స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌.. ఒమ‌న్‌!
x
మ‌స్క‌ట్‌లోని సుల్తాన్‌ బిన్ తారిఖ్ అల్ స‌య్య‌ద్ రాజ‌ప్రాసాదం

స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌.. ఒమ‌న్‌!

ఒమ‌న్ చ‌రిత్ర ఆస‌క్తిక‌రం..పార్టీలు లేని దేశం.. ఒమ‌న్‌.

ముస్లింల సంప్ర‌దాయ‌ క‌ట్టుబాట్ల నుంచి స‌ర‌ళీక‌ర‌ణ విధానాల‌తో స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే వెసులుబాటు, మ‌త‌సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌గా, రాచ‌రికంలో జ‌న‌రంజ‌క పాల‌న‌తో సంప‌న్న దేశాల్లో ఒక‌టిగా, అల‌నాటి మాన‌వ‌జాతి పుట్టినిల్లులో ఒక‌టిగా, ప్ర‌పంచ దేశాల్లో ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది ఒమ‌న్!


కొండ‌ల‌ను తొల‌గించి నిర్మించిన ఎక్స్‌ప్రెస్ వే

ఎటు చూసినా ప‌చ్చ‌ద‌నం లేని ఎత్తైన రాతి కొండ‌లు.. క‌నుచూపు మేర‌ వ్య‌వ‌సాయానికి ప‌నికిరాని ల‌క్ష‌ల హెక్టార్ల‌ బీడు భూములు.. ఏరులు, సెలయేళ్లు, నదులు కాన‌రాని ఎడారి ప్రాంతాలు.. ఎక్క‌డో దూరంగా విసిరేసిన‌ట్టుగా ఉండే ఊళ్లు.. విశాలంగా క‌నిపించే రోడ్లు.. అక్క‌డ‌క్క‌డ ఖ‌ర్జూర‌పు చెట్లు.. ఇలా విభిన్న శైలిలో ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌ను సంత‌రించుకున్న‌ దేశం ఒమ‌న్! అంతేనా? మాన‌వ‌జాతి పుట్టినిళ్లుగా గుర్తించ‌బ‌డిన 15 దేశాల్లో ఒక‌టిగా ఒమ‌న్ కు మ‌రో విశిష్ట‌త‌ ఉంది. ఈ ఎడారి దేశం క‌రువు కాట‌కాల‌తో కాకుండా సుసంప‌న్నంగా విరాజిల్లుతోంది. ఇప్ప‌టికీ రాచ‌రిక వ్య‌వ‌స్థ‌లో విజ‌య‌వంతంగా పాల‌న సాగుతోంది. ఉగ్ర‌వాదం, మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌కు దూరంగా ఇత‌ర దేశాల‌కు ఆద‌ర్శ‌నీయంగా నిలుస్తోంది. చిన్న దేశం.. పెద్ద సంప‌ద‌తో ప్ర‌పంచ దేశాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సొంతం చేసుకుంది. ఒమ‌న్ సంద‌ర్శ‌న‌కు వెళ్లిన ద ఫెడ‌ర‌ల్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తినిధి అక్క‌డ నుంచి ఆ దేశ తీరు తెన్నులు, అందచందాలు, సంస్కృతి, సంప్ర‌దాయాలు, ఇత‌ర ముస్లిం దేశాల‌కు భిన్న‌మైన క‌ట్టుబాట్లు, క్ర‌మ‌శిక్ష‌ణ వంటి వాటిపై అందిస్తున్న క‌థ‌నాల‌ను మీరూ అవ‌లోకించండి!

ఒమ‌న్ రాజ‌ధాని మ‌స్క‌ట్ న‌గ‌రం

ఒమ‌న్ చ‌రిత్ర ఆస‌క్తిక‌రం..

