రికార్డు స్థాయిలో 90 వేల మంది శ్రీవారిని దర్శించుకున్న యాత్రికులు
తిరుమలలో రద్దీ సాధారణం. సర్వదర్శనానికి పది గంటలు
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. సోమవారం నాటికి తిరుమలలో రద్దీ సాధారణ స్థితిలో ఉంది. టైంస్లాట్ టోకెన్లు లేని యాత్రికులకు ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతుందని వెల్లడించారు. ఆదివారం రోజు సాధారణ యాత్రికుల దర్శనానికి పెద్దపీట వేసినట్లు టీటీడీ ఈఓ ముద్దాడి రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి చెప్పారు. దీంతో వారంతంలో కూడా 90, 292 మంది యాత్రికులకు శ్రీవారి దర్శనం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.
తిరుమలలో ఇటీవలి కాలంలో ఇదో రికార్డు అని కూడా అధికారులు చెప్పారు. తిరుమలలో శని, ఆదివారాల్లో రద్తీ ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సాధారణ యాత్రికులు తిరుమలకు పోటెత్తుతున్నారు. వారి సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అందరికీ దర్శనం కల్పించాలనే లక్ష్యంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెప్పారు.
తిరుమలలో సాధారణ యాత్రికులకు ఇబ్బంది లేకుండా ముందస్తు కార్యాచరణ అమలు చేయడం వల్ల ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించడం సాధ్యమైందని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి చెబుతున్నారు.
ఆదివారం మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యాత్రికుల వల్ల శ్రీవారి హుండీకి 4.36 కోట్ల రూపాయాల ఆదాయం లభించింది. 4. 36 లక్షల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు యాత్రికులు కొనుగోలు చేశారు. తిరుమలలోని శ్రీతరిగొండ వెంగమాంట అన్నదాన సత్రంలో 2. 74 లక్షల మందికి అన్నప్రసాదాలు వడ్డించారు.

