కర్నూల్ రాతినేలలో మొలకెత్తిన  రత్నాలు వీళ్లంతా...
x

కర్నూల్ రాతినేలలో మొలకెత్తిన రత్నాలు వీళ్లంతా...

12700 మంది మహిళ జీవితాలను ‘ఒక రూపాయి’ ఎలా మార్చిందంటే?


క‌ర్నూల్ జిల్లాలో, క‌ర్నూల్‌కు కేవ‌లం 25 కి..మీ దూరంలో వున్న ఓ చిన్న మండలం ఓర్వకల్. ఎటు చూసినా రాళ్లే. కఠినమైన భూమి. పగుళ్లతో పొడిబారిపోయిన నేల. కరువు అక్కడ విల‌య‌తాండ‌వం చేస్తూ వుండేది. ఏ గ్రామం చూసిన ముసలివాళ్లు మాత్రమే కనిపించేవారు. యువకులు, మహిళలు, పిల్లలు క‌నిపించేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు ప‌ని వెతుక్కుంటూ ట్రాక్టర్లెక్కి వలస వెళ్లే వారు. త‌ల్లిదండ్రుల‌తో పాటే చిన్న‌పిల్ల‌లు కూడా పాఠశాల ముఖమైనా చూడకుండా ర‌క‌ర‌కాల ప‌నులు చేస్తూ చ‌దువుకు దూరం అయ్యారు. ఈ గ్రామాల్లో బాల్య వివాహాలు ఎక్కువ‌గా జ‌రిగేవి. ఆడ‌పిల్ల‌ల‌కి ప‌దేళ్ల‌కే పెళ్లి చేసి పంపిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో రోజంతా కష్టపడి పని చేసినా కేవలం 15 రూపాయల కూలీ మాత్రమే దక్కేది.

"అంటరానితనం ఎంత బలంగా పాతుకుపోయి ఉండేదంటే "టీ దుకాణాల్లో రెండు గ్లాసుల వ్యవస్థ" వుండేది. మ‌రో వైపు ఫ్యాక్షన్ కత్తులు మెరిసి, పగ, ప్రతీకారం రోజువారీ జీవన భాగాలయ్యాయి. ఒక గ్లాసు తేడా, ఒక కత్తి తీర్పు. ఈ రెండింటి మధ్య నిరుపేదల జీవితాలు నిశ్శబ్దంగా చితికిపోయాయి.

రకరకాల కారణాలతో ఏ మహిళైనా ఆత్మహత్య చేసుకుంటే, ఎక్కువగా అలాంటి కేసులు పోలీస్ స్టేషన్‌ బయటే “సెటిల్‌మెంట్” అయ్యేవి. ఆ సెటిల్‌మెంట్ ఎలా జ‌రిగేదంటే ఒక పేద ఇంట్లో పెద్దమ్మాయి గృహ హింసకు బలి అయితే, ఆమె చెల్లెల్ని అదే వ్యక్తికి పెళ్లి చేసి పంపేవారు. అక్క పిల్లల్ని చెల్లెలు అయితే బాగా చూసుకుంటుంద‌ని వాదించేవారు. ఆ మండ‌లంలో మ‌హిళ‌ల‌ అక్ష‌రాస్య‌త శాతం 15% మాత్ర‌మే వుండేది. ఇది 1995 నాటికి ఓర్వకల్ మండలంలోని పేదరిక ముఖచిత్రం.

ఈ నేపథ్యంతోనే ఓర్వకల్ మండలంలో ఒక నిశ్శబ్ద విప్లవం ప్రారంభమైంది. 1995లో United Nations Development Programme ఆధ్వర్యంలో ద‌క్షిణాసియా పేద‌రిక నిర్మూల‌నా కార్య‌క్ర‌మం (SAPAP) (సౌత్ ఏషియా పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రాం) అనే చిన్న పైలట్ ప్రాజెక్ట్, అప్పటి ముఖ్యమంత్రి N. Chandrababu Naidu చొరవతో ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి తొలుత ఠక్కర్ ఐఎఎస్ గారిని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించారు; ఒక సంవత్సరం తరువాత మరో ఐఎఎస్ అధికారి కొప్పుల రాజు సి.ఇ.ఓగా బాధ్యతలు స్వీకరించి చివరి వరకు కార్యక్రమాన్ని నడిపించారు.

ఈ ప్రాజెక్ట్‌ను నడిపించేందుకు ప్రభుత్వం కొంతమంది ప్రాజెక్ట్ అధికారులను నియమించగా, వారిలో విజయభారతి ఒకరు; ఆమె ఓర్వకల్ మండల బాధ్యతలు స్వీకరించారు. ప్రారంభంలో అనేక సవాళ్లు. ఎన్నో సందేహాలు. స్థానిక ఒత్తిళ్లు వుండేవి. కానీ ఆమె వెనుదిరగలేదు. మహిళల్ని సంఘటితం చేయ‌డం ప్రారంభించారు. మ‌హిళ‌లు స్వ‌యం స‌హాయ‌క సంఘాలుగా ఏర్ప‌డ‌డం మొద‌లైంది. పొదుపు ప్రారంభమైంది. పేదలే పేదలను గుర్తించారు. వాళ్లే సభ్యులయ్యారు. వాళ్లే సమావేశాలు పెట్టారు. వాళ్లే నిర్ణయాలు తీసుకున్నారు. స్వయం సహాయక బృందాలు, సామూహిక పొదుపు, రుణాల వ్యవస్థలు కొత్త ఊపును పొందాయి. 30 నుంచి 35 గ్రూపులు కలిసి ఒక గ్రామ సమాఖ్యగా, అన్ని గ్రామ సమాఖ్యలు కలిసి ఒక మండల సమాఖ్యగా ఏర్పడ్డాయి.


