'తిరుపతి డెవలప్మెంట్ ట్రస్ట్' కొత్త ఆలోచనకు ఊపిరి
తిరుపతి నగర అభివృద్ధి కోసం TTD 13వ ట్రస్ట్ అవసరంపై వీడియో స్టోరీ
శ్రీవారి దర్శనం కల్పించడంలో తిరుమల, తిరుపతి స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రతిపాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తిరుపతి నగరాభివృద్ధికి టీటీడీ (TTD) ప్రత్యేకంగా ట్రస్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
టీటీడీ ప్రస్తుతం 12 ట్రస్టులకు దాతలు అందించే విరాళాలతోనే నిర్వహిస్తున్నారు.
"తిరుపతి పట్టణాభివృద్ధి కోసం13వ ట్రస్టు ఏర్పాటు చేయడం వల్ల మేలు జరగుతుంది. సంపన్నులైన దాతలు విరాళాలు అందివ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ట్రస్టు ప్రారంభానికి నా వంతుగా రూ. పది లక్షలు టీటీడీకి విరాళంగా అందిస్తా" అని తిరుపతి రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ ప్రతిపాదించారు.
తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి జేబీ. శ్రీనివాస్ ను సమితి ప్రతినిధులతో కన్వీనర్ కుప్పాల గిరిధర్ కలిశారు. తిరుపతి పట్టణం, తిరుమల వాసులకు ప్రాధాన్యత ఇవ్వడంలో ఐదు ప్రధాన ప్రతిపాదనలపై వినతిపత్రం సమర్పించారు.
1. స్థానికులకు ప్రత్యేక గ్యాలరీలు:తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో తిరుమల తిరుపతి స్థానికుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను కేటాయించాలి.
2.రోజువారీ దర్శనం:సంవత్సరం పొడవునా ప్రతిరోజు ఒక గంట పాటు స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శన సౌకర్యం కల్పించాలి.
3.తిరుపతి డెవలప్మెంట్ ట్రస్ట్ (TTD) ఏర్పాటు:తిరుపతి నగర అభివృద్ధి కోసం TTD ఆధ్వర్యంలో 13వ ట్రస్ట్‌గా "తిరుమల తిరుపతి డెవలప్మెంట్ ట్రస్ట్"ను ఏర్పాటు చేయాలి.
4.లోకల్ అడ్వైజరీ కమిటీ (LAC):స్థానిక ఆలయాల నిర్వహణ, సమస్యలపై చర్చించేందుకు స్థానికులతో కూడిన ఒక సలహా మండలిని (Local Advisory Committee) ఏర్పాటు చేయాలి.
5.అడిషనల్ ఈవో క్యాంప్ ఆఫీస్ తరలింపు: తిరుమల కొండపై ఉన్న అడిషనల్ ఈవో (Additional EO) క్యాంప్ ఆఫీస్‌ను తిరుపతికి గానీ లేదా అలిపిరికి గానీ తరలించాలి. దీనివల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధనం ఆదా అవుతుంది. అలాగే భక్తులు, ప్రజలు ముందురోజే కొండపైకి వెళ్లే శ్రమ తప్పి, దరఖాస్తులు సమర్పించడానికి సౌలభ్యంగా ఉంటుంది. అనే అంశాలపై ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు వివరించారు.
"పట్టణ ప్రాంత ప్రజలకు మేలు చేయడమే కాదు. ఇవి మంచి ప్రతిపాదనలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళతా. టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, పాలక మండలి సభ్యులకు వివరిస్తా" అని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కూడా సానుకూలంగా స్పందించారు.
టీటీడీ చిన్న రాష్ట్రం..
తిరుమల శ్రీవారి ఆలయ నిర్వహణ, యాత్రికులకు దర్శనం, వసతికి మాత్రమే టీటీడీ పరిమితం కాలేదు. చిన్న రాష్ట్రానికి సరిపడ విభాగాలతో కూడినదే టీటీడీ.
తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాదు. పాలనా యంత్రాంగం, సేవల నిర్వహణ కోసం సుమారు 25కి పైగా ప్రధాన విభాగాలు (Departments) ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ 5,456 వార్షిక బడ్డెట్ తో కార్యకలాపాలు సాగిస్తోంది. శ్రీవారి హుండీకి యాత్రికుల నుంచి కానుకల రూపంలో లభించే ఆదాయమే ప్రధాన వనరు.
