్నట్లు సమాచారం. అంటే ఉద్యోగం కోల్పోయిన వారు మరో ఉద్యోగం వెతుక్కోవడమే కాకుండా, సొంతంగా వ్యాపారం ప్రారంభించే అవకాశాన్ని కూడా ఈ ప్యాకేజీ ప్రోత్సహిస్తోంది.


మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ ప్యాకేజీలు ఎలా ఉన్నాయి?

ఉద్యోగులను తొలగించిన తర్వాత వారికి ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్న సంస్థ కాన్వా మాత్రమే కాదు. ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఇలాంటి విధానాలను అనుసరిస్తున్నాయి.

మెటా: ఇటీవల స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ఆఫర్ (VEO)ను ప్రకటించింది. ఈ పథకం కింద సంస్థను విడిచి వెళ్లే ఉద్యోగులకు ప్రతి ఏడాది సర్వీసుకు 2.5 నెలల జీతం చొప్పున సెవరెన్స్ ప్రయోజనం అందించనుంది. అదనంగా, వారి స్థూల జీతంలో 80 శాతం చొప్పున చెల్లించే 10 నెలల మొబిలిటీ లీవ్‌ను కూడా అందిస్తోంది.

గూగుల్: ఉద్యోగుల సేవా కాలాన్ని బట్టి సెవరెన్స్ ప్యాకేజీని నిర్ణయిస్తోంది. ప్రతి ఏడాది సేవకు ఒక నెల జీతం చొప్పున చెల్లించే విధానం ఉంది. అయితే ఈ ప్రయోజనానికి గరిష్ఠంగా 12 నెలల పరిమితి వర్తిస్తుంది.

మైక్రోసాఫ్ట్: ఉద్యోగుల తొలగింపులకు సంబంధించి ప్రాంతాల ఆధారంగా వేర్వేరు చెల్లింపు విధానాలను అనుసరిస్తోంది. ఉద్యోగులు పనిచేసే ప్రాంతం, వర్తించే నిబంధనలను బట్టి ప్యాకేజీలు మారుతున్నాయి.


AI వైపు టెక్ కంపెనీల అడుగులు.. ఉద్యోగులకు కొత్త సవాళ్లు!

ఈ పరిణామాలన్నీ టెక్ పరిశ్రమలో జరుగుతున్న భారీ మార్పులకు సంకేతంగా కనిపిస్తున్నాయి. కంపెనీలు తమ సంప్రదాయ వ్యాపార విభాగాల్లో ఖర్చులను తగ్గించుకుంటూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పెట్టుబడులను పెంచుతున్నాయి.

అయితే ప్రతి సంస్థ తనదైన వ్యూహంతో ముందుకు వెళ్తోంది. గూగుల్ తన డీప్‌మైండ్ AI విభాగాన్ని కొన్ని పునర్వ్యవస్థీకరణ చర్యల నుంచి మినహాయించగా, మైక్రోసాఫ్ట్ తన కీలక కోపైలట్ బృందాలను అర్హత కలిగిన విభాగాల్లో చేర్చింది.

మొత్తానికి టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నప్పటికీ, ఉద్యోగం కోల్పోయిన వారికి అందించే సెవరెన్స్ ప్యాకేజీల విషయంలో కంపెనీలు కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాయి.

ఉద్యోగం పోవడం ఎవరికైనా బాధాకరమే. కానీ ఆ తర్వాతి జీవితాన్ని తిరిగి నిర్మించుకునేందుకు ఆర్థిక భద్రత, ఆరోగ్య సంరక్షణ, కెరీర్ మార్గదర్శకత్వం అందించడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో కాన్వా ప్రకటించిన ప్యాకేజీ టెక్ పరిశ్రమలో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది.

Read More
Next Story