ప్రజల ప్రాణాలకు ముప్పు... రైతుల ఆశలు ఆవిరి...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరువు తాండవిస్తోంది. వర్షాభావం రైతును కుంగదీసింది.
ఏపీ సమస్యల పరిష్కారానికి కేంద్ర సాయం…
ఢిల్లీలో సీఎం చంద్రబాబు భేటీలు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రులతో సన్నిహిత చర్చలు జరుపుతున్న తెలుగుదేశం ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలుసుకోనున్నారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితి, అభివృద్ధి అవసరాలను నివేదించి సహాయం కోరనున్నారు.
మంగళవారం కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, నిర్మలా సీతారామన్, రాజీవ్ రంజన్ సింగ్‌లతో ఏపీ మంత్రులు చర్చలు జరిపారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి, లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బస్తీపాటి నాగరాజు, బీద మస్తాన్ రావు తదితరులు భాగస్వామ్యం అయ్యారు.
రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కేంద్ర సహాయం, పథకాల అమలులో సమన్వయం ఈ చర్చల్లో ప్రధానాంశమైంది. ఆక్వా, పొగాకు రంగాల అభివృద్ధి, రైతులు-మత్స్యకారుల సంక్షేమం, ఆక్వా రైతుల ఫీడ్ ధరల సమస్య, సోయాబీన్ దిగుమతి అనుమతులు, జీఎస్టీ తగ్గింపు వంటి అంశాలపై త్వరిత నిర్ణయాలు ఆశిస్తున్నారు. ఇవి కేంద్ర-రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలకు నిదర్శనమని అధికారులు తెలిపారు.
ఇంతకు ముందు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను కింజరాపు రామ్మోహన్ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.
కోవిడ్ నియంత్రణకు ఏపీలో సరికొత్త ఏర్పాట్లు
17 బోధనా ఆసుపత్రుల్లో 255 ప్రత్యేక పడకలు సిద్ధం
కోవిడ్ నిరోధక చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 17 బోధనా ఆసుపత్రుల్లో మొత్తం 255 ప్రత్యేక కోవిడ్ పడకలను సిద్ధం చేశారు. సెకండరీ ఆసుపత్రుల్లో కూడా అవసరమైతే వినియోగించేందుకు ప్రత్యేక పడకలు కేటాయించే ఏర్పాట్లు పూర్తి చేశారు.
బోధనా ఆసుపత్రుల్లో 6,77,936 ట్రిపుల్ లేయర్ మాస్కులు, కేంద్ర ఔషధ నిల్వ కేంద్రాల్లో మరో 5.26 లక్షల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. అదనంగా 58,790 ఎన్-95 మాస్కులు, 4,436 పీపీఈ కిట్లు, 2,572 శానిటైజర్లు సిద్ధంగా ఉంచారు. కోవిడ్ చికిత్సకు అవసరమైన యాంటీబయాటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్ తదితర మందుల నిల్వలు కూడా తగిన స్థాయిలో ఉన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
రెమిడిసివిర్ ఇంజెక్షన్లు, టెస్టింగ్ కిట్లు, శానిటైజర్లు, అత్యవసర సామగ్రిని వెంటనే కొనుగోలు చేసేందుకు ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు లోకల్ పర్చేజ్ అధికారాలు కల్పిస్తూ డీఎంఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అత్యవసర పరిస్థితుల్లో స్పందనను మరింత వేగవంతం చేస్తుంది.
ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 51,700 ఆర్‌ఎన్‌ఏ ఎక్స్‌ట్రాక్షన్ కిట్లు, 27,552 ఆర్టీపీసీఆర్ కిట్లు, పీసీఆర్ టిప్స్, ఫిల్టర్ టిప్స్, మైక్రో ట్యూబ్స్, నైట్రైల్ గ్లౌవ్స్ కొనుగోళ్లకు ఏపీఎంఎస్‌ఐడీసీ ఆర్డర్లు జారీ చేసింది. ప్రతి ఆసుపత్రికి 50 చొప్పున రెమిడిసివిర్ ఇంజెక్షన్లు అందించే చర్యలు చేపట్టింది.
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ఏపీ స్వయం ఉత్పత్తులకు ప్రత్యేక స్టాల్
ఆంధ్రప్రదేశ్‌లోని స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలు తయారు చేసే 'స్వయం' (SWAYAM) బ్రాండ్ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక స్టాల్ కేటాయించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి మంగళవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును, జీఎంఆర్ విమానాశ్రయ యాజమాన్యాన్ని కలిసి రిటైల్ స్టాల్ కేటాయింపు అంశంపై చర్చించారు. ఇద్దరూ స్టాల్ కేటాయింపుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

