ఉత్త‌రాంధ్ర‌కు పోల‌వ‌రం క‌ల నెర‌వేరిన‌ట్టేనా?
x
కాలువ‌పై నిర్మించిన రెగ్యులేట‌ర్ నుంచి విడుద‌ల‌వుతున్న గోదావ‌రి జ‌లాలు

ఉత్త‌రాంధ్ర‌కు పోల‌వ‌రం క‌ల నెర‌వేరిన‌ట్టేనా?

పోల‌వ‌రం ఎడ‌మ కాలువ ద్వారా గోదావ‌రి నీళ్లు అన‌కాప‌ల్లి జిల్లాలోకి ప్ర‌వేశంతో ఉత్త‌రాంధ్ర వాసుల చిర‌కాల స్వ‌ప్నం నెర‌వేరుతుంద‌న్న ఆశాభావం వ్య‌క్త‌మ‌వుతోంది.

పోల‌వ‌రం! ఇది సుమారు యాభై ఏళ్ల‌కు పైగా జ‌నం నోళ్ల‌లో నానుతోన్న ప‌దం. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా రాజ‌కీయ నాయ‌కుల నోటి నుంచి వ‌చ్చే మాట పోల‌వ‌రం. తాము అధికారంలోకి వ‌స్తే పోల‌వ‌రం నీటిని తెస్తాం.. రైతుల క‌ష్టాల‌ను తీరుస్తాం.. అంటూ వారు హామీ ఇవ్వడం, ఆపై ష‌రా మామూలు అవ్వ‌డం ఈ ప్రాంత వాసుల‌కు అల‌వాటై పోయింది. ఏ నేత‌యినా పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేస్తాం.. అని అంటే ప‌క్కున న‌వ్వుకునే ప‌రిస్థితికి వ‌చ్చారు. క‌ర్ణుడి చావుకి స‌వాల‌క్ష కార‌ణాలు అన్న‌ట్టు ఈ పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తికి అన్నే అడ్డంకులు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్ర‌భుత్ ఈ ప్రాజెక్టుకు స‌హ‌క‌రించ‌డ‌క‌పోవడం, అధికారంలో ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల‌కు చిత్త‌శుద్ధి కొర‌వ‌డడం వెర‌సి పోల‌వ‌రం పొలికేక‌ల‌కే ప‌రిమిత‌మైంది. అయితే కొన్నేళ్ల నుంచి ఈ ప్రాజెక్టుకు క‌ద‌లిక వ‌చ్చింది. అందులో భాగంగానే పోల‌వ‌రం ఎడమ ప్ర‌ధాన కాలువ‌కు మోక్షం క‌లిగింది. ప్ర‌స్తుతానికి తూర్పు గోదావ‌రి, కాకినాడ‌, అన‌కాప‌ల్లి జిల్లాల రైతాంగానికి, ప్ర‌జ‌ల‌కు తాగునీటి అవ‌స‌రాలు తీర్చ‌డానికి ప‌ర‌వ‌ళ్లు తొక్క‌నుంది. ఇంత‌కీ ఈ పోల‌వ‌రం ఎడ‌మ ప్ర‌ధాన కాలువ ఉత్త‌రాంధ్ర ప్రాంత వాసుల చిర‌కాల క‌ల‌ను నెర‌వేరుస్తుందా? లేక ఈన‌గాచి న‌క్క‌ల పాల్జేసిన‌ట్టు కాచుకు కూర్చున్న డేటా సెంట‌ర్లు త‌న్నుకు పోతాయా? అన్న‌దే ఇప్ప‌డు అంద‌రిలోనూ వేధిస్తున్న ప్ర‌శ్న‌!


గోదావ‌రి జ‌లాల‌కు జ‌ల హార‌తి ప‌డుతున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు

పోల‌వ‌రం కాలువ స్వ‌రూపం ఇదీ...

