
‘త్వరలో పార్టీ పేరు ప్రకటిస్తా’
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ కూడా చేస్తామన్న తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై
తన రాజకీయ భవిష్యత్తుపై నెలకొన్న ఊహాగానాలకు అన్నామలై తెరదించారు. తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల అన్నామలై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఇవాళ ఆ లేఖను పార్టీ అధిష్టానం ఆమోదించింది.
ఆ తర్వాత కొన్ని గంటలకే తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేస్తామని స్పష్టం చేశారు. వాస్తవానికి పార్టీకి రిజైన్ చేస్తానని 2025 డిసెంబర్ 4న పార్టీ పెద్దలకు చెబితే, ఎన్నికలు పూర్తయ్యే వరకు కొనసాగాలని తనను కోరారని అన్నామలై చెప్పుకొచ్చారు. తమిళనాడు పాలిటిక్స్ విషయంలో తనకు, బీజేపీ అగ్రనేతలకు అభిప్రాయ భేదాలు ఉన్నాయని అన్నామలై అంగీకరించారు. వాటిని పరిష్కరించుకోవడానికి 18 నెలల్లో పలు మార్లు బీజేపీ అగ్ర నాయకత్వంతో చర్చలు జరిపానని, చివరకు రాజీనామాకు సిద్ధమయ్యానని చెప్పారు. అయితే బీజేపీని వీడినప్పటికీ తాను ప్రధాని మోదీని ఎంతగానో గౌరవిస్తానని, తనపై నమ్మకం ఉంచి, అవకాశాలు కల్పించిన పార్టీ నాయకత్వానికి అన్నామలై కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై.. 2020లో బీజేపీలో చేరారు. కేవలం పది నెలల్లోనే రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎదిగారు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో నాలుగు స్థానాలను గెలుచుకుని, రెండు దశాబ్దాల తర్వాత తమిళనాడు అసెంబ్లీలోకి తిరిగి ప్రవేశించింది. 2019లో 3.66 శాతంగా ఉన్న బీజేపీ ఓట్ల శాతాన్ని 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడుకు 11.24 శాతానికి పెంచిన ఘనత కూడా ఆయనకే దక్కింది. దీనికి విరుద్ధంగా, నైనార్ నాగేంద్రన్ నాయకత్వంలో 2026 ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం ఒకే ఒక్క సీటును గెలుచుకోగలిగింది.

