అర్నాబ్ తుఫాన్ తీరు వినూత్నం!
x
విశాఖ‌లో పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు చేప‌డుతున్న ఎన్‌డీఆర్ ఎఫ్ బృందం

అర్నాబ్ తుఫాన్ తీరు వినూత్నం!

అర్నాబ్ తుఫాన్ తీరం దాట‌డంలో స‌రికొత్త రికార్డును సృష్టించింది. సాధార‌ణంకంటే రెట్టింపు స‌మ‌యం తీసుకుని ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది.

కొద్దిరోజులుగా అల‌జ‌డి రేపుతున్న అర్నాబ్ తుఫాన్ దోబూచులాట‌ల న‌డుమ ఎట్ట‌కేల‌కు తీరాన్ని దాటింది. ఎల్‌నినోతో ఎండ‌ల‌తో మండిపోతున్న రాష్ట్రానికి నీటి కొర‌త‌ను చాలావ‌ర‌కు తీర్చింది. కుండ‌పోత వ‌ర్షాల‌తో పాతాళానికి ప‌డిపోయిన‌ భూగ‌ర్భ జ‌లాల‌ను పైపైకి రావ‌డానికి దోహ‌ద‌ప‌డింది. అడుగంటిపోయిన జ‌లాశ‌యాల‌కు జ‌ల‌క‌ళ నింపింది. మొత్త‌మ్మీద చూస్తే న‌ష్టంకంటే ఒకింత మేలునే చేసింది.


అన‌కాప‌ల్లి జిల్లాలో ప్ర‌వ‌హిస్తున్న వాగు వ‌ద్ద పోలీసులు

అంచ‌నాల‌ను త‌ల్ల‌కిందులు చేస్తూ..

అర్నాబ్ తుఫాన్ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర్సాపురానికి తూర్పు ఈశాన్య దిశ‌గా 20 కి.మీలు, యానాంకి నైరుతి దిశ‌గా 40 కి.మీల దూరంలో తీరాన్ని దాటింది. తొలుత ఈ తుఫాన్ బుధ‌వారం వేకువ‌జామున 2-4 గంట‌ల మ‌ధ్య యానాం స‌మీపంలో తీరాన్ని దాటుతుంద‌ని అంచ‌నా వేసింది. అయితే మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి సాయంత్రం వ‌ర‌కు తుఫాన్ గంట‌కు 20 కి.మీల వేగం పుంజుకుంది. దీంతో అది నిర్ణీత స‌మ‌యంకంటే ముందే తీరాన్ని దాటుతుంద‌ని ఐఎండీ పేర్కొంది. కానీ అనూహ్యంగా అర్నాబ్ త‌న వేగాన్ని గంట‌కు 3-4 కి.మీల‌కు త‌గ్గించుకుంది. ఫ‌లితంగా దాని వేగం గ‌ణ‌నీయంగా మంద‌గించింది. బుధ‌వారం వేకువ‌జామున 2 గంట‌ల‌కే తుఫాన్ తీరాన్ని తాకే ప్ర‌క్రియ మొద‌లైంది. ఈ ప్ర‌క్రియ రెండు గంట‌ల్లో పూర్త‌యి 4 గంట‌ల‌కు తీరాన్ని దాటాల్సి ఉంది. కానీ ఏకంగా ఆరు గంట‌ల పాటు అక్క‌డే తిష్ట వేసుకుని కూర్చోవ‌డంతో బుధ‌వారం ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు తీరాన్ని పూర్తిగా దాట‌లేదు. ఈ అతి తీవ్ర తుఫాన్ తీరాన్ని దాటే స‌మ‌యంలో గంట‌కు 125-135 కి.మీలు, గ‌రిష్టంగా 150 కి.మీల వేగంతో పెనుగాలులు వీచాయి.

విశాఖలో ఎగ‌సి ప‌డుతున్న స‌ముద్ర కెర‌టాలు

ఆరు గంట‌ల స‌మ‌యం అత్యంత అరుదు..

