సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనా?
x

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనా?

తమిళనాడులో ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ దుమారం రేగింది. / ఎస్ఐఆర్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ టీవీకే సహా పలు పార్టీలు వాకౌట్ చేశాయి.


Click the Play button to hear this message in audio format

తమిళనాడులో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. స్పెషల్ సమ్మరి రివిజన్(SSR)పై చర్చించేందుకు ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం నుంచి టీవీకే సహా పలు పార్టీలు వాకౌట్ చేశాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.

చెన్నై సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మొత్తం 13 గుర్తింపు పొందిన రాష్ట్ర, జాతీయ పార్టీలకు ఆహ్వానాలు అందాయి. టీవీకే, డీఎంకే, ఏఐఏడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే సహా పలు పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే, ఓటర్ల జాబితా సవరణపై చర్చ కాస్తా.. ఎన్నికల సంఘంపై నిరసనగా మారింది.

2027 జనవరి 1ను అర్హత తేదీగా పరిగణించి, జనవరి 4న తుది ఓటర్ల జాబితాను ప్రకటించాలన్న ప్రతిపాదనపై చర్చ జరుగుతున్న సమయంలో.. గతంలో నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR)లో అవకతవకలు జరిగాయంటూ పలు పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.

టీవీకే, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, వీసీకే సహా పలు పార్టీలు ఈ ప్రక్రియపై తీవ్ర నిరసన తెలిపాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సమావేశం నుంచి బయటకు వచ్చాయి. డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎండీకే, నామ్ తమిళర్ కచ్చి ప్రతినిధులు కూడా వాకౌట్‌లో పాల్గొన్నట్లు సమావేశానికి సంబంధించిన వివరాలు వెల్లడించాయి.

వాకౌట్ అనంతరం టీవీకే మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించారు. గతంలో ఎస్ఐఆర్ సందర్భంగా తీవ్రమైన తప్పులు జరిగాయని ఆరోపించారు. ముందుగా జరిగిన పొరపాట్లను సరిదిద్దకుండా మరోసారి ఓటర్ల జాబితా సవరణ చేపట్టడం అవసరం లేదని అన్నారు.

ఎస్ఐఆర్ కారణంగా తమ పార్టీకి నష్టం జరిగిందని పేర్కొన్న ఆయన.. ఈ ప్రక్రియను వ్యతిరేకించిన తొలి పార్టీ టీవీకేనేనని చెప్పారు. ఎస్ఐఆర్ లేకపోతే తమ పార్టీ 160 స్థానాలు గెలిచి ఉండేదని వ్యాఖ్యానించారు. సీఈసీ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తోనే సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు స్పష్టం చేశారు.

డీఎంకే మాజీ ఎమ్మెల్యే పరంథమన్ కూడా ఎన్నికల సంఘం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్‌లో తొలగించిన ఓటర్ల పేర్లను ఎలా పునరుద్ధరిస్తారని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చుకునే ప్రక్రియను మరింత సులభతరం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం చర్యల్లో పారదర్శకత, విశ్వసనీయత లోపించాయని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని, అయితే ఓటర్ల హక్కులకు భంగం కలిగించే చర్యలను అంగీకరించబోమని స్పష్టం చేశారు.

మరోవైపు, వాకౌట్ చేసిన పార్టీలపై ఏఐఏడీఎంకే ఎదురుదాడికి దిగింది. ఆ పార్టీ నేత జయకుమార్ నిరసన తెలుపుతున్న పార్టీల వైఖరిని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలను సమర్థించడం, ఓడిపోయినప్పుడు వాటిని తప్పుబట్టడం ఏంటని విమర్శించారు.

ఓటర్ల జాబితా నుంచి తొలగింపులపై స్పందిస్తూ.. మరణించినవారితో పాటు వలస వెళ్లినవారి వివరాల ఆధారంగా పేర్లను తొలగించారని చెప్పారు. ఎస్ఐఆర్ సందర్భంగా 26 లక్షల మంది మరణించిన ఓటర్ల పేర్లను తొలగించగా, ఇతర కారణాలతో మరో 55 లక్షల మందిని తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో తప్పేముందని ప్రశ్నించారు.

మొత్తానికి, తమిళనాడులో ఓటర్ల జాబితా సవరణ ఇప్పుడు రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. ఒకవైపు ఎస్ఐఆర్‌లో తప్పులను సరిదిద్దాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తుంటే.. మరోవైపు ఎన్నికల సంఘం ప్రక్రియను సమర్థించే వాదనలు వినిపిస్తున్నాయి.

ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, చేర్పులపై నెలకొన్న ఈ వివాదం.. రాబోయే ఎన్నికల రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? సీఈసీ రాజీనామా డిమాండ్‌పై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read More
Next Story