x

కార్మికుల సమస్యలపై ఇక సమరమే..

కనీసం వేతనం 26 వేలు చెల్లించాలని సీఐటీయూ డిమాండ్.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు20 ఏళ్లుగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు జీతాలు పెంచకుండా తీవ్రమైన అన్యాయం చేశాయని సీఐటీయూ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం 26 వేలు చెల్లించడం తోపాటు వారి సర్వీసులు క్రమబద్ధీకరించాలని భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

తిరుపతి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి దిగిన కార్మికుల వల్ల ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో 32 మంది కార్మిక సంఘ నేతలను అరెస్టు చేసి, తిరుచానూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు.

అంతకుముందు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళీ మాట్లాడుతూ,
"ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ అమల్లోకి తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేశారు" అని కందారపు మురళీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడు లక్షల మంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల సర్వీసులు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయకపోవడం అన్యాయం అన్నారు. రాష్ట్రంలో షెడ్యూల్ పరిశ్రమల్లో 50 లక్షల మంది కార్మికులకు జీతాలు పెరగకుండా, యజమానులకు మేలు చేస్తున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్, పంచాయితీ, వీఆర్ఏ, టిటిడి కాంట్రాక్ట్ కార్మికులు, ఆప్కాస్ ఉద్యోగులు, ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు, యూనివర్సిటీలో పనిచేస్తున్న కార్మికులు, స్విమ్స్,రుయా, బర్డ్ ఆసుపత్రిలో పనిచేసే కార్మికులు, ఏపీఎండిసి కార్మికులు, రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు, 108, టూరిస్ట్ గైడ్స్ కార్మికులు, ఎలక్ట్రిసిటీ కార్మికులు వందలాది మంది తరలివచ్చారు.
తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసనలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్.జయచంద్ర, టి.సుబ్రమణ్యం, ప్రజాసంఘాల జిల్లా నేతలు, వందవాసి నాగరాజు, అంగేరి పుల్లయ్య, ఆకాష్ రాష్ట్ర అధ్యక్షులు జి చిన్నబాబు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ గండికోట నాగ వెంకటేష్ మాట్లాడారు. పెంచే వరకు పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.జయచంద్ర, టి సుబ్రమణ్యం మాట్లాడుతూ
"పంచాయతీ కార్మికులను, వీఆర్ఏలను, మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, ప్రతినెలా ఒకటో తేదీ జీతాలు చెల్లించాలి" అని కోరారు. టీటీడీలో పనిచేస్తున్న ఎఫ్ఎంఎస్ కార్మికులకు, హెల్త్ కార్మికులకు, వాటర్ వర్క్స్ విభాగ కార్మికులకు, అగర్బత్తి కార్మికులకు, కళ్యాణ్ కట్ట, ఫారెస్ట్, గార్డెన్, వాటర్ వర్క్స్ కార్మికులకు జీతాలు పెంచాలని, ఎఫ్ఎంఎస్ సూపర్వైజర్లను అటెండర్ గా నియమించాలని, ఎలక్ట్రీషియన్లను ఆయా విభాగాలకు విలీనం చేయాలని అన్నారు. స్విమ్స్ కార్మికులుకు వార్డ్ బాయ్స్ హోదా చేర్చాలని డిమాండ్ చేశారు. శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ ఆర్. లక్ష్మీ మాట్లాడుతూ మహిళా కార్మికులకి పని ప్రదేశాలలో రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపుల నిరోధిక కమిటీని ఏర్పాటు చేయాలి అన్నారు.
Read More
Next Story