క్యాంపస్‌లో కమ్యూనిస్టు చైతన్యం.. పార్టీలో మాత్రం యువత కరువు!
x

క్యాంపస్‌లో కమ్యూనిస్టు చైతన్యం.. పార్టీలో మాత్రం యువత కరువు!

బెంగాల్‌లో ఎస్ఎఫ్ఐ కార్యకలాపాలు పెరుగుతున్నా.. సీపీఎంలో యువ సభ్యుల సంఖ్య తగ్గుతోంది. తాజా సమీక్షలో 30 ఏళ్లలోపు సభ్యులు కేవలం 4.55 శాతమేనని వెల్లడైంది.


Click the Play button to hear this message in audio format

పశ్చిమ బెంగాల్‌లో సీపీఎంకు ఇదో ఆసక్తికరమైన వైరుధ్యం. క్యాంపస్‌లలో ఆ పార్టీ విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ చురుగ్గా కనిపిస్తోంది. వామపక్షాల నిరసనల్లో యువత కూడా పాల్గొంటోంది. కానీ అదే యువతలో పార్టీ సభ్యులుగా చేరుతున్న వారి సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది.

సీపీఎం ప్రకారం.. బెంగాల్‌లోని ఆ పార్టీ సభ్యుల్లో 30 ఏళ్లలోపు వారు కేవలం 4.55 శాతం మాత్రమే. యువతను కొత్త సభ్యులుగా చేర్చుకోవడంపై తగినంత దృష్టి పెట్టడం లేదన్న విషయాన్ని పార్టీ గుర్తించింది. ఆగస్టు 29, 30 తేదీల్లో నదియా జిల్లాలోని కల్యాణిలో జరిగిన విస్తృత రాష్ట్ర కమిటీ సమావేశం తర్వాత.. పార్టీ రాష్ట్ర కార్యాలయం సభ్యులకు పంపిన 12 పేజీల లేఖలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. యువతలో కనిపిస్తున్న రాజకీయ చైతన్యం.. పార్టీ సంస్థాగత బలోపేతంగా ఎందుకు మారడం లేదనే ప్రశ్నను ఈ సమీక్ష లేవనెత్తింది.

క్యాంపస్‌లో చురుకు.. పార్టీలోకి వచ్చేసరికి ఎందుకు తగ్గుతోంది?విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ఎస్ఎఫ్ఐతో పనిచేసిన సోమనాథ్ సౌ.. సంస్థాగత సమస్యలు, చదువుపై దృష్టి కారణంగా కొంతకాలం పార్టీకి దూరమైనట్లు చెప్పారు. 2013 నుంచి 2023 వరకు ఎస్ఎఫ్ఐతో అనుబంధంగా ఉన్న ఆయన.. ప్రస్తుతం బుర్ద్వాన్‌లో న్యాయశాస్త్రం చదువుతూ ప్రాక్టీస్ చేస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ పార్టీలో చురుగ్గా ఉండాలని సీపీఎం తనను సంప్రదించినట్లు తెలిపారు.

క్యాంపస్‌లలో విద్యార్థి సంఘానికి ఒక బలమైన నిర్మాణం ఉన్నప్పటికీ.. విద్యార్థులు చదువు పూర్తిచేసుకుని స్వస్థలాలకు వెళ్లిన తర్వాత ఆ అనుసంధానం బలహీనపడుతోందని పలువురు మాజీ కార్యకర్తలు చెబుతున్నారు. ముఖ్యంగా గత 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనలో సీపీఎం సంస్థలు బలహీనపడిన ప్రాంతాలకు తిరిగి వెళ్లిన యువ కార్యకర్తలకు.. స్థానిక పార్టీ యూనిట్లతో సంబంధం కొనసాగడం కష్టంగా మారుతోందని అంటున్నారు. సానుభూతిపరులు, మద్దతుదారులను ప్రాథమిక సభ్యులుగా తీర్చిదిద్దే ‘ఆగ్జిలరీ గ్రూప్’ కూడా బెంగాల్‌లోని 64.90 శాతం పార్టీ శాఖల్లో లేదని సీపీఎం అంతర్గత సమీక్ష పేర్కొంది. దీని వల్ల కొత్త కార్యకర్తలను క్రమంగా పార్టీ నిర్మాణంలోకి తీసుకురావడానికి అవసరమైన ప్రాథమిక వ్యవస్థ బలహీనపడుతోందని సమీక్ష సూచించింది.


యువ కార్యకర్తలకు అవకాశాలు తక్కువా?

క్యాంపస్ నుంచి తిరిగి వచ్చే విద్యార్థి కార్యకర్తలకు ఏరియా కమిటీలతో సరైన సమాచార మార్పిడి లేదా అనుసంధానం ఉండటం లేదని ఓ మాజీ ఎస్ఎఫ్ఐ కార్యకర్త పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థ కోల్‌కతా కేంద్రంగా మారిందని.. నగర క్యాంపస్‌ల్లో కనిపించే యువ నాయకులకు ఎక్కువ గుర్తింపు లభిస్తుండగా, జిల్లాలు, బ్లాక్‌లలో పనిచేసే వారికి అంతగా అవకాశాలు దక్కడం లేదని కొందరు కార్యకర్తలు చెబుతున్నారు.