ఒమ‌న్ దేశ చ‌రిత్ర‌ను ప‌రికిస్తే ఎంతో ఆస‌క్తిని రేపుతుంది. ఒక‌ప్పుడు తూర్పు ప‌ర్షియా సామ్రాజ్యంలో ఒక అనుబంధ రాజ్యంగా ఉండేది. క్రీస్తు పూర్వం 563లో ఈ ప్రాంతం ప‌ర్షియా సామ్రాజ్యంలో క‌లిసింది. ఒక‌టో శ‌తాబ్దం నుంచి అర‌బ్బులు ఈ ప్రాంతంలో స్థిర‌ప‌డ్డారు. పురాత‌న కాలం నుంచి ఒమ‌న్ ఒక ముఖ్య‌మైన వ‌ర్త‌క కేంద్రంగా కొన‌సాగుతోంది. 1508లో మ‌స్క‌ట్ నౌకాశ్ర‌యాన్ని పోర్చుగీసు వారు ఆక్ర‌మించారు. కానీ వారిని 1650లో స్థానికులు వెళ్ల‌గొట్టి స్వాతంత్య్రాన్ని సాధించారు. దాదాపు నాలుగు శ‌తాబ్దాల కిందటే అంటే 1650లోనే పోర్చుగీసు వారిని వెళ్ల‌గొట్టి స్వ‌తంత్రాన్ని సాధించుకుంది. దీంతో అర‌బ్ దేశాల్లో అతి పురాత‌న‌మైన స్వ‌తంత్ర దేశంగా ఒమ‌న్ పేరొందింది. 1741లో ఒట్టొమ‌న్‌ల‌ను ఓడించి సుల్తాన్ బిన్ స‌యిద్ రాజ్య‌పాల‌న ప్రారంభించారు. అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అదే సుల్తాన్‌ల వంశ పాల‌న అప్ర‌తిహ‌తంగా కొన‌సాగుతోంది. చాలా దేశాల్లో ప్ర‌జ‌ల నుంచి ఎన్నికైన వారు ప్ర‌ధానులుగాను, దేశాధ్య‌క్షులుగాను ఉంటారు. కానీ ఇప్ప‌టికీ గ‌ల్ఫ్ దేశాల మాదిరిగానే ఒమ‌న్‌లోనూ రాచ‌రిక‌ (సుల్తాన్‌ల‌) పాల‌న కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం ఈ దేశ సుల్తాన్‌గా హైథమ్ బిన్ తారిఖ్ అల్ స‌య్య‌ద్ ఉన్నారు. ఈయ‌న 2020 జ‌న‌వ‌రి 11న ఒమన్ సుల్తాన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అంత‌కు ముందు 1970 నుంచి సుమారు 50 ఏళ్ల పాటు ఆయ‌న మేన‌మామ కుమారుడు ఖాబూస్ బిన్ సయ్య‌ద్ పాలించారు. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం తారిఖ్ ఆ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈయ‌నే ఈ దేశ ప్ర‌ధానిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

నిజ్వాలోని 8వ శ‌తాబ్దం నాటి సుల్తాన్ కోట

క‌ట్టుబాట్ల చ‌ట్రానికి స‌డ‌లింపు..

సాధార‌ణంగా ముస్లిం దేశాల్లో మ‌హిళ‌ల‌పై పెను ఆంక్ష‌లుంటాయి. కానీ ఒమ‌న్‌లో అందుకు భిన్నం. 1970లో అధికారంలోకి వ‌చ్చిన సుల్తాన్ ఖ‌బూస్ బిన్ స‌య్య‌ద్ ఈ ఆంక్ష‌ల‌ను స‌డ‌లించారు. ఈ దేశంలోని మ‌హిళ‌ల‌కు స్వేచ్ఛ‌నిచ్చేలా ప‌లు సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చారు. దీంతో ఇక్క‌డి మ‌హిళ‌లు బుర‌ఖాల ధార‌ణ త‌ప్ప‌నిస‌రి కాదు. విద్యావంతులైన మ‌హిళ‌లు ఉద్యోగాలు చేసుకునే వీలు క‌ల్పించారు. పైగా దేశ ర‌క్ష‌ణ రంగంలోనూ వీరి చేరిక‌కు లైన్ క్లియ‌ర్ చేశారు. దీంతో మ‌హిళ‌లు వివిధ ఉద్యోగాల్లో విజ‌య‌వంతంగా విధులు నిర్వ‌హిస్తున్నారు. అదే స‌మ‌యంలో బిన్ స‌య్య‌ద్ ఇత‌ర దేశాల‌తోనూ స‌త్పంబంధాలు నెల‌కొల్పుతూ వ‌చ్చారు. బ్రిట‌న్‌, అమెరికా, భార‌త్‌లాంటి దేశాల‌తో మైత్రిని పెంపొందించారు. దీంతో ఈ దేశ ఆర్థిక స్థితిగ‌తుల్లో గ‌ణ‌నీయ‌మైన మార్పులు చోటు చేసుకుని సంప‌న్న దేశంగా ఎదిగింది. 1970కి ముందు పేద దేశంగా ఉన్న ఒమ‌న్ ఇప్పుడు క‌రెన్సీ విలువ‌లో ప్ర‌పంచంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఖాబూస్ బిన్ స‌య్య‌ద్ బాట‌లోనే ప్ర‌స్తుత సుల్తాన్ తారిఖ్ అల్ స‌య్య‌ద్ కూడా ప‌య‌నిస్తూ ఇక్క‌డ ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల‌ను చూర‌గొంటున్నారు.