సాధార‌ణంగా తుఫాన్ తీరాన్ని తాకాక గ‌రిష్టంగా రెండు గంట‌ల్లోనే ల్యాండ్ ఫాల్ అవుతుంది. కానీ అర్నాబ్ అసాధార‌ణంగా ఆరు గంటల స‌మ‌యం తీసుకుంది. ఇన్ని గంట‌ల స‌మ‌యం ప‌ట్ట‌డం అత్యంత అరుద‌ని వాతావ‌ర‌ణ నిపుణులే ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌డ‌చిన ఐదారు ద‌శాబ్దాల్లో ఇలాంటి ప‌రిస్థితి లేద‌ని వీరు చెబుతున్నారు. న‌ర్సాపురం-యానాంల మ‌ధ్య భౌగోళిక ప‌రిస్థితులు, ఆ స‌మ‌యంలో నెల‌కొన్న ప్ర‌త్యేక వాతావ‌ర‌ణ ప‌రిస్థితులే ఇందుకు దోహ‌దం చేసి ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. అర్నాబ్ తుఫాన్ తీరాన్ని దాట‌డానికి ఆరు గంట‌ల స‌మ‌యం ప‌ట్ట‌డానికి దారితీసిన అంశాల‌పై ఐఎండీ ఉన్న‌తాధికారులు శోధిస్తున్నారు.

స‌ముద్రంలో అదుపు త‌ప్పిన సింగ‌పూర్ కార్గో షిప్

క‌ద‌ల‌కుండా కూర్చుని కుండ‌పోత కురిసింది..

ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో న‌ర్సాపురం-యానాంల మ‌ధ్య అర్నాబ్ తుఫాన్ తీరాన్ని దాట‌కుండా ఆరు గంట‌లు దాదాపు స్థిరంగా ఉండిపోయింది. ఆ స‌మ‌యంలో ఇటు విజ‌య‌న‌గ‌రం నుంచి అటు ఏలూరు వ‌ర‌కు కుండ‌పోత వ‌ర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లో గ‌రిష్టంగా 20-26 సెం.మీల భారీ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. బుధ‌వారం ఉద‌యం వ‌ర‌కు అత్య‌ధికంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా గ‌రివిడిలో 26, ఎస్‌.కోట‌, వేపాడ‌, చీపురుప‌ల్లిల్లో 25, అన‌కాప‌ల్లిలో 25, విశాఖ జిల్లా భీమునిపట్నంలో 24, అన‌కాప‌ల్లి జిల్లా య‌ల‌మంచిలిలో 24, శ్రీ‌కాకుళం జిల్లా ర‌ణ‌స్థ‌లంలో 23,
విజ‌య‌న‌గ‌రం 22, నెల్లిమ‌ర్ల 22
, గ‌జ‌ప‌తిన‌గ‌రం 22, విశాఖ‌పట్నం 22, చోడ‌వ‌రం (అన‌కాప‌ల్లి)లో 21 సెం.మీల చొప్పున భారీ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఇంకా క‌ళింగ‌పట్నం (శ్రీ‌కాకుళం) 14.7, కాకినాడ 11.8, మ‌చిలీపట్నం 11.5 సెం.మీల చొప్పున వ‌ర్షం కురిసింది.

రాష్ట్రంలో ఐదుగురి మృత్యువాత‌..