ఓర్వకల్లో అలా ఓ నూతన శకం ప్రారంభమైంది. హుశేనాపురం గ్రామంలో కేవలం 20 మంది మహిళలతో రెండు డ్వాక్రా సంఘాలు ప్రారంభమయ్యాయి; ఆ రెండు సంఘాల స్ఫూర్తి క్రమంగా ఓర్వకల్ మండలమంతా వ్యాపించి, ప్రస్తుతానికి 1,270 సంఘాలు ఏర్పడి, మొత్తం 12,700 మంది మహిళలు సభ్యులయ్యారు.

ప్రతి రోజు ఒక్కో సభ్యురాలు ఒక రూపాయి పొదుపుతో ప్రారంభమైన ఈ ప్రయాణం, క్రమంగా ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేసుకుంటూ, ప్రస్తుతం ఒక్క సభ్యురాలు నెలకు వెయ్యి రూపాయలు పొదుపు చేయగల స్థాయికి ఎదిగింది; ఈ సంఘాలు కేవలం పొదుపు, రుణాల వ్యవస్థలే కాకుండా, మహిళల్లో ఆత్మవిశ్వాసం, పరస్పర నమ్మకం, గ్రామీణ మహిళల్లో నాయకత్వ లక్షణాలను కూడా పెంపొందించాయి.

ఈ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయకకుండా, సభ్యులకే వడ్డీకి అప్పుగా ఇచ్చే విధానం కీలక మలుపుగా నిలిచింది. పొదుపు సంఘం నుంచి సభ్యురాలికి అవసరమైన సమయంలోనే రుణం లభించడంతో, మహిళల జీవన విధానంలో స్పష్టమైన మార్పు వచ్చింది. సమయానికి పెట్టుబడి దొరకడం వల్ల మహిళలు వ్యవసాయం, చిన్న వ్యాపారాలు, పశుపోషణ, పిల్లల విద్య, కుటుంబ ఆరోగ్య అవసరాలను తీర్చుకుంటూ ఆర్థికంగా బలపడారు. ఇది కేవలం రుణం కాదు, వారి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తిని పెంపొందించే అవకాశంగా మారింది.

పేద మహిళలకు పెట్టుబడి మార్గాలు విస్తృతంగా తెరుచుకున్నాయి. బ్యాంకులు, Sree Nidhi Credit Cooperative Federation, మండల సమాఖ్యల ద్వారా కమ్యూనిటీ ఇన్‌వెస్ట్‌మెంట్ ఫండ్ (CIF), అలాగే స్వంతంగా ఏర్పాటు చేసిన మహిళా బ్యాంక్ ద్వారా రుణ సదుపాయాలు అందుబాటులో వచ్చాయి. ఒకప్పుడు పేదలకు అప్పు ఇవ్వడంలో వెనుకాడిన బ్యాంకులు కూడా ఇప్పుడు ఈ మహిళా సంఘాల విశ్వసనీయతను గుర్తించి, స్వయంగా రుణాలు అందిస్తున్నాయి.

సభ్యుల క్రమబద్ధమైన పొదుపు, పరస్పర సహకారం, సమిష్టి బాధ్యత ఫలితంగా, స్వయం సహాయక సంఘాల మొత్తం పొదుపు ₹111,56,32,000/-కు, వడ్డీ ₹108,47,33,837/-కు, మహిళా బ్యాంక్ టర్నోవర్ ₹19.54 కోట్లకు చేరింది. ఈ గణాంకాలు గ్రామీణ మహిళల సంకల్పబలం, కృషి, ఐక్యత సామూహిక శక్తిగా ఎలా రూపాంతరం చెందుతుందో స్పష్టంగా చూపిస్తున్నాయి.

ఈమె పేరు సుశీల‌మ్మ‌. బుడ‌గ‌జంగం సామాజిక‌వ‌ర్గం. హుసేనాపురం గ్రామానికి చెందిన ఈమె, బిక్ష‌మెత్తుకొని ఊరూరు తిరుగుతూ దుర్భ‌ర‌మైన జీవితం గ‌డిపేది. అయితే వెంక‌టేశ్వ‌ర‌సంఘం-2 పొదుపు సంఘం స‌భ్యురాలుగా చేరిడంతో ఆమె జీవితం మారిపోయింది.

