
ఇండియా కూటమిలో టీవీకే చేరికతో మారనున్న సమీకరణాలు!
తమిళనాడులో ఇండియా కూటమిలో టీవీకే చేరిందని వీసీకే చీఫ్ తిరుమావళవన్ ప్రకటించారు. విజయ్ పార్టీ అడుగులతో కాంగ్రెస్, డీఎంకే రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఇండియా కూటమిలో చేరిందా? ఇప్పటికే కూటమి నిరసనల్లో పాల్గొన్న ఆ పార్టీ... ఇక జాతీయ స్థాయిలోనూ ప్రతిపక్షాలతో కలిసి పోరాడనుందా? విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) అధినేత తోల్ తిరుమావళవన్ చేసిన ప్రకటన ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇండియా కూటమిలో టీవీకే...
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ఇప్పటికే ఇండియా కూటమి తమిళనాడు విభాగంలో చేరిందని తిరుమావళవన్ వెల్లడించారు. ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేపడుతున్న ఆందోళనల్లో టీవీకే కూడా భాగస్వామి కానుందని చెప్పారు. అక్టోబర్ 15న చెన్నైలో జరిగిన నిరసనలో ఆ పార్టీ పాల్గొనడం ఈ రాజకీయ మార్పునకు సంకేతంగా నిలిచింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా, ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్)ను నిరసిస్తూ ప్రతిపక్షాలు ఈ ఆందోళన చేపట్టాయి. ఈ నెల ప్రారంభంలో ఇండియా కూటమితో కలిసి నడవాలని నిర్ణయించిన తర్వాత... టీవీకే పాల్గొన్న తొలి వీధి నిరసన ఇదే.
“టీవీకే ఇప్పటికే ఇండియా కూటమిలో చేరింది. ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు ఉన్నారు. నిన్న జరిగిన ఇండియా కూటమి నిరసనలో పాల్గొన్నారు. ఇటీవలే తమిళనాడు విభాగంలో చేరారు. ఇకపై జాతీయ స్థాయిలో జరిగే నిరసనల్లోనూ పాల్గొంటారు” అని తిరుమావళవన్ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.
నిరసనకు విజయ్ దూరం... ప్రతినిధిగా మంత్రి
అయితే, ఈ నిరసనకు ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా హాజరుకాలేదు. టీవీకే తరఫున ఆ పార్టీ పాఠశాల విద్యాశాఖ మంత్రి ఎ. రాజ్మోహన్ పాల్గొన్నారు. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియను ఆయన ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ఎస్ఐఆర్పై తమ పార్టీ వ్యతిరేకతను మరోసారి స్పష్టం చేశారు.
ఈ ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓటు హక్కును కాపాడేందుకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
టీవీకే–ప్రతిపక్షాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం
ఇండియా కూటమి నిరసనలో పాల్గొనే ముందు టీవీకే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరిపింది. అక్టోబర్ 3న జరిగిన ఇండియా కూటమి తమిళనాడు విభాగం సమావేశానికి టీవీకే ప్రతినిధులు హాజరయ్యారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండీఎంకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఈ సమావేశంలో పాల్గొన్నాయి. అయితే, అక్టోబర్ 15న జరిగిన నిరసనకు డీఎంకే హాజరుకాకపోవడం మరో రాజకీయ చర్చకు దారితీసింది. గతంలో కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉన్న డీఎంకే ఈ నిరసనకు దూరంగా ఉండటం... ఆ రెండు పార్టీల మధ్య పెరుగుతున్న విభేదాలకు సంకేతంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే, అక్టోబర్ 10న చెన్నైలోని విజయ్ నివాసంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత టీవీకే, కాంగ్రెస్ మధ్య సంబంధాలు మరింత బలపడతాయనే ఊహాగానాలు మొదలయ్యాయి.
తాజాగా ఇండియా కూటమి నిరసనలో టీవీకే పాల్గొనడం, ఆ పార్టీ కూటమిలో చేరిందంటూ తిరుమావళవన్ చేసిన ప్రకటనతో ఈ చర్చ మరింత వేడెక్కింది. విజయ్ రాజకీయ అడుగులు తమిళనాడులో ప్రతిపక్షాల ఐక్యతను బలోపేతం చేస్తాయా? లేక డీఎంకే, కాంగ్రెస్ మధ్య సమీకరణాలను మరింత మార్చేస్తాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

