ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందేనా? కొత్త రూల్
x

ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందేనా? కొత్త రూల్

H-1B సహా కొన్ని వర్క్ వీసాలపై ఉన్నవారికి భారీ షాక్. ఉద్యోగం పోయిన తర్వాత ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది.


Click the Play button to hear this message in audio format

అమెరికాలో హెచ్-1బీ సహా కొన్ని తాత్కాలిక వర్క్ వీసాలపై ఉన్న విదేశీ ఉద్యోగులకు ఉద్యోగం పోయిన తర్వాత ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, ఉద్యోగం ముగిసిన వెంటనే సంబంధిత వీసాదారులు అమెరికాను విడిచిపెట్టాల్సి రావచ్చు.

ప్రస్తుతం H-1B, H-1B1, L-1, O-1, E-1, E-2, E-3, TN వీసాలపై ఉన్నవారికి ఉద్యోగం స్వచ్ఛందంగా ముగిసినా, కంపెనీ తొలగించినా గరిష్ఠంగా 60 రోజుల వరకు అమెరికాలో ఉండి కొత్త ఉద్యోగం వెతుక్కునే అవకాశం ఉంది. ఈ సౌకర్యాన్ని 2016లో ప్రవేశపెట్టారు.

కొత్త నిబంధనను హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ప్రతిపాదించింది. దీనిపై ప్రజల అభిప్రాయాలను 60 రోజుల పాటు స్వీకరించనుంది. నిబంధన ఖరారైతే, ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులు అమెరికా నుంచి వెళ్లి, కొత్త ఉద్యోగం దొరికిన తర్వాత తిరిగి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి రావచ్చు.

ఉద్యోగం ముగిసిన విషయాన్ని ప్రభుత్వం వెంటనే తెలియజేయాల్సిన H-1B, O-1 వంటి వీసాదారులకు దేశం విడిచిపెట్టాలని నోటీసులు వచ్చే అవకాశం కూడా ఉంటుందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు.

ఈ మార్పు ముఖ్యంగా అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నైపుణ్యవంతులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది చట్టబద్ధమైన వలసలను కట్టడి చేసే ట్రంప్ ప్రభుత్వ చర్యల్లో తాజాదిగా నిలుస్తోంది.

Read More
Next Story