శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
తిరుమల శ్రీవారికి మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబసమేతంగా తిరుమలకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు వెంట ఆయన భార్య నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు నారా బ్రహ్మణి, మనవడు నారా దేవాన్ష్ ఉన్నారు.
తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దంపతులకు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ ముద్దాడి రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి, అధికారులు, పాలక మండలి సభ్యులు ఘనంగా స్వాగతించారు. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మొదట బేడిఆంజనేయ స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
శ్రీవారి ఆలయ సంప్రదాయం ప్రకాారం బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు టీటీడీ అర్చకులు పరివట్టం కట్టారు. వెండిపళ్లెంలో ఉంచిన పట్టువస్త్రాలు ఉంచారు. ఆ తరువాత కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోకి చేరుకున్నారు. శ్రీవారి మూలమూర్తి వద్ద పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం ఈ ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు, టీటీడీ కార్య నిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర , స్వాగతం పలికారు. అనంతరం గౌ. ముఖ్యమంత్రి ధ్వజ స్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళమాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళంకారీ చిత్రపటాన్ని అందజేశారు.

