ఏడు కొండల వాడికి 7 కోట్ల ఆదాయం!
వరుస సెలవులతో పెరిగిన రద్దీ... సర్వదర్శనానికి 20 గంటల సమయం.
తిరుమల శ్రీవారి దర్శనానికి యాత్రికులు పోటెత్తారు. వారంతం తోపాటు వరుస సెలవుల కారణంగా భారీగా యాత్రికులు తరలి వచ్చారు. దీంతో ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. దీనికోసం శనివారం సిఫారసు లేఖలు తీసుకోవడం లేదని టీటీడీ అధికారికంగా ప్రకటించింది.
తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. హుండీ ఆదాయం 6 .94 కోట్ల రూపాయలు లభించింది. సాధారణంగా నాలుగు నుంచి 4.5 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. కానీ, మూడోసారి రికార్డు స్థాయిలో ఇంతటి ఆదాయం రావడం వెనుక అజ్ణాత యాత్రికులు సమర్పించిన కానుకలే కారణమని టీటీడీ అధికార వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. 2025 ఇదే రోజు శ్రీవారి హుండీకి 3 . 56 కోట్లు, 2024 ఇదే తేదీ 3. 95 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు పరకామణి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
కొండ నిండా జనం
తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా యాత్రికులు తరలివచ్చారు. దీంతో దాదాపు తొమ్మిది కిలోమీటర్ల దూరం వరకు శిలాతోరణం వద్ద క్యూలోకి ప్రవేశించే విధంగా టీటీడీ అధికారులను యాత్రికులను క్రమబద్ధీకరిస్తున్నారు. వైకుంఠం రెండో క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు యాత్రికులతో నిండిపోయాయి. దీంతో సర్వదర్శనానికి 15 నుంచి ౨౦ గంటలు పట్టవచ్చని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి దర్శనానికి యాత్రికులు పోటెత్తిన నేపథ్యంలో ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. శనివారం సిఫారసు లేఖలు తీసుకోవడం లేదని ప్రకటించారు. 12వ తేదీ నుంచి వరుస సెలవులు కావడం వల్ల ఈ రద్దీ ఏర్పడింది. దీంతో ఆదివారం కూడా వీఐపీలకు కేటాయించే సమయాన్ని సాధారణ యాత్రికులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు.

