అనంతపురం: నామినేషన్ వేయనివ్వండయ్యా... ఎస్ఐ కాళ్లు పట్టుకున్న అభ్యర్థి
గుత్తిలో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి రంగస్వామి అరణ్య రోదన
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలులో అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో అనంతపురం జిల్టా గుత్తి మున్సిపాలిటీలో దళిత సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్ అభ్యర్థి రంగస్వామి ఏకంగా ఎస్ఐ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడిన సంఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను టీడీపీ కూటమితో పాటు వైసీపీ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తమ అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించుకోవడానికి టీడీపీ కూటమి కూడా చాలా చోట్ల ప్రతిఘటన ఎదుర్కొంది. ప్రతిపక్ష వైసీపీ శ్రేణులు తీవ్ర నిర్బంధానికి గురైనట్లు రాయలసీమలో చోటుచేసుకున్న ఘటనలే నిదర్శనం.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సందర్భంలో ఇదే తరహా వాతావరణం కనిపించింది. నామినేషన్ దాఖలు కేంద్రాల వద్ద టీడీపీ తోపాటు జనసేన మద్దతుదారులు అప్పటి వైసీపీ నేతలు అడ్డున్న సంఘటనలు కూడా రాజకీయంగా వేడి పెంచాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గత స్థానిక ఎన్నికల నాటి వాతావరణం పునరావృతం అయినట్లే కనిపిస్తోంది.
అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్ అభ్యర్థులను అధికార పార్టీ నేతల దరిదాపుల్లోకి రానివ్వలేదని వైసీపీ ఆరోపించింది. ఈ మున్సిపాలిటీలో పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలతో వచ్చిన దళిత సామాజికవర్గానికి చెందిన రంగస్వామిని అడ్డుకున్నారు. ఆ సమయంలో రంగస్వామి అక్కడ విధుల్లో ఉన్న ఎస్ఐ కాళ్లు పట్టుకున్న ఘటన,
"నన్ను నామినేషన్ వేయించడానికి రక్షణ కల్పించండి" అని రంగస్వామి ఆక్రందనలు మిన్నంటాయి.
"దళితుడికి ఇంత అన్యాయం చేస్తారా?" అని కూడా పాలకులను ఆయన సూటిగా నిలదీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది.

