Courtesy AI
x

తిరుపతి విమానాశ్రయానికి 'ఈ-వీసా' స్టేటస్ వల్ల ఎవరికి మేలు?

శ్రీవారి ఎన్ఆర్ఐ యాత్రికులు, శ్రీసిటీ బిజినెస్ దిగ్గజాలతో పెరగనున్న ఆదాయం.


Click the Play button to hear this message in audio format

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు విమానాలు ఎగరడానికి తొలి అడుగు పడింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని 'బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్' ద్వారా తిరుపతి విమానాశ్రయానికి అధికారిక e-Visa ఎంట్రీ పాయింట్ హోదా కల్పిస్తూ ఈ నెల 11 వ తేదీ నోటిఫై చేసింది. దీంతో భారత ఈ వీసా ఉన్న విదేశీయులు దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉన్న అధికారిక విమానాశ్రయాల జాబితాలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రాయానికి చోెటు దక్కింది. తద్వారా రాయలసీమ వాసులు చిరకాల కోరికకు రెక్కలు విచ్చుకున్నాయి. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ వల్ల తిరుపతి తోపాటు భోపాల్ విమానాశ్రాయం కూడా అదే జాబితాలో చేరింది.

ఈ ఒక్క నిర్ణయం వల్ల మొదట తిరుమల శ్రీవారి యాత్రికులకు, NRIలకు ఎలాంటి మేలు చేస్తుంది. ప్రయాణికులకు ఎలాంటి కష్టాలు దూరం అవుతాయి. పారిశ్రామిక దిగ్గజాల కేంద్రీకృత శ్రీసిటీ సెజ్ (Sri City) కు ఈ-వీసా గేమ్‌ఛేంజర్‌గా మారబోతోంది. తిరుపతి నుంచి అంతర్జాతీయ విమానాలు ఎగరడానికి అవకాశం కలిగింది.

కేంద్ర నిర్ణయంపై తిరుపతి వైసీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి ఏమన్నారంటే..

"తిరుపతి విమానాశ్రయాన్ని విదేశీ ప్రయాణికులకు అందుబాటులో తీసుకురావడానికి మొదటి అడుగు వేసింది. అంతర్జాతీయ విమానాలు నడపడానికి ఆ సంస్థలు ముందుకు రావాలి" అని ఎంపీ గురుమూర్తి వ్యాఖ్యానించారు. కాగా,
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభ నేపథ్యంలో 2017లో ఆ హోదా దక్కించుకున్న తిరుపతి విమానాశ్రయం వ్యవహారం చర్చకు వచ్చింది. ఈ ఆరోపణలకు తెర దించుతూ, ఈ వీసా ఎంట్రీ పాయింట్ ఇవ్వడం ఆసక్తికర పరిణామం. దీనిల్ల ఎన్ ఆర్ఐలు, శ్రీవారి యాత్రికుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.

కేంద్ర హెంశాఖ జారీ చేసిన నోెటిఫికేషన్ వల్ల దేశంలో ఈ వీసాతో ప్రవేశించదగిన పోర్టుల సంఖ్య 88కి చేరింది. అందులో 37 విమానాశ్రయాలు ఉంటే, 38 ఓడరేవులు, 13 ల్యాండ్ సరిహద్దు పోర్టులు ఉన్నాయి.

"కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం ప్రపంచవ్యాప్తంగా ఉన్న NRIలు, విదేశీ భక్తులు ఎంతో ఆరాటపడుతుంటారు! కానీ ఇప్పటివరకు విదేశాల నుంచి తిరుపతి రావాలంటే చెన్నై, బెంగళూరు లేదా హైదరాబాద్‌లో దిగి గంటల తరబడి ప్రయాణించాల్సి వచ్చేది. కానీ, ఇకపై ఆ కష్టాలకు స్వస్తి పడే సమయం వచ్చింది!
తిరుపతి నుంచి దేశంలో ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ వంటి విమానయాన సంస్థలతో సర్వీసులు ప్రారంభించే అంశంలో చర్చలు సాగుతున్నాయని తిరుపతి ఎంపీ గురుమూర్తి వెల్లడించారు