తూర్పు గోదావ‌రి జిల్లా పురుషోత్త‌ప‌ట్నం వ‌ద్ద ఉన్న పంప్ హౌస్ నుంచి గోదావ‌రి నీటిని పోల‌వ‌రం ఎడ‌మ ప్ర‌ధాన ఎడ‌మ కాలువ‌వ‌లోకి ఎత్తిపోస్తారు. అక్క‌డ నుంచి కాకినాడ‌, అన‌కాప‌ల్లి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాల‌కు తాగు, సాగునీరందించే ల‌క్ష్యంతో దీని నిర్మాణం చేప‌ట్టారు. ఈ కాలువ నిర్మాణం పూర్తికి 17,050 కోట్లు ఖ‌ర్చు కానుంది. తొలి ద‌శ‌లో పురుషోత్త‌ప‌ట్నం నుంచి అన‌కాప‌ల్లి జిల్లా వ‌ర‌కు 162 కిలోమీట‌ర్ల మేర నీటిని స‌ర‌ఫ‌రా చేస్తారు. మొద‌టి ద‌శ‌లో 30 టీఎంసీల నీటిని విడుద‌ల చేస్తారు. మొత్తం ఈ పోల‌వ‌రం కాలువ పొడ‌వు 213 కి.మీల మేర త‌వ్వారు.

పోల‌వ‌రం కాలువ‌కు చంద్ర‌బాబు సాష్టాంగ న‌మ‌స్కారం

కొండ, కోన‌లు దాటుకుంటూ..
,
ప్రస్తుతం ఎడమ ప్రధాన కాలువ ద్వారా విడిచి పెడుతున్న నీటి ద్వారా మొత్తం నాలుగు జిల్లాల పరిధిలోని 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. 5.23 లక్షల మంది దాహార్తి తీరనుంది. ఎడమ కాలువ నిర్మాణం కోసం ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం రూ.4,192 కోట్ల ఖర్చు చేసింది. పోలవరం ఎడమ కాలువ ద్వారా ప్రవహిస్తున్న గోదావరి జలాలు ఈ జిల్లాల్లో ఉన్న పంపా, తాండవ, వరాహ, శారద నదుల్ని దాటుకుని, ఏలేరు కాలువ, తూర్పు కనుమలపై సంక్లిష్టమైన నిర్మాణాల మీదుగా ఉత్తరాంధ్రకు చేరుకుంటాయి. పోలవరం ఎడమ కాల్వ నిర్మాణంలో భాగంగా వివిధ నదీ ప్రవాహాల వద్ద సైఫన్లు.. అక్విడెక్టులను జలవనరుల శాఖ నిర్మించింది. ఈ నదుల ప్రవాహానికి కొన్ని చోట్ల ఎగువన..ఇంకొన్ని చోట్ల ప్రవాహానికి దిగువ నుంచి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నిర్మాణం జరిగింది. ఏలేరు నది బెడ్ లెవల్ కు దిగువన గోదావరి జలాలను తరలించేందుకు సైఫన్ నిర్మాణాన్ని చేప‌ట్టారు.. పంపా నది ఎగువ నుంచి అక్విడక్ట్ నిర్మించి పోలవరం ఎడమ కాల్వ ద్వారా గోదావరి జలాలకు ఇంజనీర్లు మార్గం సుగమం చేశారు. పంపా నదిపై అక్విడెక్ట్ నిర్మాణానికి 30 మీటర్ల లోతు వరకు 312 పైల్స్‌తో పునాదుల వేసి అక్విడెక్ట్ ను నిర్మించారు. 10,634 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని తట్టుకునేలా తాండవ నదిపై 6 వెంట్లతో 447 మీటర్ల పొడవున అక్విడక్టు నిర్మాణం జరిగింది. ఈ కాలువ ద్వారా 23.44 టీఎంసీల నీటిని విడుల చేయాల్సి ఉంది. ఈ నీటిని సాగు, తాగునీటితో పాటు ఉత్త‌రాంధ్ర‌లోని సాగు, తాగు నీటి అవ‌స‌రాల‌ను తీర్చాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది.

