x

శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ సర్వదర్శనాలే...

తిరుపతిలో జారీ చేసే టైంస్లాట్ టోకెన్ల తాత్కాలికంగా రద్దు.


తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ వీఐపీ సిఫారసు లేఖల తోపాటు టైంస్లాట్ టోకెన్ల ( SDS ) జారీ కూడా రద్దు చేశారు. సోమవారం ఉదయం (సెప్టెంబర్ 14వ తేదీ) నుంచి ఎస్డీఎస్ టోకెన్ల జారీ నిలిపివేశారు. ఈ నెల 20వ తేదీ వరకు ఇదే పద్ధతి అమలులో ఉంటుంది.

తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి మొదటి బ్రహ్మోత్సవాలకు ఈ రోజు రాత్రి (సెప్టెంబర్ 14వ తేదీ) అంకురార్పణ చేయనున్నారు. 15వ తేదీ ఉదయం ధ్వజారోహణంతో ఉభయ దేవేరులతో కలిసి మలయప్పస్వామివారు పల్లకీపై ఊరేగుతూ దర్శనం ఇవ్వనున్నారు. బ్రహ్మోత్సవం సందర్భంగా యాత్రికుల రద్దీకి తగినట్లుగా టీటీడీ అధికారులు ముందస్తు ఏర్పాట్లతో సన్నద్ధం అయ్యారు.

టైంస్లాట్ టోకెన్ల రద్దు..

తిరుమలలో శ్రీవారి దర్శనానికి టైంస్లాట్ టోకెన్లు తిరుపతిలో జారీ చేస్తారు. బ్రహ్మోత్సవాల రద్దీ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా సోమవారం ఉదయం ( (సెప్టెంబర్ 14వ తేదీ) నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఎస్డీఎస్ టోకెన్లు నిలిపివేసినట్లు టీటీడీ ప్రకటించింది.
తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద రెండు కౌంటర్లు, విష్ణునివాసం, శ్రీనివాసం యాత్రికుల వసతి గృహ సముదాయాల్లో రోజూ ఎస్డీఎస్ టోకెన్లు జారీ చేస్తుంటారు. రద్దీని ఆధారంగా చేసుకుని ఈ మూడు కేంద్రాల్లో 16 వేల నుంచి 26 వేల వరకు టోకెన్లు జారీ చేస్తారు. రద్దీ ఎక్కువగా ఉంటే ఆ సంఖ్యలో మార్పు ఉంటుంది.
తిరుమలలో సర్వదర్శనం కోసం వైకుంఠం2 క్యూ కాంప్లెక్స్ నుంచి సాధారణ యాత్రికుల కంపార్టెమెంట్ల నుంచి శ్రీవారి దర్శనానికి వెళ్లే అవకాశం ఉంటుంది. టోకెన్లు దక్కని యాత్రికులు ఈ మార్గంలోనే వెళ్లాలి.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో..

తిరుమల శ్రీవారిని రోజు 70 నుంచి 80 వేల మంది యాత్రికుల దర్శించుకుంటూ ఉంటారు. బ్రహ్మోత్సవాలు ఒకపక్క, తమిళమాసం (పెరటాసి నెల) కావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి యాత్రికులు తిరుమలకు పోటోత్తడం సహజం. ఈ పరిస్థితుల్లో టైంస్లాట్ టోకెన్ల జారీ నిలిపివేసిన టీటీడీ అధికారులు సర్వదర్శనాలకు మాత్రమే పరిమితం చేశారు.
బ్రహ్మోత్సవాల సందర్భంలో శ్రీవారి మూలమూర్తితో పాటు ఉభయ దేవేరులతో కలిసి ఆలయ మాడవీధుల్లో పల్లకీపై ఊరేగే మలయప్పస్వామి వారిని దర్శించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. దీంతో గ్యాలరీల్లో యాత్రికుల కోసం టీటీడీ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది.

వీఐపీ దర్శనాల రద్దు..

ప్రత్యేక ఉత్సవాలు కావడం వల్ల వీఐపీ సిఫారసు లేఖలను కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. వీఐపీలు, వీవీఐపీలు నేరుగా వస్తే వారికి మాత్రమే ప్రత్యేక దర్శనాలు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ నెల 20వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కావడంతో టైంస్లాట్ టోకోన్లు, వీఐపీ సిఫారసు లేఖలకు తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
Read More
Next Story