ఒమ‌న్‌లో ఖ‌ర్జూర తోట‌లు

పార్టీలు లేని దేశం.. ఒమ‌న్‌!

ఒమ‌న్ పాల‌కుడు వార‌స‌త్వంగా వ‌చ్చే సుల్తాన్‌. పాల‌నాధికారాల‌న్నీ ఈయ‌న‌కే ఉంటాయి. ప్ర‌ధానిగానూ ఆయ‌నే ఉంటారు. సుల్తాన్‌కు స‌ల‌హాలిచ్చేందుకు 25 మందితో మంత్రి మండ‌లి ఉంటుంది. విశేష‌మేమిటంటే? ఒమ‌న్‌కు ప్ర‌త్యేకంగా రాజ్యాంగ‌మంటూ ఏదీ లేదు. రాజాజ్క్ష‌లే ప‌రిపాల‌న‌కు మౌలిక విధానాలు. ఒమ‌న్‌లో రాజ‌కీయ పార్టీలు కూడా లేవు. పాల‌నాప‌రంగాను, కొంత‌వ‌ర‌కు భౌగోళికంగాను ఒమ‌న్‌ను ఐదు ప్రాంతాలుగా, మూడు గ‌వ‌ర్న‌రేట్‌లుగా విభ‌జించారు. వీటిలో ఒక్కో ప్రాంతాన్ని జిల్లాలుగా విభ‌జించారు. ఒమ‌న్ అన్ని పొరుగు దేశాల‌తో శాంతిని కోరుకునే దేశంగా పేరొందింది. గ‌ల్ఫ్ దేశాల మండ‌లిలో భాగంగా ఉండ‌డం, ఉన్న ఆర్థిక వ‌న‌రుల‌ను ఉప‌యోగించుకోవ‌డం, విద్య, ఆరోగ్య రంగాలపై శ్ర‌ద్ధ వ‌హించ‌డం, మ‌హిళ‌ల‌కు అన్ని రంగాల్లో అవ‌కాశాలివ్వ‌డం వంటి సంస్క‌ర‌ణ‌లు ఆ దేశ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డ్డాయి. ప్ర‌పంచంలో పేద‌, ధ‌నిక అనే తేడా లేకుండా చాలా దేశాలు ఉగ్ర‌వాద బెడ‌ద‌ను ఎదుర్కొంటున్నాయి. ఇందులో ముస్లిం, ముస్లిమేత‌ర దేశాలున్నాయి. అయితే ఒమ‌న్‌కు మాత్రం టెర్ర‌రిస్టుల బెడ‌ద లేదు. అంతేకాదు.. ఈ దేశంలో మ‌త సామ‌ర‌స్యం వెల్లువిరుస్తోంది. ఇక్క‌డి వారు ఇత‌ర మ‌త‌స్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయ‌రు. వారి జోలికి వెళ్ల‌రు. ఎక్క‌డా మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌కు ఆస్కారం ఉండ‌దు.

హైద‌రాబాద్ జ‌నాభాలో స‌గ‌మే ఒమ‌న్‌..

ఒమ‌న్ దేశం అరేబియా స‌ముద్ర తీరాన ఉంది. దీనికి యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా, ఎమెన్ దేశాల‌తో స‌రిహ‌ద్దులున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి ఈ దేశ జ‌నాభా 57,71,458 ఉంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ న‌గ‌ర‌ జ‌నాభా (1.01 కోట్లు)తో పోల్చుకుంటే దాదాపు దాన్లో స‌గ‌మ‌న్న మాట‌! కానీ ఒమ‌న్‌ వైశాల్యం మాత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కంటే ఎక్కువ‌. ఒమ‌న్ దేశ వైశాల్యం 3,12,000 చ‌ద‌ర‌పు కి.మీలు కాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వైశాల్యం 2,75,068 చ‌ద‌ర‌పు కి.మీలు. ఒమ‌న్ తీర రేఖ పొడ‌వు 3,165 కి.మీలు. ఒమ‌న్‌లో ప్ర‌తి చ‌ద‌ర‌పు కిలోమీట‌రుకు 15 మంది చొప్పున‌ నివ‌శిస్తారు. 12 శాతం మంది మాత్ర‌మే గ్రామాల్లోను, మిగిలిన వారంతా ప‌ట్ట‌ణాల్లో నివాసం ఉంటారు. ఈ దేశం మొత్త‌మ్మీద 361 గ్రామాలే ఉన్నాయి. ఇవి 11 గ‌వ‌ర్న‌రేట్‌లు, 63 విలాయ‌త్ లు (చిన్న పాటి జిల్లాలు) ప‌రిధిలో ఉంటాయి.

