అది వైసీపీ కాదు..కోడికత్తి, గొడ్డలి పార్టీ: సీఎం చంద్రబాబు
x

అది వైసీపీ కాదు..కోడికత్తి, గొడ్డలి పార్టీ: సీఎం చంద్రబాబు

అమరావతిని నాశనం చేసిన నరకాసురుడు అంటూ ఘాటు విమర్శలు


కృష్ణా జిల్లా పమిడిముక్కలలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అనేది రాజకీయ పార్టీ కాదని, అది కోడికత్తి, గొడ్డలి పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. జగన్‌కు ఒక వింతైన మానసిక సమస్య ఉందని, ప్రజలు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేయడమే ఆయనకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. మొదట మోసం చేయడం.. ఆ తర్వాత మాట మార్చడం ఆయన నైజం అని చంద్రబాబు మండిపడ్డారు.

ప్రజావేదిక కూల్చివేత నుంచి పోలవరం విధ్వంసం వరకు
2019లో అధికారంలోకి వచ్చిన తొలి రోజే జగన్ తన విధ్వంసాన్ని ప్రారంభించారని చంద్రబాబు గుర్తు చేశారు. రెండేళ్లు కష్టపడి ప్రజావేదికను కడితే.. కేవలం రెండు గంటల్లోనే దానిని కూల్చేశారు. అదే బాటలో 70 శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టును కూడా నాశనం చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని దేవతల రాజధానిగా అభివర్ణించిన సీఎం, జగన్ దానిని శ్మశానం, ఎడారి అంటూ అవహేళన చేసి మొత్తం వ్యవస్థను దెబ్బతీశారని విమర్శించారు. నరకాసుడి వధతో సమాజం ఎలా బాగుపడిందో, ఈ విధ్వంసకర పాలన పోవడంతో రాష్ట్రానికి మళ్లీ స్వాతంత్య్రం వచ్చిందని వ్యాఖ్యానించారు.
వివేకా హత్యపై రక్త చరిత్ర బట్టబయలు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య ఉదంతాన్ని చంద్రబాబు సుదీర్ఘంగా ప్రస్తావించారు. ముందు గుండెపోటు అని సాక్షి టీవీలో వేశారు. కానీ తీరా చూస్తే గొడ్డలితో దారుణంగా నరికి చంపారు. రక్తం మడుగులో పడి ఉన్న వ్యక్తితో బలవంతంగా సంతకాలు పెట్టించారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత బాబాయ్ హత్యను కూడా రాజకీయం చేసి, గొడ్డలిని నా చేతిలో పెట్టి 'నారాసుర రక్త చరిత్ర' అని తప్పుడు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. ఆనాడు జగన్ మాటలు నమ్మి 151 సీట్లు ఇస్తే, ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అన్నారు.
ఏపీకి పునర్వైభవం.. అభివృద్ధి బాటే లక్ష్యం
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీని భారంగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకున్నామని చెప్పారు. కార్మికుల కోసం తొలి దశలో 15 నగరాల్లో అత్యాధునిక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతి, తిరుపతి, శ్రీసిటీ సహా ఆరు ప్రాంతాల్లో ఈఎస్‌ఐ ఆస్పత్రులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ నాటికి బందర్ పోర్టు పూర్తి చేస్తామని, హైదరాబాద్-మచిలీపట్నం హైవేను ఎక్స్‌ప్రెస్ వేగా మారుస్తామని ప్రకటించారు.
ఎమ్మెల్యేలకు వార్నింగ్.. పనితీరు లేకుంటే సీటు లేదు
పాలనలో జవాబుదారీతనం ఉండాలని, ఎమ్మెల్యేల పనితీరుపై తాను నేరుగా ప్రజలనే అడుగుతానని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల్లో వ్యతిరేకత ఉండి, పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు మరోసారి పోటీ చేసే అవకాశం ఉండదని తేల్చి చెప్పారు. సుపరిపాలన అందించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని, ప్రజలంతా గుండె మీద చేయి వేసుకుని ఆలోచించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.
Read More
Next Story