తిరుపతికి అంతర్జాతీయ విమానాలు నడపడంలో నష్టాలు అధిగమించడంలో సర్వీసులు నడపడానికి విమానయాన సంస్థలు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ సాయం అడగడం ప్రతిబంధకంగా మారింది అని ఎంపీ గురుమూర్తి చెప్పారు. ఇదిలా వుంటే,

తిరుపతికి ఈ వీసా కేంద్రం ఇవ్వడం వల్ల ఎన్ఐఆర్ యాత్రికులకు మేలు ఎలా జరగుతుందో చూద్దాం..

విమానాశ్రయంలో శ్రీవాణి కౌంటర్
తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయ కౌంటర్ ద్వారా రోజుకు 200 టోకెన్లు కేటాయిస్తారు. రూ. 10,500 చెల్లిస్తే. శ్రీవాణి ట్రస్ట్ విరాళం: ₹10,000, విఐపి బ్రేక్ దర్శనం టికెట్: రూ. 500.
అవసరమైన పత్రాలు:ఒరిజినల్ ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, వాటి జిరాక్స్ కాపీలు. విమాన ప్రయాణానికి సంబంధించిన Boarding Pass (విమానాశ్రయ కౌంటర్‌లో టికెట్ పొందడానికి బోర్డింగ్ పాస్ తప్పనిసరి)
దర్శన ప్రాధాన్యత:
ఈ టికెట్ ద్వారా మరుసటి రోజు ఉదయం విఐపి బ్రేక్ దర్శనం (వీఐపీ నైవేద్య సమయం/ఆరంభ బ్రేక్) లభిస్తుంది.

తిరుమలలో ఎన్ ఆర్ ఐ (NRI)లకు ప్రత్యేక సదుపాయాలు

భారతదేశానికి విదేశాల నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐలు, OCI/PIO కార్డ్ హోల్డర్లు, విదేశీయులకు తిరుమలలో ప్రత్యేక దర్శన సదుపాయం కల్పిస్తారు.
ప్రవేశ మార్గం: సుపథం ప్రవేశ మార్గం (వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సమీపంలో/ATC సర్కిల్)
టికెట్ రుసుం: రూ. 300 (ప్రత్యేక ప్రవేశ దర్శనం
సమయాలు:
సాధారణంగా మధ్యాహ్నం 12:00 నుంచి సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అనుమతిస్తారు. అడ్వాన్స్ బుకింగ్ అవసరం లేదు: దీనికి ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ అవసరం లేదు. నేరుగా సుపథం కౌంటర్‌ వద్దనే టికెట్ ఇస్తారు.
ఎన్‌ఆర్‌ఐ దర్శనానికి కావలసిన పత్రాలు:
భారత్‌కు వచ్చిన గడువు, ఇండియాలో ల్యాండ్ అయిన తేదీ నుంచి 30 రోజులలోపు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది (పాస్‌పోర్ట్‌లోని ఇమ్మిగ్రేషన్ స్టాంప్ ఆధారంగా తనిఖీ చేస్తారు).
పత్రాలు: ఒరిజినల్ పాస్‌పోర్ట్, వీసా / OCI కార్డ్.పాస్‌పోర్ట్, వీసా, ఇమ్మిగ్రేషన్ ఎంట్రీ స్టాంప్ జిరాక్స్ కాపీలు.
ప్రాధాన్యత, నియమాలు: కుటుంబ సభ్యులు/బంధువులు: ఎన్‌ఆర్‌ఐలతో పాటు వారి జీవిత భాగస్వామి (Spouse), 12 సంవత్సరాల లోపు పిల్లలు మాత్రమే అనుమతిస్తారు. (12 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత ప్రవేశం).ఎన్‌ఆర్‌ఐ కాని ఇతర బంధువులు లేదా స్నేహితులకు ఈ క్యూలో ప్రవేశం ఉండదు.
డ్రెస్ కోడ్ (Dress Code):పురుషులు: ధోతి,పంచె, కుర్తా లేదా ఫార్మల్ షర్ట్, ట్రౌజర్.
మహిళలు:చీర, సల్వార్ కమీజ్ (దుపట్టాతో) లేదా లంగా ఓణి. (టీ-షర్టులు, జీన్స్ వంటి పాశ్చాత్య దుస్తులు అనుమతించరు).
ఎలక్ట్రానిక్ వస్తువులు: మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి అనుమతించరు.

