ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే పింఛన్, రేషన్ కూడా దూరమేనా?
x

ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే పింఛన్, రేషన్ కూడా దూరమేనా?

సంక్షేమ పథకాల లబ్ధికి ఓటర్ ఐడీని తప్పనిసరి చేయాలన్న కేంద్రం ఆలోచనపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇది ఓట్ల దొంగతనం మాత్రమే కాదు, ప్రజల హక్కుల దోపిడీ అని ఆరోపించారు.


సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఇకపై ఓటర్ ఐడీ తప్పనిసరి కానుందా? ఆధార్ స్థానంలో ఓటరు గుర్తింపు కార్డును తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది కేవలం ఓట్ల దొంగతనం కాదని, ప్రజల హక్కులను హరించే కుట్ర అని ఆరోపించారు.

పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు ఆధార్‌కు బదులుగా ఓటర్ ఐడీని ఉపయోగిస్తామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లల్లన్ సింగ్ చేసిన ప్రకటన ఈ వివాదానికి కేంద్రబిందువైంది. ఈ విధానం అమల్లోకి వస్తే ఓటరు గుర్తింపు కార్డుకు సంక్షేమ ప్రయోజనాలను ముడిపెట్టినట్లవుతుందని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

SIR పేరుతో ఓట్ల తొలగింపు.. రాహుల్ సంచలన ఆరోపణలు!

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ కేంద్రంపై మరిన్ని ఆరోపణలు చేశారు. ఇప్పటికే లక్షలాది మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని, ఈ ప్రక్రియను అడ్డుకోకపోతే భవిష్యత్తులో మరింతమంది ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈ ప్రక్రియలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నవారినే ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఓటర్ల జాబితా నిష్పక్షపాతంగా ఎన్నికల సంఘం ఆధీనంలో ఉండాల్సిందని, కానీ ప్రస్తుతం అది మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తోందని విమర్శించారు.

ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యతలను ప్రస్తావిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై కూడా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఓట్ల దొంగతనంలో బీజేపీతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు చేస్తూ, అందుకు సంబంధించిన ఆధారాలతో ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని తన X పోస్టులో పేర్కొన్నారు.

ఓటు పోతే.. సంక్షేమ హక్కులూ పోతాయా?

ఎన్నికల్లో ఎప్పుడూ బీజేపీకి అనుకూలంగా ఉండేలా ఓటర్ల జాబితాను రూపొందించే ప్రయత్నం జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతేకాదు, భవిష్యత్తులో అదే జాబితా ఆధారంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలా వద్దా అన్నది నిర్ణయించే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

నిన్న బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నవారి పేర్లు జాబితా నుంచి తొలగిస్తే, వారు తమ ఓటు హక్కును కోల్పోతారని అన్నారు. ఓటు హక్కు కోల్పోవడం అంటే కేవలం ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోవడం మాత్రమే కాదని, దాని ప్రభావం ఇతర పౌర హక్కులపైనా పడుతుందని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసి, పౌరులను కనిపించని వ్యక్తులుగా మార్చే ప్రమాదం ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే పరిస్థితి పోయి, ప్రభుత్వమే తనకు అనుకూలమైన వ్యక్తులను ఎంపిక చేసుకునే వ్యవస్థగా మారుతుందని విమర్శించారు.

ఈరోజు పంచాయతీ రాజ్ పథకాలతో మొదలైతే, రేపు రేషన్, పింఛన్లు, ఉపాధి హామీ పథకం (MGNREGA), ఇళ్ల కేటాయింపు, స్కాలర్‌షిప్‌లు, రిజర్వేషన్ల వరకు ఈ నిబంధన విస్తరించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పేదల సంక్షేమానికి ఓటరు కార్డు షరతా?

ఓటు హక్కును సంక్షేమ పథకాలతో ముడిపెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలవడానికి చేసే రాజకీయ వ్యూహం కంటే ఇది చాలా ప్రమాదకరమని, ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసి అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంగా అభివర్ణించారు.

ఒక పేద వ్యక్తికి అందాల్సిన పింఛన్‌ను అతడి ఓటరు గుర్తింపు కార్డుకు బానిసగా మార్చకూడదని అన్నారు. ఓటు వేయడం ప్రతి పౌరుడి హక్కు తప్ప, సంక్షేమ ప్రయోజనాలు పొందేందుకు విధించే షరతు కాదని స్పష్టం చేశారు.

"ఇది కేవలం ఓట్ల దొంగతనం కాదు.. హక్కుల దొంగతనం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వం" అంటూ రాహుల్ గాంధీ హెచ్చరించారు.

కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో మొదలైన వివాదం

ఈ వివాదానికి కారణమైన కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లల్లన్ సింగ్ వ్యాఖ్యల వీడియోను కూడా రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ పరిధిలోని పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు, సంక్షేమ చెల్లింపులు పొందాలంటే ఇకపై ఓటరు ఫోటో గుర్తింపు కార్డు (EPIC) నంబర్‌తో పాటు తప్పనిసరి బయోమెట్రిక్ ధృవీకరణ కూడా అవసరమవుతుందని మంత్రి వెల్లడించారు.

ఈ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ గురువారమే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఓటు దొంగతనం వివాదం కేవలం ఆరంభం మాత్రమేనని, అసలు ప్రమాదం ప్రజల హక్కులకు ముప్పు వాటిల్లడంలో ఉందని విమర్శించింది.

ఇప్పుడు ఆధార్ స్థానంలో ఓటర్ ఐడీని తీసుకురావాలన్న కేంద్రం ప్రతిపాదన దేశవ్యాప్తంగా కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. సంక్షేమ పథకాల అమలులో ఈ విధానం ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? ఓటర్ల జాబితాలో పేరు లేని పేదలకు నిజంగానే ప్రయోజనాలు నిలిచిపోయే ప్రమాదం ఉందా? కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి స్పష్టత ఇస్తుందో వేచి చూడాలి.