శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో సీఎం అరుదైన రికార్డు

తిరుమల వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సాల్లో పెదశేషవాహన సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు


తిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 15వ సారి పట్టువస్త్రాల సమర్పించారు.శ్రీవెంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంగళవారం సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించి అరుదైన రికార్డు నమోదు చేశారు.


ఆలయ సంప్రదాయం: శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద అర్చకులు సీఎం దంపతులకు సంప్రదాయబద్ధంగా ‘పరివట్టం’ కట్టగా, ముఖ్యమంత్రి పట్టువస్త్రాలను వెండి పళ్ళెంలో తలపై మోస్తూ మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లి గర్భాలయంలో అర్చకులకు అందజేశారు.

వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు: స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు సీఎం దంపతులకు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈఓ ఎం. రవిచంద్ర ముఖ్యమంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు.
డైరీ, క్యాలెండర్ల ఆవిష్కరణ: టీటీడీ రూపొందించిన 2027 నూతన సంవత్సర డైరీలు, క్యాలెండర్లను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.

ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థన: స్వామివారికి 15వ సారి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం లభించడం అదృష్టమని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల క్షేమం, సమృద్ధిగా వర్షాలు కురవాలని, అలాగే భారతదేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఎదగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఆలయ సంస్కృతికి తిరుమల ఆదర్శం: భక్తుల కోసం అనేక సంస్కరణలు చేపడుతూ తిరుమలను ఆలయ సంస్కృతికి రోల్ మోడల్‌గా నిలిపినందుకు టీటీడీ బోర్డును, అధికారులను సీఎం అభినందించారు.

మలయప్ప వాహన సేవలో సీఎం


తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహనసేవలు మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉభయ దేవేరులతో కలిసి పల్లకిపై పెద్దశేష వాహనంపై విహరిస్తున్న శ్రీమలయప్పస్వామివారిని దర్శించుకున్నారు. వాహనసేవలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబీకులతో కలిసి ఈ సంవత్సరం కూడా పాల్గొన్నారు. మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబీకులు భార్య నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు నారా బ్రహ్మణి, మనవడు నారా దేవాన్ష్ తిరుమలలోనే బస చేశారు.

తిరుమలలో బుధవారం ముఖ్యమంత్రి ఎస్వీ మ్యూజియం ప్రారంభించడంతో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెంట మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారా లోకేష్, సత్యప్రసాద్‌లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, టీటీడీ అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి, సివిఎస్వో మురళీకృష్ణ, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
Read More
Next Story