వైభవ్ సూర్యవంశీకి అరుదైన అవకాశం
x

వైభవ్ సూర్యవంశీకి అరుదైన అవకాశం

విదేశీ పర్యటనకు తల్లిదండ్రులతో వెళ్లేందుకు BCCI ప్రత్యేక అనుమతి


Click the Play button to hear this message in audio format

15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అరుదైన అవకాశం కల్పించింది. రాబోయే శ్రీలంక, ఇంగ్లాండ్ పర్యటనల కోసం భారత టీ20 జట్టులో ఎంపికైన అతను, జట్టుతో కలిసి విదేశాలకు వెళ్లనున్నాడు. అతను మైనర్ కావడంతో, ప్రయాణం సమయంలో అతని తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు వెంట ఉండేందుకు బీసీసీఐ ప్రత్యేక అనుమతి ఇచ్చింది. సాధారణంగా సీనియర్ జట్టులో ఇలాంటి సౌకర్యాలు అరుదుగా ఉండగా, యువ ఆటగాడి భద్రత, మానసిక స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు పేర్కొంది.

ప్యూచర్ స్టార్‌ వైభవ్‌..

బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా మాట్లాడుతూ, “అతను చిన్నవాడు కావడంతో పెద్దల జట్టుతో ప్రయాణించడం కొత్త అనుభవం అవుతుంది. అందుకే కుటుంబ సభ్యుల సహాయం అవసరం” అని తెలిపారు. ఇంగ్లాండ్ పర్యటనలో కూడా ఇదే సౌకర్యం కొనసాగుతుందని బోర్డు స్పష్టం చేసింది.

ఇక సెలెక్టర్ల కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ వైభవ్ ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నిజానికి అతనే తన ప్రదర్శనతో తన ఎంపికను ఖరారు చేసుకున్నాడు” అని అన్నారు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అతను చూపిన నిలకడ, ఒత్తిడిలో ఆడిన తీరు అతనిని ప్రత్యేక ఎంపికగా మార్చిందని తెలిపారు. 23 ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనే 1000కు పైగా పరుగులు సాధించడం అతని ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు.

వైభవ్ అంతర్జాతీయ మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తే, సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించి భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. టెండూల్కర్ 16 సంవత్సరాల 207 రోజుల వయసులో అరంగేట్రం చేసిన రికార్డు ఇప్పటివరకు నిలిచింది.

ఇంగ్లాండ్ పర్యటన కోసం ప్రకటించిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి వంటి కీలక ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అనుభవజ్ఞుల సమ్మేళనంగా జట్టును ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు తెలిపారు.

Read More
Next Story