"ఇప్పటి వరకు 30 లక్షల రూపాయల అప్పు తీసుకున్నాను. ఆ డబ్బుతో మసాలా దినుసులు, చీరల వ్యాపారం చేశాను. నా భర్తకు ఆటో కొనిపించి ఇచ్చాను. ఇద్దరం కలిసి ప్రతి రోజు 1,000 నుంచి 1,200 రూపాయలు సంపాదిస్తున్నాం. ఇప్పుడు మాకు రెండు అంతస్తుల ఇల్లు ఉంది, పొలం కొన్నాం, ముగ్గురు కొడుకులను చదివించాము. నా కొడుకుకు గుండె ఆపరేషన్ చేయించించాము, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. గత 20 ఏళ్లలో మా పొదుపు సంఘానికి చెందిన 10 మంది సభ్యులు రెండు కోట్ల రూపాయల అప్పు తీసుకుని తీర్చాము," అని చెబుతున్నారు సుశీలమ్మ.

లొద్దిపల్లి గ్రామానికి చెందిన రత్నమ్మ కు బాల్యవివాహం జరిగింది. ఆమె నిరుపేద దళిత కుటుంబానికి చెందినది. తండ్రి చెప్పులు కుట్టేవారు. ఆమె భర్త స్థానిక భూస్వామి వద్ద వెట్టి చాకిరీ చేస్తూ బాండెడ్ లేబర్‌గా ఉండేవాడు. ఐదుగురు పిల్లలు, అందులో నాలుగు అమ్మాయిలు. వీళ్ల కడుపు నింపడానికి రత్నమ్మనే వ్యవసాయ కూలీగా పని చేసేది. కట్టెలు మోసుకుని హోటళ్లలో వేసేది. ఆ డబ్బుతో పిల్లలను పెంచేది. పిల్లలతో పాటు భర్తను కూడా తానే పోషించేది, ఎందుకంటే భర్త బాండెడ్ లేబర్. రత్నమ్మ అలా కఠిన దారిద్రాన్ని 20 ఏళ్లు అనుభవించింది. పూరి గొడిసెలో నివాసం, పొలాలూ లేవు. పుట్టింట్లో, అత్తింటో దారిద్రం తాండవిస్తూ వుండేది.

ఆ సమయంలో రత్నమ్మ ఇందిరా మహిళా పొదుపు సంఘం సభ్యురాలుగా చేరింది. మండల సమాఖ్య నిర్వ‌హించిన ఛైల్డ్ లేబర్ క్యాంప్‌లో తను తన పిల్లలను చేర్పించుకుంది. పొదుపు సంఘం ద్వారా అప్పు లభించింది. ఆ డబ్బుతో ఒక ఎకరం పొలం కొని కూరగాయలు పండించింది. పండించిన కూరగాయలను రైతు బజార్‌కు సప్లయ్ చేయడం ద్వారా ఆదాయం పెరిగింది. పిల్లలను చదివించింది. నాలుగురు అమ్మాయిలు నర్సులయ్యారు. కొడుకును ఇంజనీరింగ్ చదివించిందీ.

నాలుగు అమ్మాయిలకు పెళ్ళిళ్లు కూడా చేసింది. అల్లుళ్లంద‌రూ అందరూ ప్రభుత్వ ఉద్యోగులే. “అంటరాని తనంలో పుట్టి పెరిగాం, ఊరిలో ఎవ్వరూ దగ్గరకు రాకపోయేవారు. అలాంటిది పొదుపు సంఘంలో చేరిన తర్వాత నా జీవితం పూర్తిగా మారింది. అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ తో షేక్ హ్యాండ్ ఇచ్చాను, రెండు దేశాలు పర్యటించాను, కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్‌గా 12 రాష్ట్రాల్లో పనిచేశాను, అనేక సార్లు విమానం ఎక్కాను” అని రత్నమ్మ గర్వంగా ఫెడరల్ ఆంధ్ర కు తెలిపారు. ఇప్పటివరకు ఆమె పొదుపు సంఘం ద్వారా 38 లక్షల రూపాయల అప్పు తీసుకుని మొత్తం తిరిగి చెల్లించారు. అంతేగాక, మండల సమాఖ్య అధ్యక్షురాలిగా కూడా ప‌నిచేశారు.

హుశేనాపురానికి చెందిన ఫ‌కీర‌మ్మ‌ది ద‌య‌నీమైన క‌థ‌. “నేను, నా భర్త టాయిలెట్ గుంతలు శుభ్రం చేసేవాము. మేము చేసే ఈ పాకీ పనికి రోజుకు 30 రూపాయల కూలీతో పాటు వాడిన పాత సబ్బు, పాత చీర ఇస్తారు. పని అయిపోయాక ఊరుబయట బావి దగ్గర స్నానం చేసి, ఆ పాత చీర కట్టుకుని ఇంటికి వెళ్తాను. 20 ఏళ్లు భయంకరమైన జీవితం చూశాను. ఎందుకు బ్రతుకుతున్నామో అనిపించేది,” అని ఫకీరమ్మ చెప్పారు.

ఫకీరమ్మ కు ఒక రోజు పొదుపు గ్రూప్‌లో చేరే అవకాశం వచ్చింది. అది చిన్న నిర్ణయం అయినప్పటికీ, ఆమె జీవితానికి పెద్ద మలుపు తిప్పింది. అప్పు తీసుకుని కూరగాయల వ్యాపారం ప్రారంభించింది. కానీ సమస్యలు అక్కడే ఆగలేదు. “మా ఊర్లో నేను అమ్మే కూరగాయలు ఎవ్వరూ కొనేవారు కాదు,” అని ఫకీరమ్మ చెప్పారు. పాకీ పని చేసే ఆమె కూరగాయలను ఎలా తింటార‌ని ప్ర‌చారం చేశారు. వివక్ష అలా వెంటాడింది.

