Tirumala | 10వ తేదీ నుంచి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
ఈ రోజు రూ. 300 టికెట్లు ఆన్ లైన్ లో విడుదల. అక్టోబర్ 11 నుండి 20వ తేది వరకు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు.
అక్టోబర్ 7న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20వ తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అక్టోబర్ 7వ తేది ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల పదో తేదీ నుంచి 20వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ సిఫారసు లేఖలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, డిఫెన్స్ దర్శనాలను రద్దు చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఎల్సీలు, మంత్రుల తోపాటు వీవీఐపీలు కూడా లేఖలు జారీ చేస్తుంటారు. రోజుకు ఒక ప్రజాప్రతినిధి జారీ చేసే మొదట వచ్చిన వారికి మాత్రమే ఓ లేఖను శ్రీవారి వీఐపీ దర్శనానికి అనుమతించి, టికెట్లు జారీ చేయడం ఆనవాయితీగా పాటిస్తున్నారు.
"తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నేరుగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా, సిఫారసు లేఖలు అనుమతించడం లేదు" అని టీటీడీ ఈఓ ఎం. రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి స్పష్టం చేసినట్లు టీటీడీపీ చీఫ్ పీఆర్ఓ తలారి రవి ప్రకటన జారీ చేశారు.
ఈ నెల 11 వ తేదీ నుంచి 20వ తేది వరకు తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. దీంతోపాటు పెరటాసి మాసం (తమిళమాసం) చివరి వారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ విషయాలు పరిగణలోకి తీసుకుని పది రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, డిఫెన్స్ దర్శనాలను టీటీడీ రద్దు చేశామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి అక్టోబర్ 10వ తేది నుండి 19వ తేది వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని కూడా వివరించారు.