నీటి విడుల అనంత‌రం కాలువ‌లో ప్ర‌వ‌హిస్తున్న గోదావ‌రి జ‌లాలు

భవిష్యత్తులో సుజ‌ల స్ర‌వంతికి అనుసంధానం..

ప్రస్తుతం ఎడమ కాల్వ ద్వారా విడుదల చేస్తున్న గోదావరి జలాలతో అనకాపల్లి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలగనుంది. పాయకరావుపేట అక్విడెక్టు నుంచి సీఎం విడుదల చేయనున్న జలాలు అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేలా జలవనరుల శాఖ ప్రణాళిక చేసింది. గోదావరి జలాలతో పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాలు, ఏలేరు కింద 80 వేల ఎకరాలు, పంపా కింద 12 వేల ఎకరాలు, తాండవ, వరహా, మామిడి గెడ్డ ఆయకట్టు పరిధిలో ఉన్న 46,620 ఎకరాల స్థిరీకరణ జరగనుంది. మొత్తంగా 23.44 టీఎంసీల గోదావరి జలాలు సాగు, తాగు నీటితో పాటు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని పారిశ్రామిక అవసరాలకు వినియోగించేలా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానించేలా 213 కిలోమీటర్ల పొడవున పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం ద్వారా అనకాపల్లి, విశాఖ, విజయనగరం, పార్వతిపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎగువ ప్రాంతాలకు గోదావరి నీరు తరలించేలా ప్రభుత్వం ప్రణాళికలు చేసింది. తద్వారా ఎడమ ప్రధాన కాలువ సహా ఉత్తరాంధ్రలో జిల్లాల్లో మొత్తం 8 లక్ష ఎకరాలకు సాగునీరు, ఆ ప్రాంత ప్రజలకు తాగునీరు అందించాల‌న్న‌ది ప్ర‌భుత్వ సంక‌ల్పం.

గోదావ‌రి నీటికి చంద్ర‌బాబు జ‌ల‌హార‌తి..

బుధ‌వారం మ‌ధ్యాహ్నం రెండున్న‌ర గంట‌ల స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి అన‌కాప‌ల్లి జిల్లా పాయ‌క‌రావుపేట‌ చేరుకున్నారు. తొలుత అక్క‌డ కాలువ‌పై నిర్మించిన రెగ్యులేట‌ర్ ను రైతులు ఆన్ చేసి గోదావ‌రి జ‌లాల‌ను విడుద‌ల చేశారు. అక్క‌డ‌కు కొంత దూరంలో మంత్రులు, అధికారుల‌తో కాలువ‌లో వేచి ఉన్న చంద్ర‌బాబు పాదాల వ‌ద్ద‌కు నీళ్లు చేరుకోగానే ఎదురేగి పూలు చ‌ల్లారు. అనంత‌రం మేళ తాళాలు, వేద మంత్రోచ్ఛ‌ర‌ణ‌ల మ‌ధ్య‌ జ‌ల హార‌తినిచ్చి స్వాగ‌తించారు. ఆ మ‌ధుర ఘ‌ట్టాన్ని అక్క‌డున్న రైతులు, స‌మీప ప్రాంతాల ప్ర‌జ‌లు హ‌ర్ష‌ధ్వ‌నాల‌తో ఆస్వాదించారు. దీంతో పోల‌వ‌రం ఎడమ కాలువ ద్వారా గోదావ‌రి జ‌లాలు అన‌కాప‌ల్లి జిల్లాలోకి ప్ర‌వేశించిన‌ట్ట‌యింది. ఆ ప్రాంత ప్ర‌జ‌లు, రైతుల క‌ల సాకార‌మైంది.

ప్ర‌త్యేక వేష‌ధార‌ణ‌లో చంద్ర‌బ‌రాబు..