అందుకే ఫకీరమ్మ లారీ ఎక్కి, దూరంగా ఉన్న మరో ఊరికి వెళ్లి అక్కడ కూరగాయలు అమ్మింది. అంతటితో ఆగలేదు. కర్నూల్ వెళ్ళి హోటళ్లకు కూరగాయలు సరఫరా చేయడం ప్రారంభించి బాగా సంపాదించింది. “6 ఎకరాల పొలం సంపాదించాను, రెండంతస్తుల ఇల్లు కట్టుకున్నాను. కొడుకు ఎం.బి.ఏ చదివి కో ఆపరేటివ్ బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. కోడలు కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా, కూతురు బి.ఎడ్ పాసైంది, అల్లుడు పి.హెచ్‌డీ పూర్తి చేసి ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు,” అని ఆమె గర్వంగా చెప్పారు. “30 లక్షల రూపాయల అప్పు తీసుకుని తీర్చా” అని ఫకీరమ్మ ఫెడరల్ ఆంధ్ర కు తెలిపారు. ఒకప్పుడు పాత చీర కోసం ఎదురు చూసిన ఫకీరమ్మ, అవమానాన్ని ఆత్మగౌరవంగా మార్చుకున్న కథ అందరికీ స్పూర్తిగా నిలిచింది.

“నేను మా మండల సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్న ఛైల్డ్ లేబర్ క్యాంప్‌లో చదివాను. మా మండల సమాఖ్య నన్ను సోషియల్ వెల్ఫేర్ స్కూల్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ చేసింది. కష్టపడి చదివి సీటు సంపాదించుకున్నాను. పదవ తరగతి పాసైన తర్వాత కూడా మా సమాఖ్య నా చేతి విడిచిపెట్టలేదు. నన్ను ఎ.ఎన్‌.ఎం. ట్రైనింగ్‌కు పంపించింది. కొద్దికాలం పెద్ద ఆసుపత్రిలో నర్సుగా పనిచేశాను. ప్రస్తుతం మండల సమాఖ్యలోనే ప్రకృతి వ్యవసాయం కార్యక్రమంలో పని చేస్తున్నాను. అలాగే, నేను మహిళా బ్యాంక్ బోర్డు ఆఫ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నాను,” అని లింగమ్మ చెప్పారు.

హైమావతి హుస్సేనా పురానికి చెందినది. ముగ్గురు బిడ్డల తల్లి. పిల్లలు హైస్కూల్ స్థాయిలో ఉన్నప్పుడే భర్తను కోల్పోయింది. ఒంటరి మహిళ అయినప్పటికీ, మండల సమాఖ్య అండతో పిల్లల జీవితాలను చక్కగా తీర్చింది. ఇప్పటి వరకు ఆమె పొదుపు సంఘం, మండల సమాఖ్య, బ్యాంక్‌ల ద్వారా 40 లక్షల రూపాయల అప్పు తీసుకున్నారు. డీలర్ పాప్ నడుపుతూ, కిరాణా షాప్ కూడా నడుపుతున్నారు. అంతే కాదు, చీరల వ్యాపారం కూడా చేస్తున్నారు. ఆమె కూతురు సైంటిస్ట్‌, సచివాలయంలో ఇంజనీరుగా పని చేస్తున్నారు. 4 సెంట్ల భూమి కొని రెండంతస్తుల ఇల్లు కట్టుకుంది. పాపకు 10 తులాల బంగారం కొని పెళ్ళి చేసారు. హైమావతి వాటర్ షెడ్‌ కమిటీ సభ్యురాలిగా కూడా పనిచేస్తోంది.

లొద్ది పల్లి కి చెందిన లచ్చమ్ పొదుపు సంఘం ద్వారా తీసుకున్న అప్పుతో గోట్‌ఫాం పెట్టారు. మేకలు, గొర్రెల సంఖ్య బాగా పెరిగింది. “వచ్చిన ఆదాయంతో ట్రాక్టర్, ఆటో కొన్నాం, పిల్లల పెళ్ళికి బంగారం, వెండి కొన్నాం. మొత్తం 25 లక్షల రూపాయల అప్పు తీసుకుని తీర్చానని,” లచ్చమ్ తెలిపారు.

కాల్వబుగ్గ గ్రామానికి చెందిన లక్ష్మీదేవి సాధారణ గృహిణిగా జీవితాన్ని ప్రారంభించారు. ఆమె భర్త ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆదాయం తక్కువగా ఉండటంతో కుటుంబం ఆర్థికంగా భారంగా గడిచేది. ఈ పరిస్థితుల్లో లక్ష్మీదేవి సరోజని దేవీ మహిళా పొదుపు సంఘం సభ్యురాలిగా చేరి, సంఘం ద్వారా అప్పు తీసుకుని స్వయం ఉపాధి కోసం ఇటుకబట్టీ వ్యాపారం ప్రారంభించారు.

