'డీఎస్సీపై సీబీఐ విచారణకు సీఎంను ఒప్పిస్తా.. నా కండిషన్ కు ఓకేనా జగన్'
వైఎస్. జగన్ కు ఆఫర్ ఇచ్చిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహణ, ఉపాధ్యాయుల నియామకంపై చెలరేగిన మంటలు ఆరడం లేదు. రాజకీయంగా దుమారం రేగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ ను ఉద్దేశించిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
"మెగా డీఎస్సీపై విచారణకు మా బాస్, సీఎం చంద్రబాబును ఒప్పిస్తా. సీబీఐ విచారణకు అప్పగించడానికి చొరవ తీసుకుంటా. అయితే ఓ కండీషన్ ఉంది" అంటూ మాజీ మంత్రి వైఎస్. వివేకా హత్య కేసును తెరపైకి తెచ్చారు.
నెల్లూరు జిల్లా టీడీపీా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే వినండి
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మెగాడీఎస్సీ-2025 నిర్వహించిన విషయం తెలిసిందే. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఎంపికైన 16 ,347 మంది టీచర్లను రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో నియమించారు.
ఈ నియామకాలపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో రాజకీయంగా వాతావరణం వేడెక్కింది. క్రీడా కోటాలో జరిగిన నియామకాల్లో అవకతవకలు జరిగాయనేది వైసీపీ చీఫ్ జగన్ తోపాటు ఆ పార్టీ నేతలు ఆరోపణలు సంధిస్తూ, అనేక వివరాలు మీడియాకు వెళ్లడించారు.
"అర్హతలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వడం, నకిలీ సర్టిఫికెట్లు దాఖలు చేశారు" అనేది వైసీపీ ఆరోపణ.
"రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి" అని వైసీపీ పట్టుబడుతోంది. దీంతో ఇటీవల జరిగిన శాసనసభా సమావేశాల్లో మంత్రి నారా లోకేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో సమగ్రంగా వివరించారు. అంతకుముందు ఆ తరువాత శాప్ చైర్మన్, విద్యాశాఖ డైరెక్టర్ కూడా అనేక వివరణలు ఇచ్చినా, రాజకీయ మంటలు ఆరడం లేదు.
మెగా డీఎస్సీపై అధికార టీడీపీ కూటమి, వైసీపీ మధ్య రాజకీయ యుద్ధం పీక్ స్టేజిలోనే జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఇరకాటంలో పడేశాయి.
"మాజీ మంత్రి వైఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ చీఫ్ జగన్ సీబీఐ విచారణకు సిద్ధ పడితే.. డీఎస్సీపై సీఎం చంద్రబాబును ఒప్పించి, విచారణకు ఆదేశించే విధంగా చేస్తా" అని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