బ‌హుళ అంత‌స్తులుండ‌వ్‌..

ఈ దేశంలో భూభాగం ఎక్కువ‌, జ‌నాభా త‌క్కువ కావ‌డం వ‌ల్ల స్థ‌లాల కొర‌తకు తావులేదు. విశాల‌మైన జాగాలో ఇళ్ల‌ను నిర్మించుకుంటారు. 99 శాతం ఇండివిడ్యువ‌ల్‌ ఇళ్లే క‌నిపిస్తాయి. ప‌ట్ట‌ణ/న‌గ‌ర ప్రాంతాల్లో అక్క‌డ‌క్క‌డ బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు అగుపిస్తాయి. అవి కూడా హోట‌ళ్లు, హోట‌ల్ అపార్ట్‌మెంట్లు, లాడ్జిలు వంటి వాణిజ్య క‌ట్ట‌డాలే. దేశ రాజ‌ధాని మ‌స్క‌ట్‌లో సైతం భ‌వ‌నాలు 10 అంత‌స్తుల‌కు మించ‌క‌పోవ‌డం విశేషం. నిర్దేశిత డిజైన్‌లో స్వ‌ల్ప మార్పులు త‌ప్ప ఇళ్ల‌న్నీ ఒకే త‌ర‌హాలో ఉంటాయి. అంతేకాదు.. ఇళ్లు, ప్ర‌భుత్వ భ‌వ‌నాలకు విధిగా తెలుపు, గోధుమ వ‌ర్ణం వంటి లైట్ క‌ల‌ర్సే వాడాలి. అందువ‌ల్ల మా ఇళ్లే క‌దా? మాకిష్టం వ‌చ్చిన రంగులు వేసుకుంటాం అంటే కుద‌ర‌దు. ఒమ‌న్‌లో ఇప్ప‌టికీ ఒకే ఇంట్లో కొడుకులు, కోడ‌ళ్ల‌తో క‌లిసి జీవిస్తున్న ఉమ్మ‌డి కుటుంబాలే అధికం.

వంద‌ల కి.మీలు ప‌ర్వ‌తాలే..

ఒమ‌న్ మ‌ధ్య భాగం చాలావ‌ర‌కు విశాల‌మైన ఎడారి తీర‌ప్రాంతంలో వంద‌ల కిలోమీటర్లు వ‌ర‌కు పర్వ‌త శ్రేణులున్నాయి. వీటిలో జ‌బ‌ల్ అఖ్ద‌ర్‌, జ‌బ‌ల్ షామ్స్ (స‌ముద్ర మ‌ట్టానికి 3,035 మీట‌ర్ల ఎత్తు) అనే కొండ‌లు అత్యంత ఎత్తైన‌వి. ఈ ప‌ర్వ‌త శ్రేణుల‌కు, తీరానికి మ‌ధ్య మ‌స్క‌ట్ (దేశ రాజ‌ధాని), స‌లాలా, సూర్ వంటి ప్ర‌ధాన న‌గ‌రాలున్నాయి. బాతినా అనే తీరం సార‌వంత‌మైన మైదాన ప్రాంతం. అక్క‌డ ఖ‌ర్జూరం, కూర‌గాయ‌ల పంట‌లు, ప‌శువుల పెంప‌కానికి అనువుగా ఉంటుంది. ప‌ర్వ‌త‌మయ ప్రాంత‌మైన ద‌ఖ‌లియా ఖ‌ర్జూర పంట‌కు ప్ర‌సిద్ధి. అయితే ఆ దేశానికి తూర్పున ఉన్న బాతినా ప్రాంతం పూర్తిగా మైదాన భూభాగం. అక్క‌డ కొండ‌లుండ‌వు. ఒమ‌న్ దేశ మ‌ధ్య భాగంలో ఎడారి ప్రాంతం విస్త‌రించి ఉంటుంది. వంద‌ల కిలోమీట‌ర్లు ఇసుక ప‌ర్ర‌లు మాత్ర‌మే క‌నిపిస్తాయి. అక్క‌డ‌క్క‌డ చిన్న జ‌నావాసాల‌తో సంచార జీవులు, ఒంటెల పెంప‌కందార్లు ఉంటారు. కొండ‌లు, గుట్ట‌లు మ‌ధ్య ఎడారితో పాటు అక్క‌డ‌క్క‌డ నీటి వ‌న‌రులున్న చోట జ‌నావాసాలు కూడా ఉంటాయి. ద‌క్షిణంలో ఉన్న దోఫార్ అనే రుతుప‌వ‌న ప్రాంతంలో ద‌ట్ట‌మైన చెట్లుంటాయి. పెట్రోలియం, స‌హ‌జ వాయువు, రాగి, వ్య‌వ‌సాయం, చేప‌ల వేట వంటివి ఈ దేశ ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రులు. ఇక్క‌డ క‌రెన్సీని ఒమ‌ని రియాల్ అంటారు. ప్ర‌స్తుతం ఒక రియాల్ రూ.250కు స‌మానం. ఇక్క‌డ భార‌త‌ కాల‌మానంకంటే గంట‌న్న‌ర ఆల‌స్యం.