“ఇప్పటి వరకు రూ.60 లక్షల వరకు అప్పు తీసుకుని పూర్తిగా తీర్చాను. ప్రస్తుతం నా ఇటుకబట్టీలో 100 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. వారు ఒక్కొక్కరు రోజుకు వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నారు. నాకు నెలకు లక్ష రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వస్తోంది,” అని లక్ష్మీదేవి చెప్పారు. ఓ సాధారణ గృహిణి, మహిళా సంఘం సహకారంతో విజయవంతమైన వ్యాపారిగా మారి, గ్రామంలోనే కాదు, పరిసర ప్రాంతాల్లో కూడా ఆదర్శంగా నిలిచారు.

పల్లెల్లో నిశ్శబ్దంగా మొదలైన మార్పు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పు వెనుక ఉన్న కథలను Vijaya Bharathi ఫెడరల్ ఆంధ్ర తో పంచుకున్నారు. “ఒకప్పుడు గుడిసెల్లో జీవించిన మహిళలు, ఇప్పుడు పక్కా ఇళ్ల యజమానులయ్యారు. వెట్టి చాకిరీకి ముగింపు పలికారు. స్వంత భూములతో రైతులుగా ఎదిగారు. ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సిన అవసరం తగ్గింది. ఒకప్పుడు పని కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినవారే ఇప్పుడు తమ గ్రామాల్లోనే మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. కూలీలుగా పనిచేసిన మహిళలు వ్యాపారులయ్యారు, లారీలు, ఆటోలు, కార్లు కొనుగోలు చేసే స్థాయికి చేరుకున్నారు,” అని చెప్పారు.

300కి పైగా చిన్న వ్యాపారాలను ప్రారంభించి అదనపు ఆదాయం పొందుతున్నారు. పెద్ద మొత్తాల అప్పులతో జూట్ బ్యాగ్ యూనిట్లు, టెంట్ హౌస్లు, హోటళ్లు, చెప్పుల దుకాణాలు, జిరాక్స్, ఫోటో స్టూడియోలు, సూపర్ మార్కెట్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు, గోల్డ్ షాపులు, మార్బుల్ షాపులు, పూలు, పండ్లు విక్రయ కేంద్రాలు, స్వీట్ తయారీ యూనిట్లు, ప్రింటింగ్ ప్రెస్‌లు, చికెన్, మటన్ షాపులు, బేకరీలు, డైరీ ఫారంలు, ఎగ్ కార్ట్లు, కూల్ డ్రింక్ డీలర్‌షిప్‌లు, ఆయిల్, పిండి, కారం మిషన్లు, పండ్ల తోటల పెంపకం పెట్టి ఆదాయం పెంచుకున్నారు.

మహిళలు ఇప్పుడు ఆర్థికంగా బలపడటమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే శక్తిగా మారుతున్నారు. కుటుంబాల్లో ఆలోచన మారింది. కొత్త కోడలు ఇంటికి వస్తే వెంటనే ఆమెను ఏదో గ్రూప్‌లో చేరుస్తున్నారు. ఒకప్పుడు సమావేశాలకు అడ్డున్న భర్తలే ఇప్పుడు “మీ మీటింగ్ ఎప్పుడు?” అని ప్రశ్నిస్తున్నారు. “ఈ మార్పు ఒక వ్యక్తిగత విజయం కాదు, ఇది సమూహ శక్తి, ఐక్యత, పట్టుదల కలిసిన ఫలితం,” అని విజయభారతి చెప్పారు.

“పేదరికానికి డబ్బు లేకపోవడం ఒక్కటే కారణం కాదు. డబ్బు ఉంటేనే పేదరికం పోదు,” అని చెప్పే విజయభారతి అభిప్రాయం చాలా లోతైనది. ఆమె దృష్టిలో, పేదరికం కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు. అనేక సామాజిక సమస్యలూ పేదరికానికి కారణమవుతున్నాయి.

నిరక్షరాస్యత, బాల్యవివాహాలు, అంటరానితనం, చైల్డ్ లేబర్ వంటి సమస్యలు కొనసాగుతూనే ఉంటే, ఆర్థిక సాయం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. స్థిరమైన మార్పు కోసం విద్య అత్యంత ముఖ్యమని విజయభారతి భావించారు. అందుకే విద్యను ఆయుధంగా ఎంచుకున్నారు. ఆమె దృష్టిలో, విద్య కేవలం పాఠశాల చదువే కాదు, జీవన నైపుణ్యాలు, చట్టాలపై అవగాహన, ఆరోగ్య జ్ఞానం, ఆర్థిక నిర్వహణ వంటి సమగ్ర అభివృద్ధి. అందువలన ఆమె ప్రయాణం పొదుపుతో మొదలై, అవగాహనతో ముందుకు సాగి, సామాజిక మార్పుతో ఫలిస్తోంది.