పార్టీలో ప్రాధాన్యం దక్కకపోవడంతో కొందరు మాజీ విద్యార్థి నాయకులు వామపక్షాలను వీడిన ఉదాహరణలను కూడా వారు ప్రస్తావిస్తున్నారు. / సౌమెన్ కర్ఫా, ప్రతీక్యుర్ రెహమాన్ పేర్లను ఇందుకు ఉదాహరణలుగా చెబుతున్నారు.ప్రస్తుతం భటార్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కర్ఫా్కు గతంలో డీవైఎఫ్ఐతో అనుబంధం ఉంది. మరోవైపు.. సీపీఎం నాయకత్వ వ్యూహాలతో విభేదించిన ప్రతీక్యుర్ రెహమాన్ 2026 ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఆ సమయంలో తాను ఒంటరిగా, ఊపిరాడని పరిస్థితిలో ఉన్నట్లు భావించానని ఆయన పేర్కొన్నారు.


వలసలు కూడా మరో కారణమే..

విద్య, ఉద్యోగాల కోసం బెంగాల్ నుంచి ఇతర రాష్ట్రాలకు యువత వలస వెళ్లడం కూడా పార్టీతో వారి అనుబంధాన్ని బలహీనపరుస్తోందని కొందరు కార్యకర్తలు చెబుతున్నారు. బీర్భూమ్‌కు చెందిన మాజీ ఎస్ఎఫ్ఐ కార్యకర్త దేబాసిష్ మండల్.. ఉన్నత చదువుల కోసం జార్ఖండ్ వెళ్లిన 2018లో ఆ సంస్థను వీడారు. చదువు, ఉద్యోగాల కోసం రాష్ట్రం వెలుపలికి వెళ్లే యువత సంఖ్య పెరుగుతోందని.. భౌతికంగా పార్టీకి దూరమైనా, వారిలో చాలామంది రాజకీయంగా సానుభూతి కొనసాగిస్తున్నారని మండల్ చెప్పారు.


తగ్గుతున్న యువ సభ్యులు ..

ఇక్కడే సీపీఎం సంస్థాగత గణాంకాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీ 24వ కాంగ్రెస్‌లో ఆమోదించిన సంస్థాగత నివేదిక ప్రకారం.. బెంగాల్‌లో ఎస్ఎఫ్ఐ సభ్యత్వం 2020-21లో సుమారు 5.1 లక్షల నుంచి 2023-24 నాటికి 8.3 లక్షలకు పైగా పెరిగింది. అయితే అదే సమయంలో యువ సీపీఎం సభ్యుల వాటా పెరగలేదు. పార్టీ రికార్డుల ప్రకారం.. 30 ఏళ్లలోపు సభ్యుల నిష్పత్తి 2021లో 8.7 శాతం ఉండగా, 2024 నాటికి 8.2 శాతానికి పడిపోయింది. తాజా సంస్థాగత సమీక్షలో అది మరింత తగ్గి 4.55 శాతంగా నమోదైంది.

2026 సభ్యత్వ పునరుద్ధరణ నివేదిక ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే పార్టీ మొత్తం సభ్యత్వం 0.44 శాతం తగ్గింది. కొత్త సభ్యులను చేర్చుకోవడంలో పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ గణాంకాలు చూపిస్తున్నాయి. ఇదే సమయంలో విద్య, పరీక్షలు, ఉద్యోగాలు వంటి అంశాలపై ఎస్ఎఫ్ఐ, ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు క్యాంపస్‌లలో చురుగ్గా పనిచేస్తున్నాయి. ఇటీవల జరిగిన పలు ఉద్యమాల్లోనూ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు పాల్గొన్నారు.


పార్టీ వైపు తిప్పేందుకు కొత్త ప్రయత్నాలు

ఈ పరిస్థితిని మార్చేందుకు సీపీఎం ‘ప్రోజోన్మెర్ డాక్’ అంటే ‘తరం పిలుపు’ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జెన్‌జెడ్ యువతను లక్ష్యంగా చేసుకుని.. విద్య, ఉద్యోగాలు, ఇతర సమస్యలపై సంగీతం, డిజిటల్ సంభాషణలు, యువ నాయకులతో చర్చలు నిర్వహిస్తోంది. సంప్రదాయ ర్యాలీలు, సమావేశాలకు మాత్రమే పరిమితం కాకుండా.. యువతతో కొత్త మార్గాల్లో అనుసంధానం కావడమే ఈ కార్యక్రమాల ఉద్దేశమని పార్టీ చెబుతోంది. ప్రజా ఉద్యమాల్లో పాల్గొనే యువతను క్రమబద్ధంగా సమీకరించి.. ప్రజా సంఘాల ద్వారా వారిని పార్టీ నిర్మాణంలోకి తీసుకురావాలని తాజా అంతర్గత సమీక్ష సూచించింది. రాజకీయ, సైద్ధాంతిక శిక్షణతో పాటు ఉద్యమాల ద్వారా వచ్చిన అనుభవాన్ని సంస్థాగత చైతన్యంగా మార్చాలని పేర్కొంది.


క్షేత్రస్థాయిలోనూ బలం కావాలి..

పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాలను మరింత వ్యవస్థీకృతంగా, సమన్వయంతో నిర్వహించాలని కూడా సమీక్ష సూచించింది. కేవలం ఆన్‌లైన్‌లో కనిపించడం కంటే క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. రాష్ట్ర సీపీఎం నాయకుడు, మాజీ ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి మయూఖ్ బిస్వాస్.. పార్టీలో ఉన్న కొన్ని సంస్థాగత సమస్యలను పరిష్కరించామని చెప్పారు. యువత భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ‘ది ఫెడరల్’తో తెలిపారు. విద్యార్థి ఉద్యమాల్లో ఇటీవలి కాలంలో యువత భాగస్వామ్యం గణనీయంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. / అయితే.. ఆ చైతన్యాన్ని పార్టీ సంస్థాగత బలంగా మార్చడం బెంగాల్ సీపీఎంకు ప్రస్తుతం ప్రధాన సవాలుగా కనిపిస్తోంది.

Read More
Next Story