
సీనియర్ ఈసీ అధికారిపై చర్యలకు డిమాండ్..
ఎన్నికల కమిషన్‌లో అంతర్గత విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. సీనియర్ అధికారిపై ఇద్దరు కమిషనర్లు చేసిన ఫిర్యాదుల వివరాలను ఆర్టీఐ బయటపెట్టింది.
ఎన్నికల కమిషన్‌లో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనీష్ గార్గ్‌పై చర్యలు తీసుకోవాలంటూ, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు క్యాబినెట్ సెక్రటరీకి లేఖలు రాసిన విషయం ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి, ఈ ఏడాది జూలై 29న క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్‌కు విడివిడిగా లేఖలు రాసినట్లు అధికారిక పత్రాలు వెల్లడించాయి. సీనియర్ అధికారుల మధ్య పని బాధ్యతలను మార్చిన ఉత్తర్వుపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
డిప్యూటీ ఎన్నికల కమిషనర్ భాను ప్రకాష్ యెటూరు సెలవులో ఉన్న సమయంలో జూలై 28న మనీష్ గార్గ్ పరిపాలన విభాగం అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు, డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు, డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారుల పని బాధ్యతల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
అయితే, ఈ మార్పులపై కమిషన్‌తో ముందుగా చర్చించలేదని సంధు తన లేఖలో ఆరోపించారు. తనకు కూడా సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. కమిషన్ ముందస్తు చర్చ లేదా ఆమోదం లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోరాదని గతంలోనే అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.
ఈ చర్యలు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలానికి సంబంధించిన 2023 చట్టంలోని సెక్షన్ 18(1), 18(2)లకు విరుద్ధమని సంధు అభ్యంతరం వ్యక్తం చేశారు. మనీష్ గార్గ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మరో కమిషనర్ వివేక్ జోషి కూడా ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. కమిషన్‌తో చర్చించకుండానే పని బాధ్యతల్లో మార్పులు చేశారని తన లేఖలో పేర్కొన్నారు. సంబంధిత ఫైలును కోరినా పరిపాలన విభాగం అందించలేదని ఆరోపించారు.
అయితే, ఈ లేఖలపై క్యాబినెట్ సెక్రటేరియట్ ఫైల్ నోట్‌లో మరో అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం.ఇద్దరు కమిషనర్లు తమ వ్యక్తిగత హోదాలో లేఖలు రాశారని, వాటిని మొత్తం ఎన్నికల కమిషన్ అధికారిక అభిప్రాయంగా పరిగణించరాదని పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి. అంతేకాదు, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం రాజ్యాంగబద్ధమైన సంస్థ కార్యకలాపాల్లో జోక్యంగా పరిగణించే అవకాశం ఉందని కూడా ఫైల్ నోట్ హెచ్చరించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, ఓటర్ల జాబితాలో కొత్త పేర్ల చేర్పు, తొలగింపులపై కూడా ఇద్దరు కమిషనర్లు గతంలో పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సెప్టెంబర్‌లో వార్తలు వచ్చాయి. అయితే, ఆర్టీఐ ద్వారా తాజాగా బయటపడిన లేఖలు మాత్రం ఆ వివాదానికి కాకుండా అధికారుల మధ్య పని బాధ్యతల కేటాయింపునకు సంబంధించినవే.