విజయభారతి ఈ మండలంలో పేదరికానికి ప్రధాన కారణం విద్యా లోపమేనని గుర్తించి, బాల కార్మిక వ్యవస్థను అరికట్టేందుకు మండల సమాఖ్య తరఫున ప్రత్యేక చైల్డ్ లేబర్ క్యాంపులను ఏర్పాటు చేశారు. చదువుతో జీవితాన్ని మార్చుకోవచ్చనే నమ్మకంతో అనేక మంది పిల్లలను పాఠశాల బాట పట్టించారు. “మంచి సంకల్పంతో ముందడుగు వేస్తే ప్రకృతి సహకరిస్తుంది, అవసరమైన వనరులు ఒక్కొక్కటిగా చేరతాయి. మార్పు అసాధ్యం కాదు, మొదలుపెట్టడమే ముఖ్యం,” అని ఆమె ధైర్యంగా చెప్పారు.

అనంతపూర్ నుంచి కర్నూల్‌ వైపు ప్రయాణిస్తున్న World Bank ప్రతినిధి నిషిమోషి ఆ ప్రాంతంలో ఆగి మా క్యాంప్‌ను సందర్శించారు. అప్పటివరకు United Nations Development Programme కేవలం పొదుపు కార్యక్రమాలకే నిధులు ఇస్తోంది. కానీ అక్కడి పరిస్థితులు చూసిన తర్వాత “సోష‌ల్ ఎజెండా కూడా అంతే ముఖ్యమని” గుర్తించి, చైల్డ్ లేబర్ క్యాంప్‌లను ప్రాజెక్ట్‌లో భాగం చేశారు.

అలా ప్రతి బ్లాక్‌లో ఒక క్యాంప్ ప్రారంభమైంది. “భవిత” పేరుతో ఎనిమిదేళ్లు ఆ ఉద్యమం సాగింది. పిల్లలను తీసుకొచ్చిన ప్రతిసారి వారు భయంతో పారిపోతుండేవారు. మళ్లీ వెతికి తీసుకొచ్చి, స్నానం చేయించి, రిబ్బన్లు పెట్టి, గోరింటాకు వేసి, మంచి ఆహారం పెట్టి, “ఇది కూడా మీ ఇల్లే” అనే భావన కలిగించాం. ఆ తరువాతే అక్షరాలు నేర్పడం మొదలెట్టాం. అలా అక్షరాల నుంచి మూడో తరగతి స్థాయి వరకు తీసుకువచ్చాం.

అయిదో తరగతి పాస్ చేసిన తర్వాత, ఈ పిల్లలను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించాలనుకున్నాం. అక్కడ సీటు వస్తే పదో తరగతి వరకు ఉచిత విద్య లభిస్తుంది. అందుకే ఎంట్రన్స్ పరీక్షలకు సిద్ధం చేసే సమయంలో బడ్జెట్ సమస్య ఎదురైంది, ఎందుకంటే కేవలం ఆరు నెలల క్యాంప్‌ను మూడేళ్ల పాటు పొడిగిస్తూ వ‌చ్చామ‌ని ఆమె చెప్పారు.

చైల్డ్ లేబర్ నిర్మూలన తాత్కాలిక చర్యలతో సరిపోదు. కేవ‌లం ఆరు నెలల క్యాంప్‌లో ఉంచి పాఠశాలలో చేర్పించడం ఒక ప్రారంభం మాత్రమే. కానీ అంత తక్కువ సమయంలో పిల్లలు విద్యా లోటును పూడ్చుకోలేరు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు మారకపోతే, వారు మళ్లీ చైల్డ్ లేబర్‌గా మారే అవకాశం ఉంటుంది. అందుకే దీర్ఘకాలిక వ్యూహం అవసరం: కనీసం మూడు సంవత్సరాల పాటు ప్రత్యేక బ్రిడ్జ్ కోర్సు క్యాంప్‌లో బలమైన పునాది వేసి, నాలుగు–ఐదు తరగతుల స్థాయికి తీసుకెళ్లిన తర్వాత రెసిడెన్షియల్ హైస్కూల్‌లో చేర్పించాలి. వారి కుటుంబాలకు సమాంతరంగా ఆర్థిక సహాయం, స్థిర ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది; అప్పుడు మాత్రమే మార్పు నిలకడగా ఉంటుంది. “ఒక పిల్లవాడిని చైల్డ్ లేబర్ నుంచి విద్యార్థిగా మార్చడం అంటే ఒక కుటుంబ భవిష్యత్తును మార్చడమే. దీర్ఘకాలిక విద్యా మద్దతే నిజమైన పరిష్కారం,” అని విజయభారతి చెప్పారు.

ఈ పిల్లలను లేబర్ క్యాంప్‌ల నుంచి వెనక్కి పంపాల్సిన సమయానికి ఓ అద్భుత సంఘటన జరిగింది. సి.ఎం.ఓ. (ముఖ్యమంత్రి Chandrababu Naidu కార్యాలయం) నుండి సమాచారం వచ్చింది. హాలెండ్ దేశం నుంచి వచ్చిన ఒక కుటుంబం మహిళా సాధికారత కార్యక్రమాలను చూడటానికి వస్తోంది.

వాళ్లు గ్రామాల్లో మహిళా సంఘాల కార్యకలాపాలు చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా ఛైల్డ్ లేబర్ క్యాంప్‌లో ఉన్న పెద్ద వయసు పిల్లలు కేవలం రెండు, మూడు సంవత్సరాల్లో చదువులో సాధించిన పురోగతిని చూసి వారు భావోద్వేగానికి గురయ్యారు.