ఈ-వీసా (e-Visa) అంటే..?

అసలు ఈ-వీసా (e-Visa) అంటే ఏమిటి? ఎంబసీల చుట్టూ తిరిగే పనిలేకుండా, విదేశీ పౌరులు తమ ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్ ద్వారా పొందే ఎలక్ట్రానిక్ వీసాయే ఈ-వీసా! పర్యాటకం, వ్యాపార పర్యటనలు, వైద్య సేవలు, కాన్ఫరెన్స్‌ల కోసం వచ్చే విదేశీయులకు భారత ప్రభుత్వం ఈ సదుపాయం కల్పిస్తుందంటే..
భారత ప్రభుత్వ అధికారిక e-Visa పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో వివరాలు పూరించి, ఫీజు చెల్లిస్తే.. ఈ-మెయిల్‌కు 'Electronic Travel Authorization (ETA)' వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకెళ్తే చాలు, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే పాస్‌పోర్ట్‌పై సులభంగా స్టాంప్ వేస్తారు."

తిరుపతి ఎయిర్‌పోర్టులో మౌలిక వసతులు

1968లో రేణిగుంట వద్ద ప్రారంభమైన 56 ఏళ్ల ప్రాచీన విమానాశ్రయానికి 2017లోనే అంతర్జాతీయ హోదా దక్కింది. విశాఖ, విజయవాడలతో పోలిస్తే బోయింగ్ 777 వంటి భారీ విమానాలు (Wide-body aircrafts / Code-D, Code-E) కూడా సులభంగా ల్యాండ్ అయ్యేలా ఇక్కడి రన్‌వేను విస్తరించారు. రాత్రివేళ ల్యాండింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం తిరుపతి గరుడ టెర్మినల్‌లో ఇమిగ్రేషన్ కౌంటర్లు, కస్టమ్స్ చెకింగ్, ఫారిన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) విభాగాలను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది."

డైరెక్ట్ విమానాలు లేకున్నా..

"చాలామందికి ఉన్న సందేహం.. తిరుపతి నుంచి నేరుగా విదేశాలకు డైరెక్ట్ విమానాలు (Direct International Flights) లేనప్పుడు ఈ-వీసా వల్ల ఉపయోగామేంటి? అనేది మెదళ్లను తొలచే ప్రశ్న.
ఇక్కడే ఉందండి అసలు మేజిక్! 'త్రూ చెకిన్' (Through Check-in / Single Ticket) విధానం ద్వారా ప్రయాణికులు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లోనే బోర్డింగ్ పాస్ తీసుకుని, ఇమిగ్రేషన్, లగేజ్ చెకిన్ ఇక్కడే పూర్తి చేసుకోవచ్చు. దీనివల్ల ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి ఎయిర్‌పోర్ట్‌లలో దిగినప్పుడు ప్రయాణికులు:
1) లగేజ్‌ మళ్లీ కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
2) మధ్యంతర ఎయిర్‌పోర్ట్‌లలో ఇమిగ్రేషన్ క్యూ లైన్లలో మళ్లీ నిలబడక్కర్లేదు.
3) నేరుగా ఇంటర్నేషనల్ టెర్మినల్‌లోని సెక్యూరిటీ ఏరియాకు వెళ్లిపోవచ్చు."