అర్నాబ్ తుపాను ప్ర‌భావంతో జ‌రిగిన వివిధ సంఘ‌ట‌న‌ల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా ఐదుగురు మ‌ర‌ణించారు. భీమ‌వ‌రంలో చెట్టు విరిగిప‌డి కిషోర్ (48), విశాఖ‌ప‌ట్నంలో విద్యుత్ వైర్లు నీటిలో తెగిప‌డ‌టంతో క‌రెంట్ షాక్‌కు గురై దేవుడు (65), బాలాజీన‌గ‌ర్‌లో విద్యుత్ స్తంభం పండి మాధ‌వి మృత్యువాత ప‌డ్డారు. అన‌కాప‌ల్లి జిల్లా య‌ల‌మంచిలిలో క‌రెంట్ షాక్‌తో భాగ్య‌లక్ష్మి, కోన‌సీమ జిల్లా స‌ఖినేటిప‌ల్లిలో గుడిసె కూలి వెంకాయ‌మ్మ దుర్మ‌ర‌ణం పాల‌య్యారు

రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం..

తుఫాన్ నేప‌థ్యంలో ద‌క్షిణ కోస్తా, ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలు తెలుగు రాష్ట్రాల్లో రాక‌పోక‌లు సాగించే ప‌లు రైళ్ల‌ను ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌గా ర‌ద్దు చేశాయి. ఇలా దాదాపు వంద‌కు పైగా ప్ర‌యాణికుల రైళ్లు ర‌ద్ద‌య్యాయి. అలాగే కిరండోల్‌-కొత్త‌వ‌ల‌స (కేకే) లైన్‌లో బొర్రాగుహ‌లు వ‌ద్ద రైల్వే ట్రాక్ దెబ్బ‌తింది. దీంతో ఆ లైన్‌లో వెళ్లే పాసింజ‌ర్‌, గూడ్స్ రైళ్ల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. అర్నాబ్ తుఫాన్ తీరాన్ని దాట‌డంతో ర‌ద్ద‌యిన రైళ్ల‌ను పున‌రుద్ధ‌రించ‌నున్నారు.

కొట్టుకు వచ్చిన సింగ‌పూర్ కార్గో నౌక‌

విశాఖ‌ప‌ట్నం నుంచి సింగ‌పూర్ వెళ్తున్న కార్గో నౌక తుఫాన్ ప్ర‌భావంతో స‌ముద్రంలో కొట్టుకుపోయింది. విశాఖ‌ప‌ట్నంలో స‌ల్ఫ‌ర్‌ స‌ర‌కును అన్‌లోడ్ చేసి సింగ‌పూర్‌కు బ‌య‌ల్దేరిన మార్ష‌ల్ ఐలండ్‌కు చెందిన సిగ్మా పెర‌ల్ అనే నౌక కాకినాడ‌కు స‌మీపంలోని కేజీ బేసిన్ రవ్వ చ‌మురు క్షేత్రం వ‌ద్ద‌కు వ‌చ్చే స‌రికి ఇంజ‌న్ ఫెయిల్ అయింది. దీంతో ఆ నౌక అదుపు త‌ప్పి అంత‌ర్వేది స‌ముద్ర తీరం స‌మీపంలోకి వ‌చ్చింది. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం ఈ నౌక‌లోని సిబ్బందికి ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదు. అధికారులు ఆ నౌక‌ను సుర‌క్షితంగా ఉంచేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

విద్యుత్ పున‌రుద్ధ‌ర‌ణ చ‌ర్య‌లు..

అర్నాబ్ తుఫాన్ ప్ర‌భావంతో ఉత్త‌ర కోస్తాంధ్ర‌లో ప‌లు చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. ప‌లు ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్ స్తంభాల‌పై ప‌డ‌డం, స్తంభాలు నేల‌కొర‌గ‌డం, విద్యుత్ వైర్లు తెగిప‌డ‌డం వంటి కార‌ణాల‌తో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. బుధ‌వ‌రం ఉద‌యం వ‌ర‌కు చాలాచోట్ల విద్యుత్ పున‌రుద్ధ‌ర‌ణ‌కు వీలు ప‌డ‌లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో 20 గంట‌ల పాటు అంధ‌కారం నెల‌కొంది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి విద్యుత్ స‌ర‌ఫ‌రాను పున‌రుద్ధ‌రించారు.
Read More
Next Story