క‌లిసే ఉన్న రెండు ప‌ట్ట‌ణాలు .. రెండు దేశాల్లో..

ఒమ‌న్‌లోని అల్ బురేమీ ప‌ట్ట‌ణానికో ప్ర‌త్యేక‌త ఉంది. బురేమీ ప‌ట్ట‌ణం గ‌తంలో ధాహిరా ప్రాంతంలో ఒక భాగంగా ఉండేది. 2006 అక్టోబ‌ర్ నుంచి దీనిని ఒక గ‌వ‌ర్న‌రేట్‌గా గుర్తించారు. అల్ బురేమి ప‌ట్ట‌ణం, అల్ ఐన్ పట్ట‌ణాలు క‌లిసే ఉంటాయి. కానీ బురేమి ఒమ‌న్ లో ఉండ‌గా, అల్ ఐన్ ప‌ట్ట‌ణం యూఏఈలోని అబుదాబీ ఎమిరేట్‌లో ఉంది. ఇలా పట్ట‌ణాలు రెండూ క‌లిసి పోయిన‌ట్టు ఉన్నా దేశాలు మాత్రం వేర్వేరు. ఈ రెండు ప్రాంతాల వారు ఆయా ప‌ట్ట‌ణాల‌కు వెళ్లాలంటే ప్ర‌త్యేక అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి.

విదేశీయుల్లో భార‌తీయులే అధికం..

ఒమ‌న్ జ‌నాభాలో నాలుగోవంతు విదేశీయులే. వీరంతా ఉద్యోగ‌, వ్యాపారాల నిమిత్తం వ‌చ్చారు. భార‌త్ నుంచి వ‌చ్చిన వారిలో గుజ‌రాతీలు, కేర‌ళీయులు అధికం. ఆ త‌ర్వాత స్థానాల్లో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, పంజాబ్ రాష్ట్రాల వారున్నారు. ప్ర‌స్తుతం వీరి సంఖ్య 6.86 ల‌క్ష‌లుంది. ఇంకా పాకిస్థాన్‌, శ్రీ‌లంక‌, ఈజిప్ట్‌, సూడాన్‌, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ త‌దిత‌ర దేశీయులున్నారు. భారతీయులు దాదాపు అన్ని రంగాల్లోనూ పని చేస్తున్నారు. కూలి పనులు చేసేవారు, సాంకేతిక, వ్యాపార నిపుణులు, డాక్టర్లు, ఇంజినీర్లు, దుకాణాలు నడిపేవారు, ఇంట్లో పనిమనుషులుగా చేసే మహిళలు, మేనేజర్లు.. ఇలా భారత‌ పౌరులు ఒమన్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ దేశంలో సుమారు 2000 మంది భారతీయ డాక్టర్లున్నారు. ఒమన్‌లో 15 భారతీయ స్కూళ్ళు ఉన్నాయి. ఒక్క స్కూలు కేరళ సిలబస్ ప్రకారం నడుస్తుంది. 15వ శతాబ్దం నుంచి ఒమన్-భారత్‌ల మధ్య వర్తక సంబంధాలున్నాయి. హిందూ వర్తక సంఘం వారు ఇక్కడ 'హిందూ మహాజన్ సంఘం' గా గుర్తించబడ్డారు. హిందువుల కోసం మస్కట్‌లో రెండు హిందూ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో శివాలయం వందేళ్ల క్రిత‌మే నిర్మించారు. మ‌స్క‌ట్‌లోనే శ్రీ‌కృష్ణ మందిరం కూడా ఉంది. కంపెనీ క్యాంపు ప్రాంతాలలో గురుద్వారా, అమ్మవారి మందిరం వంటి ప్రార్థనా సదుపాయాలున్నాయి. 1996లో అమలు చేసిన‌ మౌలిక న్యాయ చట్టం ద్వారా ఈ దేశంలో ఎవరైనా స్వేచ్ఛగా ప్రార్థన చేసుకొనే వీలు కల్పించారు.
Read More
Next Story