పోల‌వ‌రం ఎడ‌మ కాలువ ద్వారా గోదావ‌రి జ‌లాల‌ను విడుద‌ల చేసేంద‌కు వ‌చ్చిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌త్యేక వేష‌ధార‌ణ‌లో క‌నిపించారు. ఎప్పుఊ తెల్ల‌ని ఫ్యాంటు, ష‌ర్టులో క‌నిపించే ఆయ‌న ఈసారి త‌ల‌కు పాగా (రైత‌లా- చుట్టుకుని, లుంగీ, ష‌ర్టు, మెడ‌లో ప‌చ్చ‌ని కండ‌వాతో క‌నిపించారు. ఆయ‌న వెంట నీటిపారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు, బీజేపీ రాస్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధవ్‌, అన‌కాప‌ల్లి ఎంపీ సీఎం ర‌మేష్‌, మంత్రులు వంగ‌ల‌పూడి అనిత, కొల్లు ర‌వీంద్ర‌, నిమ్మ‌ల రామానాయుడు, నారాయ‌ణ‌, అచ్చెన్నాయుడు త‌దిత‌రులున్నారు.

గోదావ‌రి నీటిని డేటా సెంట‌ర్లు త‌న్నుకు పోతాయా?

ఇన్నాళ్లూ పోల‌వ‌రం కాలువ ద్వారా సాగు, తాగు నీటి కొర‌త తీరుతుంద‌ని ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు ఎంత‌గానో ఆశించారు. ఎన్నో అవాంత‌రాలు, ఆటంకాల‌ను అధిగ‌మించి ఐదు ద‌శాబ్దాల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు గోదావ‌రి జ‌లాలు త‌మ ప్రాంతంలోకి వ‌స్తున్నాయ‌ని సంబ‌ర‌ప‌డ్డారు. ఇంత‌లో అభివృద్ధి పేరుతో ఉమ్మ‌డి విశాఖ‌లో ఏర్పాట‌వుతున్న డేటా సెంట‌ర్లు ఆ ఆనంద‌న్ని ఆవిరి చేస్తున్నాయి. దేశంలో అతి పెద్ద డేటా సెంట‌ర్లు ఇవే అని గొప్ప‌గా చెప్పుకుంటున్నా అవి మాత్రం కోట్ల కొద్దీ లీట‌ర్ల‌ను గ‌ట‌గ‌టా తాగేయ‌డానికి కోర‌లు చాస్తాయ‌న్న వార్త‌లు వీరికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎందుకంటే రాక‌రాక వ‌స్తున్న గోదావ‌రి జ‌లాల‌ను ఈ డేటా సెంట‌ర్లు త‌న్నుకు పోయే ప్ర‌మాదం ఉంద‌న్న నిపుణుల హెచ్చ‌రిక‌లే ఇందుకు కారణం. డేటా సెంట‌ర్ల‌కు అవ‌స‌రమైన నీటి వ‌న‌రులు లేకుండానే వాటి నిర్మాణాల‌కు అడుగులు ప‌డుతున్నాయి. ఒక‌వేళ ఆ సెంట‌ర్లు నీటి వ‌న‌రుల‌ను స‌మ‌కూర్చుకోవ‌డానికి ఎన్నో ఏళ్ల స‌మ‌యం ప‌డుతుంది. అందువ‌ల్ల‌ వాటి నీటి అవ‌స‌రాలు తీర్చ‌డానికి గోదావ‌రి జ‌ల్లాల‌నే వినియోగిస్తార‌న్న భ‌యం ఈ ప్రాంత వ‌సుల‌ను వెంటాడుతోంది. ప్ర‌భుత్వం మాత్రం అలాంటిదేమీ లేద‌ని బుకాయిస్తోంది కానీ డేటా సెంట‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయ నీటి వ‌న‌రుల‌పై ఇద‌మిద్ధంగా ఏమీ చెప్ప‌డం లేదు. మొత్త‌మ్మీద లేక‌లేక వ‌స్తున్న గోదావ‌రి జ‌లాలు త‌మను ఆదుకుంటాయా? లేక డేటా సెంట‌ర్ల అవ‌స‌రాలు తీరుస్తాయా? అన్న ఆందెళ‌న‌తో ఈ ప్రాంత ప్ర‌జ‌లు, రైతులు ఉన్నారు.
Read More
Next Story