YCP | కర్నూలులో ఈ రోజు ఆంక్షలు మధ్య జగన్ పర్యటనపైఉత్కంఠ
ఆంక్షలు మీరితే చర్యలు తప్పవంటున్న పోలీసులు
ఆంక్షల మధ్య మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ ఇంకొన్ని గంటల్లో కర్నూలులో పర్యటనకు రానున్నారు. జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్న ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బీ. విరూపాక్షిని పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కర్నూలులో మకాం వేశారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, పార్టీ నేతలతో సమీక్షించారు.
తాడేపల్లి నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకునే జగన్ పంచలింగాల సమీపంలోని జిల్లా జైలు వద్దకు చేరుకుని రిమాండ్ లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బీ. విరూపాక్షితో ములాఖత్ కావాలంటే, 38 కిలోమీటర్లు ప్రయాణించాలి. రోడ్డు మార్గంలో నిర్వహించే ర్యాలీపై ఉత్కంఠ ఏర్పడింది. , జగన్ పర్యటన నేపథ్యంలో కర్నూలు జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఆంక్షల మధ్య సాగే జగన్ పర్యటనపై ఆసక్తి నెలకొంది.
జగన్ టూర్ షెడ్యూల్ ఇదీ..
ఉదయం9 గంటలకు: తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు.
ఉదయం 11గంటలకు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుంటారు.
11:30 గంటలు: ఓర్వకల్లు నుంచి రోడ్డు మార్గాన పంచలింగాలలోని జిల్లా జైలుకు చేరుకుంటారు. అక్కడ ములాఖత్ ద్వారా ఆలూరు ఎమ్మెల్యే బి. విరూపాక్షిని పరామర్శిస్తారు.
మధ్యాహ్నం: కర్నూలు నుంచి తిరుగు ప్రయాణం.
కర్నూలులో జగన్ పర్యటన నేపథ్యంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ బందోబస్తు ఏర్పాట్లపై స్పందించారు.
"మాజీ సీఎం వైఎస్. జగన్ కర్నూలు పర్యటన, ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖత్ కు మాత్రమే అనుమతి ఉంది" అని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు.
"బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్‌షోలు, ప్రజా సమావేశాలకు అనుమతి లేదు" అని ఎస్పీ పాటిల్ చెప్పారు. కర్నూలు డీఎస్పీ రాఘవేంద్రతో కలిసి జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
జిల్లాలో 30 పోలీసు యాక్టు అమలులో ఉన్నందున శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని ఎస్పీ పాటిల్ కోరారు. ప్రజా జీవితానికి ఆటంకం లేకుండా పర్యటన పూర్తి చేసుకోవాలని సూచించిన ఆయన సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
మాజీ సీఎం వై.ఎస్. జగన్ ఈ నెల 13వ తేదీ కర్నూలు జిల్లా పర్యటనలో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించడానికి వస్తున్నట్లు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ తెలియజేశారని ఎస్పీ వివరించారు. అందులో ఎంతమంది వస్తారనేది కూడా చెప్పలేదని గుర్తు చేశారు.
"ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖత్, కాన్వాయ్ కు మాత్రమే పోలీసు బందోబస్తు అడిగారు. ఆ విధంగానే పోలీసు భద్రతా ఏర్పాట్లు చేశాం" అని వివరించారు.
ర్యాలీపై నిషేధం..
కర్నూలు - ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో దాదాపు 38 కిలోమీటర్లు హైవే కర్నూలు జిల్లా కేంద్రం పంచలింగాల దగ్గర ఉన్న జైలుకు రావాల్సి ఉంటుందన్నారు. జనజీవనానికి ఆటంకం లేకుండా, సమావేశాలు , గుంపులు, ర్యాలీలు నిర్వహించరాదని ఎస్పీ సూచించారు.
అందుకు కారణాలను కూడా ఎస్పీ పాటిల్ వివరించారు.
"హైవేపై స్కూల్స్, కళాశాలు, హాస్పిటల్స్ ఉన్నాయి. చుట్టు ప్రక్కల రోడ్డుపై వాహనాదారులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదు. అవసరమైన మెడికల్ ఎమర్జన్సీ ని ఏర్పాటు చేస్తున్నాం" అని ఎస్పీ పాటిల్ వివరించారు.
నగరంలోని పంచలింగాల వద్ద ఉన్న జిల్లా జైలులో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖాత్‌కు వెళ్లేందుకు మాత్రమే మాజీ సీఎం జగన్ కు అనుమతి ఉందని ఆయన అన్నారు.
అమలులో 30 పోలీస్ యాక్టు...
నగరంలో పోలీస్ యాక్టు 30 అమలులో ఉన్నందువల్ల ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పోలీసుల అనుమతి లేని బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించవద్దని కర్నూలు జిల్లా ఎస్పీ పాటిల్ సూచించారు. పోలీసు శాఖ విధించిన నిబంధనలను పాటిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సహకరించాలని ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.
పర్యటన సందర్భంగా పోలీసు శాఖ విధించిన షరతులు లేదా చట్టబద్ధమైన నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే, సంబంధిత చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు.
Next Story