“వీళ్లను వెనక్కి పంపాల్సి వస్తుందా? ఎంత బడ్జెట్ అవసరం?” అని అడిగారు. “మేమే బడ్జెట్ ఇస్తాం. కార్యక్రమం కొనసాగించండి,” అని స్పష్టంగా చెప్పారు. అది ఒక మలుపు. పిల్లలందరూ ప్రవేశ పరీక్ష రాశారు. ప్రతి ఒక్కరికీ సీటు వచ్చింది. 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత, వారి కోసమే ప్రత్యేకంగా ఒక జూనియర్ కాలేజ్ ప్రారంభించి, ఇంటర్ పూర్తయ్యే వరకు చదివించాం. ఆ తరువాత ఆ కాలేజ్‌ను మూసివేశారు. ఎందుకంటే లక్ష్యం నెరవేరింది. కాలక్రమంలో 100 మంది బాల కార్మికులు నర్సులయ్యారు, నలుగురు డాక్టర్లు, 25 మంది ఇంజనీర్లు, ఇద్దరు ఎస్‌.ఐలు, మిగతావారంతా టీచ‌ర్లుగా స్థిరపడ్డారు.

విద్యా విప్ల‌వం...

2008 సంవత్సరం.

ఈ పొదుపు ఉద్యమం మహిళలకు కేవలం ఆర్థిక స్వాలంబన మాత్రమే కాక, వారిలో సామాజిక స్పృహ, చైతన్యాన్ని కూడా రగిలించింది. తమ ఇల్లు, పిల్లలు, సంసారం పరిమితిని దాటి, వారు బహిరంగ ప్రపంచాన్ని కూడా చదవగలిగారు. బ్యాంక్‌లకు వెళ్ళినప్పుడు, శిక్షణ కోసం పొదుపు గ్రామాలకు వెళ్ళినప్పుడు, ఇతర రాష్ట్రాలకు కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్‌గా వెళ్ళినప్పుడు, వారి గ్రూప్ పుస్తకాలలో లెక్కలు రాసుకోవాల్సినప్పుడు, చదువు లేని లోటు, చదువు విలువ బాగా తెలుసు కావడం స్పష్టమైంది.

“మనం చదువుకుని ఉంటే ఇంకా వేగంగా అభివృద్ధి సాధించేది కదా” అనే ఆలోచన మొదలైంది. ఇతరులపై ఆధారపడడం అవమానంగా అనిపించింది. మన తరం ఇలా జరిగిపోయింది. మన పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలన్న కోరిక బలపడింది. ఆ కోరిక, ఆ కల బాలభారతి స్కూల్ నిర్మాణానికి పునాది వేసింది.

మన పిల్లల కోసం మనమే ఒక మంచి పాఠశాల నిర్మించుకోవాలనుకున్నారు. వారి కలను నిజం చేయడానికి విజయభారతి ఓర్వకల్ సమీపంలో 4 ఎకరాల భూమిని కొనుగోలు చేసి మండల సమాఖ్యకు ఇచ్చారు. ఆ ప్రోత్సాహంతో మహిళలు మరో 3 ఎకరాల పొలం కొనుగోలు చేశారు. మొత్తం 7 ఎకరాల భూమిలో బాలభారతి స్కూల్ నిర్మాణం ప్రారంభమైంది.

“మన పిల్లలు మనలాగే కష్టపడకూడదు… చదువుతో ఎదగాలి” అనే ఆ ఒక్క సంకల్పమే వారికి అశేష శక్తిగా మారింది. 12,000 మంది మహిళలు, 11 సంవత్సరాల నిరంతర కృషి, వనరుల సమీకరణ, ఐక్యతతో కలిసికట్టుగా నిర్మించిన ఆధునిక విద్యాసంస్థే బాలభారతి స్కూల్‌. ఈ పాఠశాల ప్రత్యేకత ఏమిటంటే, అది ప్రభుత్వ నిధులు లేకుండా, ఇతరుల నుంచి చందాలు వసూలు చేయకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, నిరుపేద మహిళలే స్వశక్తితో నిర్మించుకున్నారు.


ఇది కాంట్రాక్టర్ల నిర్మాణం కాదు. ఇది తల్లుల నిర్మాణం. వాళ్లే కూలీలయ్యారు. ఉదయం ఇంటి పనులు. మధ్యాహ్నం నిర్మాణ పనులు. కుటుంబాలతో కలిసి పదకొండేళ్లు చెమటోడ్చారు. ఇటుకలు మోసిన చేతులే రాత్రిళ్లు పిల్లలకు భోజనం పెట్టాయి. చెమట చిందించిన ఆ గోడల మధ్యే వారి కలలు ఇటుకల్లా గట్టిపడ్డాయి.

కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే సదుపాయాలు ఉన్నా, ఈ భవనానికి అసలు విలువ గోడల్లో కాదు, అందులో కలిసిన చెమటలో ఉంది. బిడ్డల బంగారు భవిత కోసం తల్లులు నడిచిన ఆ ప్రయాణం డ్వాక్రా మహిళల సంఘబలం చరిత్రగా నిలిచింది.

