x

మెగా డీఎస్సీ చూట్టూ మారుతున్న రాజకీయం

వామపక్షాల భిన్నదారులు. వైసీపీతో గళం కలిపిన సీపీఐ. మేము కలవం అంటున్న సీపీఎం


టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీపై వైసీపీ పోరాటం రూపు మారే అవకాశం కనిపిస్తోంది. సీపీఐ కూడా గొంతు కలపడమే ఇందుకు నిదర్శనం. తమ ప్రతిభను శంకించే విధంగా అసత్య ప్రచారం చేయడం తగ్గించుకోకుంటే, నిరసనలు తీవ్రం తరం చేస్తామని డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన టీచర్లు వైసీపీకి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

"మీరు అధికారంలో ఉండగా డీఎస్సీ నిర్వహించి ఉంటే, మా ప్రతిభ నిరూపించుకునే వాళ్లం" అని హితవు పలుకుతూనే డీఎస్సీ నిర్వహణలో వైసీపీ నిర్లక్ష్యం చేసిందనే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
"మెగా డీఎస్సీ పారదర్శకంగా నిర్వహించాం. ఇదే కాదు. మీరు (వైసీపీ) అధికారంలో ఉండగా గ్రూప్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ, లిక్కర్ స్కాంపై చర్చకు సిద్ధమా?" అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ధీటుగానే సవాల్ విసిరారు. ఈ పరిస్థితుల్లో
మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ సాగిస్తున్న పోరాటానికి సీపీఐ జత కలవడం అనేది ప్రత్యేకత సంతరించుకుంది.
వైసీపీ, సీపీఐ పోరాటాలు కూటమి పీఠం కదిలిస్తాయా? అనేది చర్చకు ఆస్కారం కల్పించింది.

సీజేపీ ప్రేరేపిత పోరాటమే కదా..

భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల నేథ్యంలో యువత భావోద్వేగంతో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఊపిరి పోసుకుంది. ఆ పార్టీ వ్యూహకర్త నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై అభిజిత్ దీప్కే పోరు సాగించడం, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన పరిణామాలు దేశంలో ఆలోచనలు రేకెత్తించాయి. ప్రపంచ వ్యాపితంగా భారతీయ యువతను ఆకర్షించింది. ఇదే సమయంలో రోజుల పాటు సాగిన ఉద్యమంలో నీట్ బాధిత, విద్యార్థి, యువజన కాక్రోచ్ లు లాఠీల కాఠిన్యాన్ని రుచి చూశారు. కొందరు మరణించారు. అయితే,
ఈ ఉద్యమం, లాఠీఛార్జి, విద్యార్థి, యువజనుల మరణాలపై వైసీపీ స్పందించిన దాఖలాలు లేవు. సీపీఐ, అనుబంధ సంఘాలు ప్రకటనలతో చేతులు దులుపుకుంది. ఈ సంఘటనలకు మందే రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించింది.

డీఎస్సీ కథ ఇదీ...

టీడీపీ కూటమి ఏర్పడిన తరువాత 2024 జూన్ 12వ తేదీ మెగా డీఎస్సీ ఫైలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తొలి సంతకం చేశారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం 2025 ఏప్రిల్ 20వ తేదీ షెడ్యూల్ విడుదల చేయడంతో 3,35401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారికి జూన్ ఆరు నుంచి జూలై ఆరో తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఆగస్టు 13వ తేదీ సవరించిన టెట్ స్కోర్ తో డీఎస్సీ స్కోరు కార్డులు విడుదల చేశారు. సెప్టెంబర్ 19వ తేదీ ముందుగా ముహూర్తం సమయానికి వాతావరణం అనుకూలించని స్థితిలో25 తేదీ అర్హత సాధించిన టీచర్లను నియమిస్తూ, ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో ఫస్ట్ ర్యాంకర్ పేరు తొలగించిన వ్యవహారం వివాదంగా మారి, రాజకీయ ఆరోపణలకు ఆస్కారం కల్పించింది. ఢిల్లీ జన్ జీ ఉద్యమం తరువాత ఏపీలో కూడా వైసీపీ మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ కోరుతూ దశలవారి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో..
"పోస్టులు ఇవ్వడానికి నగదు చేతులు మారింది. అవినీతి పెచ్చుమీరింది" అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో డీఎస్సీ వివాదం కావడంతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు మండి పడుతున్నారు.

రాజకీయ మలుపు తిప్పిన ర్యాంక్

ఫస్ట్ ర్యాంకర్ పేరును తొలగించడంతో మొదలైన వివాదం మొదలై రాజకీయంగా మలుపు తిరిగింది. దీంతో వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు మండి పడుతున్నారు. డీఎస్సీ ఫలితాల్లో కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కొత్తపేటకు చెందిన పీ. నవీన్ సోషల్ స్టడీస్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించని మొదటి జాబితాలో ప్రకటించడం, వారం తరువాత వెలువడిన జాబితాలో ఆ పేరు లేకపోవడం వివాదానికి దారితీసింది.

వైసీపీతో గళం కలిపిన సీపీఐ

టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని నిరసనలు సాగిస్తున్న వైసీపీకి సీపీఐ కూడా గళం కలపడం అనేది చర్చకు తెర తీసింది.
ఢిల్లీ నీట్ పోరాటంలో నోరు మెదపని వైసీపీతో సీపీఐ కలవడంపై సీపీఎం నేత కందారపు మురళి తీవ్రంగా స్పందించారు.
"ఢిల్లీ పోరాటంలో మా అగ్రనేతలు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ కీలకంగా వ్యవహరించింది. ఆ పోరాటంపై స్పందించని వైసీపీ, ఇప్పుడు జెన్ జీలుగా ప్రకటించుకోవడం విడ్డూరం. అలాంటి పార్టీతో కలిసే ప్రసక్తే లేదు" అని కందారపు మురళీ ఫెడరల్ ప్రతినిధికి స్పష్టం చేశారు.
తమిళనాడు ప్రభుత్వం మొదట్లో నీట్‌ను వ్యతిరేకిస్తే, అధికారంలో ఉన్నప్పుడు సమర్థించిన వైసీపీ.. ఇప్పుడు 'కాక్రోచ్' స్ఫూర్తి అనడం హాస్యాస్పదంగా మారింది.
మరోవైపు తమ ప్రతిభను కించపరుస్తున్నారంటూ మడకశిరలో ఉద్యోగాలు సాధించిన మెగా డీఎస్సీ అభ్యర్థులు రోడ్లెక్కి వైసీపీని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
రాష్ట్రంలో వైసీపీ డీఎస్సీపై విచారణకు సాగిస్తున్న పోరాటానికి సీపీఐ ప్రత్యక్ష్యంగా రంగంలోకి దిగడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు నిరసనలకు దిగిన వ్యవహారంతో ఈ పోరు ఏ మలుపు తిరుగుతుందనేది వేచి చూడాలి.
Read More
Next Story