శ్రీసిటీ పారిశ్రామికవేత్తలకు భారీ ప్రయోజనం

"ఈ-వీసా" హోదా వల్ల కేవలం భక్తులకే కాదు.. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి ద్వారం అయిన శ్రీసిటీ (Sri City) కి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది! 8 వేలకు పైగా ఎకరాల్లో విస్తరించి, 31 దేశాలకు చెందిన 260కి పైగా పరిశ్రమలతో (డైకిన్, ఎల్‌జీ, ఇసుజు, ఆల్స్టమ్ వంటి దిగ్గజాలు) రూ.53 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిన శ్రీసిటీకి తిరుపతి ఎయిర్‌పోర్ట్ కేవలం గంటన్నర దూరంలోనే ఉంది. విదేశీ పెట్టుబడిదారులు, VIP ప్రతినిధులు చార్టర్డ్ ఫ్లైట్లలో నేరుగా తిరుపతి వచ్చి ఇమిగ్రేషన్ పూర్తి చేసుకోవచ్చు.
అంతేకాకుండా, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి కువైట్, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలకు వెళ్లిన లక్షలాది మంది తెలుగు కార్మికులకు, ప్రవాసాంధ్రులకు కనెక్టింగ్ సర్వీసుల ద్వారా ప్రయాణ సమయం, శ్రమ భారీగా ఆదా అవుతాయి."

నేరుగా విదేశీ విమానాలు..

"ముఖ్యంగా, ఏ ఎయిర్‌పోర్ట్‌కైనా విదేశాల నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ రావాలంటే ముందుగా 'ఈ-వీసా & ఇమిగ్రేషన్' అనుమతులుండాలి. కేంద్రం ఈ అడ్డంకిని తొలగించడంతో, భవిష్యత్తులో ఎమిరేట్స్, ఎయిర్ ఇండియా వంటి అంతర్జాతీయ సంస్థలు తిరుపతి నుంచి సర్వీసులు ప్రారంభించడానికి ప్రధాన పునాది పడింది.
ఇప్పటికే నెలకు 65 వేల నుంచి 75 వేల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేస్తూ, రూ.20 నుండి 30 కోట్ల వార్షిక ఆదాయాన్ని పొందుతున్న తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు.. భవిష్యత్తులో విదేశీ విమానాలు పెరిగితే టీటీడీకి, స్థానిక పర్యాటకరంగానికి ఆదాయం పెరగడమే కాకుండా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి."
తిరుపతి విమానాశ్రయానికి రోజుకు ఒకటి లేదా రెండు అంతర్జాతీయ విమానాలు వచ్చాని సరే. హ్యండిల్ చేయగలిగిన సామర్థ్యం ఉందని ఏర్ పోర్టు డైరెక్టర్ భూమినాథన్ చెబుతున్నారు. ఎన్ఆర్ఐ ల ప్రయాణానికి చెకింగ్, ఇమిగ్రేషన్ తోపాటు మిగతా లాంఛనాలు పూర్తి చేయడానికి సరిపడ సిబ్బంది ఉన్నారనేది ఆయన చెప్పిన మాట

ఆధ్యాత్మిక రాజధానికి ప్రాధాన్యం..

తిరుపతి విమానాశ్రయానికి ఈ-వీసా గుర్తింపు రావడం అనేది ఆధ్యాత్మిక రాజధానికి దక్కిన మైలురాయి. భవిష్యత్తులో అనడం కంటే, సాధ్యమైనంత త్వరలోనే విదేశీ విమానాలు ల్యాండింగ్ కావడానికి మార్గం ఏర్పడిందని , దీనికి గల్ఫ్, యూఏఈ తోపాటు మిగతా దేశాల్లో భారతీయులు అధికంగా ఉన్న దేశాల్లోని విమానయాన సంస్థలతో భారత ప్రభుత్వం దైపాక్షి చర్చల ద్వారా త్వరలోనే అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభానికి మార్గం సుగుమం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీ భక్తుల సంఖ్య పెరగడం వల్ల టీటీడీకి అదేవిధంగా విమానయాన శాఖకు తిరుపతి నుంచి ఆదాయం మరింత రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు.
Read More
Next Story