ఒర్వకల్ ప్రాంతంలో విద్యకు నూతన దిశ చూపుతూ ఆదర్శ విద్యాసంస్థగా బాలభారతి పాఠశాల గుర్తింపు పొందింది. స్టేట్ సిలబస్‌ను అనుసరిస్తుంది. ప్రభుత్వ పాఠ్యాంశాలను ఆధారంగా తీసుకుని, విద్యార్థులకు బలమైన పునాది అందిస్తుంది. అయితే, కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రాక్టికల్ లెర్నింగ్, నైతిక విలువలు, శారీరక దారుఢ్యం, సృజనాత్మకత వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తుంది. తరగతి గదుల్లో డిజిటల్ బోధన, ప్రాజెక్ట్ వర్క్, గ్రూప్ డిస్కషన్ వంటి ఆధునిక పద్ధతులు అమలు చేస్తున్నారు.

ప్రతి రోజు మధ్యాహ్నం సుమారు 1000 మంది విద్యార్థులకు ఉచిత భోజనం అందించడానికి శ్రీనివాస్ గారు ముందుకు వచ్చారు. పోషకాహారంతో కూడిన భోజనం అందించడం ద్వారా పిల్లల ఆరోగ్యం, చదువుపై దృష్టి రెండూ మెరుగుపడుతున్నాయని డ్వాక్రా మహిళలతో ఏర్పడిన ఎడ్యుకేషన్ కమిటీ తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఇది ఒక వరం అని తల్లిదండ్రులు భావిస్తున్నారు.

ఇంకా ఒక ముఖ్యమైన విష‌యం ఏమిటంటే రెగ్యులర్ మెడికల్ చెకప్. పాఠశాలలో నిరంతర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్యులు వచ్చి పిల్లల ఆరోగ్య స్థితిని పరిశీలించి అవసరమైన సూచనలు ఇస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ముందుగానే గుర్తించి పరిష్కరించడంతో విద్యార్థులు ఆరోగ్యంగా, చురుకుగా ఉంటున్నారు.

“మేము పిల్లలను కేవలం పరీక్షల కోసమే తయారు చేయడం లేదు. జీవితానికి సిద్ధం చేస్తున్నాం,” అని శివ‌శంక‌ర్ అనే టీచ‌ర్ చెప్పారు. “విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచడం, మంచి మనుషులుగా తీర్చిదిద్దడం మా లక్ష్యం.” విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, సందేహాలు స్వేచ్ఛగా అడగగల వాతావరణం కల్పిస్తున్నామ‌ని ఉపాధ్యాయులు చెప్పారు.

“ఇక్కడ చదవడం చాలా ఆనందంగా ఉంటుంది. మా టీచర్లు బాగా అర్థమయ్యేలా చెబుతారు,” అంటున్నారు 10వ త‌ర‌గ‌తి విద్యార్థిని గీత‌.

“మధ్యాహ్న భోజనం చాలా రుచిగా ఉంటుంది. మాకు ఆటలకి, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా సమయం ఇస్తారు,” అని 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న త‌స్లీం చెప్పింది. పాఠశాలపై వారికి ఉన్న అనుబంధం స్పష్టంగా కనిపిస్తుంది.

తల్లిదండ్రులు ఈ పాఠశాల బోధనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “మా పిల్లల్లో చాలా మార్పు వచ్చింది. చదువులోనే కాదు, ప్రవర్తనలో కూడా మెరుగుదల ఉంది,” అని 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న స్వాతి తండ్రి మ‌ద్ద‌య్య చెప్పారు.

“ఇక్కడ క్రమశిక్షణ, శ్రద్ధ, సంస్కారం నేర్పిస్తున్నారు. మా పిల్లల భవిష్యత్తు గురించి ఇప్పుడు మాకు నమ్మకం ఉంది,” అని 3వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న అర్ష‌ద్ తల్లి ఎం.డి.సుల్తానా అభిప్రాయపడింది.

"బాల భార‌తి విద్యాసంస్థ, విద్య, ఆరోగ్యం, పోషణ ఈ మూడు అంశాలను సమన్వయ పరుస్తూ సమగ్ర విద్యా నమూనాగా నిలుస్తోంది", అని పాఠ‌శాల‌ వ్య‌వ‌స్థాప‌కురాలు విజ‌య‌భార‌తి ఫెడ‌ర‌ల్ ఆంధ్ర‌తో చెప్పారు. బాలభారతి పాఠశాల కేవలం పాఠశాల మాత్రమే కాదు, భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే ఒక ఆశాకిరణం.

25 సంవత్సరాల క్రితం పేదరిక నిర్మూలనకుగాను, అప్పటి ముఖ్యమంత్రి Chandrababu Naidu స్థాపించిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, SERP, ఆంధ్రప్రదేశ్‌లో కోటి మంది మహిళలను సంఘటితం చేసింది. మహిళ శక్తిని వెలికి తీయడం ద్వారా వారిని అభివృద్ధిలో భాగస్వాములుగా చేసుకుంది. మహిళల భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలనకు కొత్త బాట వేసింది. రజితోత్సవం జరుపుకోబోతున్న సెప్ సంస్థ సిగ్‌లో ఓర్వకల్ ఓ మణిపూసలా నిలిచింది.

Read More
Next Story