స్పీకర్ ఏం చేయబోతున్నారు? అప్పీలా - అనర్హతవేటా?
x

స్పీకర్ ఏం చేయబోతున్నారు? అప్పీలా - అనర్హతవేటా?

గత పది సంవత్సరాల కాలంలో చాలా పార్టీలను విలీనం చేసుకుని రాజకీయాలను భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్… ఫిరాయింపులపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కడియం వ్యాఖ్యానించారు.


ఇవాళ తెలంగాణ అంతటా చర్చనీయాంశం ఇదే. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌లపై అనర్హత వేటు వేయాలంటూ కౌషిక్ రెడ్డి తదితరులు వేసిన పిటిషన్‌పై స్పందిస్తూ ఈ విషయంపై స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు, ఎప్పటిలోపు విచారణ చేస్తారనేది నాలుగు వారాలలోగా తెలపాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అప్పటికీ ప్రకటన రాకపోతే తామే సుమోటోగా విచారణ చేపడతామని కోర్ట్ స్పష్టం చేసింది. దీనిపై బీఆర్ఎస్ శిబిరంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్, హరీష్ రావు తదితరులు కోర్ట్ ఆదేశాలను స్వాగతించారు.

హైకోర్ట్ ఆదేశాలతో తెలంగాణ రాజకీయం రసకందాయంలో పడింది. కోర్ట్ ఆదేశాలపై స్పీకర్ అప్పీల్‌కు వెళతారా, లేదంటే ఆ ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిఫై చేసి ఉపఎన్నికలకు మార్గం సుగమం చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యింది మొత్తం పదిమంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు వీరి రాజకీయ భవిష్యత్తు కూడా స్పీకర్ నిర్ణయంతో ముడిపడి ఉంది.

ఆ ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒకరైన కడియం శ్రీహరి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, హైకోర్ట్ ఆదేశాలు తుది తీర్పు ఏమీ కాదని, దీనిని తుది తీర్పుగా భావించి ఉపఎన్నికలు వస్తాయని కొన్ని పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయని, కానీ పైన ఇంకా చాలా కోర్టులు ఉన్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని అన్నారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డబుల్ బెంచ్‌కు వెళ్ళవచ్చు, సుప్రీమ్ కోర్టుకు వెళ్ళవచ్చు, ఇంకా చాలా అవకాశాలు ఉంటాయని చెప్పారు. హై కోర్ట్ ఆదేశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో చాలా పార్టీలను విలీనం చేసుకుని రాజకీయాలను భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ పార్టీ… ఫిరాయింపులపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని శ్రీహరి వ్యాఖ్యానించారు. ఈ విషయంపై వివిధ కోర్టులు వివిధ రకాలుగా తీర్పులు ఇస్తున్నాయని, సుప్రీమ్ కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పుడే అది రాజ్యాంగబద్ధంగా అమలవుతుందని అన్నారు. హైకోర్ట్ ఆదేశాలపై తాను వ్యక్తిగతంగా పోరాటం చేస్తానని కడియం చెప్పారు.

Read More
Next Story