1. ఆలయ నిర్వహణ విభాగం: శ్రీవారి ఆలయం, దర్శనాలు, ఆర్జిత సేవలు, ఉత్సవాలు. టీటీడీ అనుబంధ ఆలయాల నిర్వహణ.
2. రెవెన్యూ, ఆర్థిక విభాగం (Finance & Accounts): హుండీ కానుకలు, విరాళాలు, బడ్జెట్, ఆర్థిక పర్యవేక్షణ.
3. ఇంజినీరింగ్ విభాగం: కట్టడాలు, రోడ్లు, డ్యామ్‌లు, మౌలిక వసతుల నిర్మాణం, మరమ్మతులు.
4. విజిలెన్స్, భద్రతా విభాగం: ఐపీఎస్ అధికారి సారధ్యంలో భద్రతా విభాగం పనిచేస్తుంది. తిరుపతిలోని ఆలయాలు, క్యూలు, భద్రతా వ్యవస్థల పర్యవేక్షణ.
5. అన్నప్రసాదం విభాగం: నిత్య అన్నదాన పథకం ద్వారా వేలాది మంది భక్తులకు ఉచిత భోజన వసతి.
6. ఉత్పత్తి, పోటు విభాగం: శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల తయారీ.
7. రవాణా విభాగం: ఆర్టీసీ బస్సులు, ఉచిత ధర్మ రథాలు, రవాణా వాహనాల నిర్వహణ.
8.సమాచార సాంకేతిక విభాగం: ఆన్లైన్ దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు, కాటేజ్ బుకింగ్స్, యాప్‌లు, డిజిటల్ సేవలు.
9. ఆరోగ్యం, వైద్య విభాగం: తిరుమలలో పారిశుధ్యం, తిరుపతిలో బర్డ్ (BIRRD), స్విమ్స్ (SVIMS) టీటీడీ ఆసుపత్రుల నిర్వహణ.
10. విద్యుత్ విభాగం: తిరుమలగిరులు, విద్యుత్ అలంకరణల పర్యవేక్షణ.
11. ఉద్యానవనం, అటవీ విభాగం:తిరుమల కొండలపై అడవుల సంరక్షణ, ఆలయాల పూల అలంకరణకు తోటల పెంపకం.
12. విద్యా విభాగం: టీటీడీ నిర్వహించే పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు, వేద విశ్వవిద్యాలయం, ఇతర విద్యా సంస్థలు.
13. ధర్మ ప్రచార పరిషత్ (SVBC / HDPP): హిందూ ధర్మ ప్రచారం, ఎస్వీబీసీ (SVBC) భక్తి ఛానెల్ నిర్వహణ,
14. ధార్మిక కార్యక్రమాలు.ప్రాసెస్, మార్కెటింగ్ విభాగం: లడ్డూ తయారీకి సరుకులు, నిత్యావసరాల కొనుగోలు.
15. పబ్లిక్ రిలేషన్స్ (PRO) & రిసెప్షన్ విభాగం: భక్తుల వసతి, ప్రచారం,సమాచార కేంద్రాల నిర్వహణ. ఇవి ప్రధాన శాఖల్లో కొన్ని మాత్రమే.
టీటీడీలో ట్రస్టులు ఎన్ని ఉన్నాయి...?
దాతల నుంచి విరాళాలు సేకరించి, అనేక సంక్షేమ, విద్యా, పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తోంది.
1. శ్రీవేంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్: తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులకు ఉచితంగా రోజూ అన్నప్రసాదం పంపిణీ చేయడానికి ఈ ట్రస్ట్ పనిచేస్తుంది.
2. శ్రీవాణి ట్రస్ట్ (SRIVANI Trust - Sri Venkateswara Alayala Nirmanam Trust): పురాతన ఆలయాల పునర్నిర్మాణం, వెనుకబడిన ప్రాంతాలలో కొత్త శ్రీవేంకటేశ్వర ఆలయాల నిర్మాణానికి నిధులు సమకూరుస్తుంది.
3. శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్ : పేద రోగులకు ప్రాణాపాయ స్థితిలో ఉచితంగా ఖరీదైన వైద్య చికిత్సలు, శస్త్రచికిత్సలు అందించడానికి ఈ ట్రస్ట్ ప్రాణం పోస్తోంది.
4.బర్డ్స్ ట్రస్ట్ (BIRRD Trust - Balaji Institute of Surgery, Research and Rehabilitation for the Disabled): దివ్యాంగులకు, నరాల, ఎముకల సమస్యలతో బాధపడేవారికి ఉచిత వైద్య సేవలు, కృత్రిమ అవయవాల అమరిక కోసం పనిచేస్తుంది.
5. శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్: గోవులను సంరక్షించడం, గోశాలల నిర్వహణ, ఆవుల ఆరోగ్యం, నాటు జాతి ఆవుల అభివృద్ధికి ఈ ట్రస్ట్ బాధ్యత వహిస్తుంది.
6. శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ : వైదిక విద్యను ప్రోత్సహించడం, వేద పాఠశాలల నిర్వహణ మరియు వేద పండితులకు ఆర్థిక సహాయం అందించడానికి ఇది ఏర్పాటైంది.
7. శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్: టీటీడీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లోని పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతి కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం.
8. శ్రీ వేంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్: అనాథ, వికలాంగ పిల్లలకు ఆశ్రయం, విద్య, మెరుగైన భవిష్యత్తును అందించడానికి ఇది పనిచేస్తుంది.
9. శ్రీ బాలాజీ ఆరోగ్యవరప్రసాదిని ట్రస్ట్: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలు, పరిశోధనలకు మద్దతుగా ఈ ట్రస్ట్ నిధులు అందిస్తుంది.
10. శ్రీ వేంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్: చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాచీన ఆలయాలు, నిర్మాణాలు మరియు సంస్కృతి-సాంప్రదాయాలను పరిరక్షించడానికి ఈ ట్రస్ట్ నిధులు వినియోగిస్తుంది.
11. ఎస్వీబీసీ ట్రస్టు: తిరుమల, అనుబంధ ఆలయాల్లో జరిగే కార్యక్రమాలతో శ్రీవారి వైభవాన్ని చాటడంలో కీలకం. దీంతో పాటు మరో ట్రస్టు నిర్వహణకు పూర్తిగా దాతలు అందించే విరాళాలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తారు. ఆ వడ్డీతో మాత్రమే ఈ ట్రస్టులు నిర్వహిస్తారు.
తిరుపతి అభివృద్ధి కోసం..
దేశవిదేశాల నుంచి వచ్చే యాత్రికులతో తిరుపతి పట్టణం నిత్యం రద్దీగా ఉంటుంది. పట్టణం కూడా నాలుగు లక్షల మందితో విస్తరించింది. ఇంకా పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో యాత్రికులకు మరింత ఆహ్లాదం, రవాణా, వసతులు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని తిరుపతి రైల్వే డివిజన్ సాధన సమితి చర్చకు తీసుకుని వచ్చింది. దీనికోసం
"తిరుపతి నగర అభివృద్ధి కోసం TTD 13వ ట్రస్ట్ ఏర్పాటు చేయాలి" అనే డిమాండ్ ను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం పట్టణంలో రోడ్ల అభివృద్ధి, సుందరీకరణ, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి పనులు టీటీడీ నిధులతో చేస్తున్నారు.
"తిరుపతి అభవృద్ధికి ట్రస్టు ఏర్పాటు చేస్తే టీటీడీపై భారం తగ్గుతుంది. ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖులే కాదు. ఎన్ ఆర్ఐల నుంచి విరాళాలు తీసుకోవచ్చు" అని రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ అభిప్రాయపడ్డారు.
తిరుపతి కోసం కేవలం ట్రస్టు ఏర్పాటు చేయడం సాధ్యమా? అనేది సాంకేతికంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు.
"టీటీడీ చట్టాల ప్రకారం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని ట్రస్టు ఏర్పాటు చేసే విచక్షణాధికారం టీటీడీ పాలక మండలికి ఉంటుంది" దీనివల్ల ధార్మిక సంస్థకు ఖర్చు తగ్గడమే కాదు. వనరుల సమీకరణకు సానుకూలంగా ఉంటుంది" అని సీఐటీయూ రాష్ట్ర నేత కందారపు మురళీ అభిప్రాయపడ్డారు.
టీటీడీ ట్రస్టులకు వ్యాపారవర్గాలు, సంపన్నులు, పారిశ్రామికవేత్తలే విరాళాలు ఇస్తున్నారు. ఆ ట్రస్టులకు విరాళాలు ఇవ్వడం వల్ల శ్రీవారి దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదాలు అందించే ప్రివిలేజెస్ ఉన్నాయి. కొత్తగా చర్చకు వచ్చిన తిరుపతి అభివృద్ధి ట్రస్టుపై రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి తీసుకునే నిర్ణయంపై ఆసక్తి ఏర్పడింది.
Next Story

