ఫిబ్రవరి 10 నుంచి 23 వరకు ఉత్సవాలు
ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి
స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం 18న
దేశంలోని 12 ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శ్రీకాళహస్తి కూడా ఒకటి. రాహు, కేతు పూజలకు ప్రసిద్ధి చెందిన శ్రీ-కాళ-హస్తి క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి పదో తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉత్సవాల నిర్వహణకు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి, తిరుపతి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై సమీక్షించింది. ఏడాదికి ఒకసారి మహాశివరాత్రి రోజు మాత్రమే లింగోద్భవ దర్శనంలో సామాన్య యాత్రికులకు ప్రాధాన్యత ఇస్తామని అధికారులు చెప్పారు. 18వ తేదీ స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం రోజు బాల్యవివాహాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్. వి. వెంకటేశ్వర్ తెలిపారు.
మాట్లాడుతున్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్, పక్కన ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, కుడిపక్క పాలక మండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్
"తిరుమల తరహాలోనే అన్ని శాఖల సమన్వయంతో సామాన్య యాత్రికుల దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తాం" అని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు – 2026 నిర్వహణపై వివిధ శాఖల సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ. ఎల్. సుబ్బారాయుడు , ఆలయ చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, కొత్తగా నియమితులైన 17 మంది బోర్డు సభ్యులు, ఈవో బాపిరెడ్డి, ఆర్డీఓ శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి, పాలక మండలి సభ్యులతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు.
"శ్రీకాళహస్తి ఆలయంలో కూడా తిరుమల తరహాలో విఐపిల ప్రోటోకాల్ దర్శనాలకు సమయం కేటాయించాలని నిర్ణయించాం" అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు.
తిరుమల తరహాలో..
తిరుమల తరహాలోనే ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి పదో తేదీ నుంచి ఫిబ్రవరి 23 వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో సామాన్య భక్తులు ప్రామాణికంగా ఏర్పాట్లు చేస్తామని శ్రీకాళహస్తి పాలక మండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ చెప్పారు. అనుగుణంగా తిరుమల తరహాలో శ్రీ కాళహస్తి ఆలయంలో కూడా నిర్దేశిత సమయం కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు.
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ద్వారా కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తామని ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తెలిపారు. "ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా, సిసి కెమెరాలు, డ్రోన్ నిఘా ఏర్పాట్లను పటిష్టంగా ఏర్పాటు చేస్తాం" అని ఎస్పీ సుబ్బారాయుడు చెప్పారు.
"స్వర్ణముఖి నదిలో పుణ్యస్నానాలు ఆచరించే యాత్రికుల భద్రత కోసం గజఈతగాళ్ళను కూడా అందుబాటులో ఉంచండి" అని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు అధికారులను ఆదేశించారు.సామాన్య భక్తులతో పాటు వి ఐ పి లకు కూడా శివరాత్రి రోజున ఉత్సవాలు అందరికీ అందుబాటులో ఉండేలా కట్టు దిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయ సిబ్బంది, అధికారులకు గుర్తింపు కార్డులు లేదా పాస్ ఉండాలని అన్నారు.
పట్టణంలో ఏర్పాట్లు
మహాశివరాత్రికి ముందు శ్రీకాళహస్తిలో చేయాల్సిన పనులపై తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్డర్ వెంకటేశ్వర్ ప్రత్యేక సూచనలు చేశారు.
"ఆలయ నాలుగు మాడవీధులు, పరిసర ప్రాంతాల రోడ్లు రిపేర్లు పూర్తి చేయాలన్నారు. మునిసిపల్ శాఖ సమన్వయంతో నగరం, ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి, తాగునీరు, దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టండి" అని కలెక్టర్ సూచనలు చేశారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా, రూట్ మ్యాప్ లో డిజిటల్ బోర్డ్స్ అందుబాటులో ఉంచాలన్నారు.
బాల్య వివాహాల నివారణ..
మహాశివరాత్రి తరువాత ఆది దంపతులైన పార్వతీ, పరమేశ్వరుడికి కల్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అదే సమయంలో శ్రీకాళహస్తి పట్టణం, పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తునవివాహాలు నిర్వహించడానికి ఆసక్తి చూపిస్తారు. ఆ సమయంలో బాల్య వివాహాలు కూడా జరుపుతూ ఉంటారు. దశాబ్ద కాలం నుంచి బాల్య వివాహాల నివారణకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
"ఈ సంవత్సరం కూడా బాల్య వివాహాల నివారణకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం" అని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు చెప్పారు.
"జిల్లాలోని ఐసీడీఎస్, పోలీసు శాఖతో పాటు అనుబంధ శాఖలను సమన్వయంతో బాల్య వివాహాలు నివారిస్తాం" అని కలెక్టర్, ఎస్పీ స్పష్టం చేశారు బ్రహ్మోత్సవాల సమయంలో నాణ్యమైన సాంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్ల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారిద్దరు శ్రీకాళహస్తి ఆలయ ఈఓ బాపిరెడ్డికి సూచించారు.
"బాల్య వివాహాలు జరిపించిన, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు.
శ్రీకాళహస్తి ఆలయం తోపాటు దేశంలోనే మొదటి ఆలయం, బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు కొలువైన చారిత్ర కలిగిన గుడిమల్లం ప్రాశస్త్యం తెలిసేలా ప్రచారం చేయాలని కలెక్టర్ సూచించారు. గుడిమల్లం ఆలయాన్ని ఎక్కువ శాతం మంది భక్తులు దర్శించుకోవాలని అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు.