శ్రీవారి పాదాల చెంత మోసం?
భోగాపురంలో ఎగిరే విమానాలు... రేణిగుంటలో ఎందుకు ఆగవు?
చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని 56 ఏళ్ల నాటి రేణిగుంట విమానాశ్రయానికి 2017లో అంతర్జాతీయ హోదా దక్కింది. ఇక్కడి నుంచి విదేశీ విమానాలు ఎందుకు ఎగరడం లేదు?
రేణిగుంట అంతర్జాతీయ స్థాయికి పెంచడానికి యూపీఏ ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్ 2010లో టెంకాయ కొట్టారు. కొత్త టెర్మినల్ కు 2015లో ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా గుమ్మడికాయ కొట్టారు.
చిత్తూరు జిల్లా రేణిగుంట (తిరుపతి) కాదు.. కాదు... "శ్రీవేంకటేశ్వరా అంతర్జాతీయ విమానాశ్రయం మహద్వారం తలుపులు ఎందుకు తెరవడం లేదు?.
ఏపీకి చిత్తూరు మహద్వారం...
చిత్తూరు జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు. ఏపీకి మహద్వారంగా ఉన్న రేణిగుంట విమానాశ్రయం నుంచి విదేశాలకు విమానాలు ఎగరడానికి సాంకేతిక, భద్రత, వనరులు, వసతులు ఉన్నా, తలుపులు తెరవడం లేదు.
"ఒక అంతర్జాతీయ విమానం వస్తే హ్యాండిల్ చేసే సామర్థ్యం ఉంది" అని ఓ అధికారి చెప్పారు.
రన్ వే ఉన్నా, టెర్మినల్ పనులు ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు పెంచడం తోపాటు సెక్యూరిటీ మరింత అవసరం అని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో
బోగాపురం విమానాశ్రాయ నిర్మాణానికి 2019 లో టెంకాయ కొట్టారు. 15 నెలల్లో పూర్తి చేసి, ఆగష్టు ఒకటిన గుమ్మడికాయ కొట్టినా, 17వ తేదీ సింగపూర్ కు తొలి విమానం ప్రయాణిస్తుంది. విశాఖపట్టణం, విజయవాడ విమానాశ్రయాలతో పోలిస్తే, బోయింగ్ 777 విమానాలు దిగడానికి రేణిగుంట విమానాశ్రయంలో భారీ రన్ వే అనుకూలంగా ఉంది.
2024 డిసెంబర్ ఆరో తేదీ ఓ ప్రయాణికుడు నలుగురు సిబ్బందితో మిస్టర్స్ లక్స్ ఏవియేషన్ శాన్ మారిగో యాజమాన్యం సింగపూర్ కు విమానం నడిపింది. ఆ తరువాత అంతర్జాతీయ విహంగాలు ఎగిరిన దాఖలాలు లేవు. ప్రయత్నాలు కూడా లేవు. ఇదే పరిస్థితి భోగాపురంలో కూడా ఏర్పడుతుందా? లేకుంటే, విజయవాడ, విశాఖ, హైదరాబాద్ తరహాలో అంతర్జాతీయ సర్వీసులు నడుస్తాయా?
పార్లమెంటులో ఇచ్చిన హామీ ఏమైంది?
రాయలసీమ ప్రాంతం నుంచి లక్షల సంఖ్యలో గల్ఫ్ దేశాల్లో ఉన్న వారి కోసం ఓపెన్ స్కై పాలసీ కింద కువైట్ కు విమానం నడపాలని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి 2023లో ఏప్రిల్ నెలలో కోరడంతో పార్లమెంట్ లో సానుకూల స్పందన వచ్చింది. 400 సీట్లతో విమానం నడపడానికి కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని అప్పటి రేణిగుంట విమానాశ్రయం డైరెక్టర్ రాజ్ కిషోర్ చెప్పిన మాటలు ప్రస్తావనార్హం. కానీ ఇంతరకు విదేశీ విమానాలు ఎగిరిన దాఖలాలు లేవు.
అన్నీ సిద్ధమే.. ఇంక ఆలస్యం ఎందుకు?
ఇండిగో పాటు రెండు విమానయాన సంస్థలు అంతర్జాతీయ విమానాలు నడపడానికి సంసిద్ధంగా ఉన్నా, ఆ దిశగా అధికార ప్రయత్నాలు సాగడం లేదు. దీనికి ప్రధాన కారణం, సెక్యూరిటీ, టెర్మినల్ సమస్యలే అనేది స్థానిక అధికారుల మాట.
నష్టాల బాటలో ఉన్నట్లు చూపించడం ద్వారా విమానాశ్రయాలను ప్రయివేటు సంస్థలకు అప్పగించడమే. అని తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతా మోహన అభిప్రాయపడ్డారు. ప్రయివేటు సంస్థలకు అప్పగించే లక్ష్యంగానే అడుగులు వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరో ప్రశ్న కూడా ఉంది?
విశాఖపట్టణానికి గంట ప్రయాణ దూరంలోనే భోగాపురం విమానాశ్రయం ప్రారంభించారు. దీనికోసం ఏడు అంతర్గత మార్గాలు ఏర్పాటు చేశారు. ఇది గోదావరి జిల్లాల వారికి ఉత్తరాంధ్ర ప్రాంతం కానుకగా నిలిచిందనే ఎన్డీఏ నేతల మాట.
చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి ఆ పరిస్థితి లేదు. అన్నీ జాతీయ రహదారులే. కానీ, దరిదాపుల్లో డొమెస్టిక్ మినహా అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవు. 120 కిలోమీటర్ల దూరంలో చెన్నై. 240 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు కెంపే గౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. హైదరాబాద్ షంషాబాద్ విమానాశ్రయం 800 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ లెక్కల ఆధారంగా రేణిగుంట ఏయిర్ పోర్టులో అన్ని హంగులూ ఉన్నా, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు.
రేణిగుంట ప్రాధాన్యతలు ఇవీ..
చిత్తూరు జిల్లా తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో ప్రపంచ వాణిజ్య ఉత్పాదక సంస్థలకు శ్రీసిటి నిలయంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలే కాదు. నెల్లూరు ప్రకాశం జిల్లాల నుంచి కూడా కువైట్, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ కు ఉపాధి కోసం వెళ్లిన కార్మికుల సంఖ్య లక్షల్లో ఉంది. కేవలం కువైట్ లోనే దాదాపు నాలుగు లక్షల మంది తెలుగు వారు ఉన్నారు.
"రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా తీసుకుని రావడం అనేది నా ప్రమేయమే. దీనిని ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడానికే నిర్వీర్యం చేస్తున్నారు" అని తిరుపతి మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ ఆవేదన చెందారు.
సీమకు తలమానికం..
రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుంచి విదేశాలకు వెళ్లాలంటే చెన్నై లేదా హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లాలి. చెన్నై విషయం చూద్దాం. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఏ విమానంలో కూడా సీట్లు ఖాళీగా ఉండవు.
గల్ఫ్ ఏయిర్ వేస్, కువైట్ ఎయిర్ వేస్, శ్రీలంక ఎయిర్ ఇలా ఏ విమానయాన సంస్థను తీసుకున్నా, అన్ని రద్దీగానే ఉంటాయి. ఆ దేశాల నుంచి నిండుగా వచ్చే విమానాలు, అదే స్థాయిలో ప్రయాణికులతో తిరిగి వెళతాయి. ఇందులో రాయలసీమలోని కడప, చిత్తూరు జిల్లాల నుంచి ఉపాధి కోసం వెళ్లే వారు, తిరిగి వచ్చే వారితో అన్ని విమానాలు రద్దీగానే ఉంటాయి. వీటికి తోడు రాయలసీమలో కడప, కర్నూలు తోపాటు పుట్టపర్తి సమీపంలోని శ్రీసత్యసాయి ప్రయివేటు డొమెస్టిక్ విమానాశ్రయం కూడా సేవలు అందిస్తోంది.
"ఇక్కడి నుంచి అంతర్జాతీయ విమానాలు నడిపితే.. శ్రీవారి దర్శనమే కాదు. గల్ఫ్ తోపాటు విదేశాల్లో ఉన్న ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగం. ఆదాయం పెరగడం తోపాటు, స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి" అని తిరుపతి వైసీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. రేణిగుంట విమానాశ్రయానికి విమానాలు నడపడానికి ఆ సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు సాగించకుండా, ప్రయివేటుకు అప్పగించడానికే మొగ్గు చేపుతున్నారని ఎంపీ గురుమూర్తి ఆరోపించారు.
ఆదాయం నెపం...
రేణిగుంట విమానాశ్రాయానికి దేశీయంగానే విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మినహా, అంతర్జాతీయ సర్వీసులు రాకపోకలు సాగించే ఆధునిక సాంకేతిక వ్యవస్థ, వనరులు ఉన్నా, నిర్లక్ష్యానికి గురవుతోంది. నిర్వహణకు అయ్యే ఖర్చుకు ఆదాయానికి కేంద్ర విమానయాన శాఖ లంకె పెడుతోంది.
"ప్రస్తుతం ఉన్న అన్ని హంగుల నేపథ్యంలో అంతర్జాతీయ విమానయాన సంస్థలు క్రాఫ్టులు నడిపితే, ప్రయాణికులు, కార్గొ సేవలతో రేణగుంట విమానాశ్రాయం ఏపీలోని కేంద్రాలే కాదు. పొరుగు రాష్ట్రాలకు మించి ఆదాయం రావడం. స్థానికంగా ఉద్యోగ, ఉపాధి మెరుగుపడతాయి" అని సీపీఎం నేత కందారపు మురళీ వ్యాఖ్యానించారు.
ఎందుకు నడవడం లేదు
రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం శ్రీవారి యాత్రికులకే కాదు. పారిశ్రామికవేత్తలకు కూడా ఉపయోగంగా ఉంది. నిత్యం వీఐపీ, వీవీపీలకు కేంద్ర బిందువుగా మారిన ఈ విమానాశ్రయం ఆ శాఖ కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మాటల్లో చెప్పాలంటే ఏపీకి ప్రధాన ద్వారా, తిరుమలకు మహద్వారం లాంటిదే. ఇక్కడి నుంచి అంతర్జాతీయ విమానాలు ఎగరడానికి జెండా ఊపడానికి మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఆదాయానికి, నిర్వహణ వ్యయానికి పోలిక లేదనేది విమానయాన మంత్రిత్వ శాఖ చెబుతున్న మాట.
వాణిజ్యపరమైన గిరాకీ
ఎయిర్‌లైన్స్ సంస్థలు (Airlines) ఒక మార్గంలో విమానాలు నడపడానికి ప్రాథమికంగా లాభదాయకతను, ప్రయాణికుల సంఖ్యను చూస్తాయి. తిరుపతికి సమీపంలోనే చెన్నై (Chennai) అంతర్జాతీయ విమానాశ్రయం (సుమారు 100 కి.మీ), బెంగళూరు విమానాశ్రయం అందుబాటులో ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు, ఎన్.ఆర్.ఐ (NRI)లు నేరుగా ఈ ప్రధాన నగరాలకు చేరుకుని, అక్కడి నుండి రోడ్డు లేదా రైలు మార్గంలో లేదా డొమెస్టిక్ కనెక్టింగ్ ఫ్లైట్స్ ద్వారా తిరుపతికి వస్తున్నారు.
అంతర్జాతీయ నెట్‌వర్క్ కలిగిన విమానయాన సంస్థలు నేరుగా తిరుపతికి డైరెక్ట్ సర్వీసులు ప్రారంభించడానికి అవసరమైన ప్రయాణికుల రద్దీ స్థిరంగా ఉండకపోవచ్చనే అంచనాతో ముందుకు రాకపోవడం లేదనే మాటలు విమానాశ్రయ అధికారుల నుంచి వినిపిస్తోంది.
ఇదే వాస్తవమైతే.. 40 కిలోమీటర్ల దూరంలో విశాఖ ఏయిర్ పోర్టు ఉంటే, భోగాపురం పరిస్థితి కూడా అదే కదా అని బేరీజు వేస్తున్నారు.
రేణిగుంటలో ఏ సదుపాయాలు ఉన్నాయి?
తిరుపతి గరుడ టెర్మినల్‌లో ఇమిగ్రేషన్ కౌంటర్లు, కస్టమ్స్ చెకింగ్, ఫారిన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) విభాగాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినా, విమానాలు నడవకపోవడంతో ఇవి పూర్తిస్థాయి వినియోగంలో లేవు. ఇక్కడ ఆధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC ) సెంటర్, రన్‌వే సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. పెద్ద విమానాలు (Code-E టైప్ aircrafts) కూడా ల్యాండ్ అయ్యేలా రన్‌వే పొడవు పెంచారు. కార్గో (Cargo): డొమెస్టిక్ కార్గో (Domestic Cargo) హ్యాండ్లింగ్ అందుబాటులో ఉంది. అంతర్జాతీయ కార్గో ప్రాసెసింగ్ సదుపాయాలకు ఫుల్-స్కేల్ ఆపరేషన్లు, ఏజెన్సీ అనుమతులు మరింత పెరగాల్సి ఉంది.
డొమెస్టిక్ సర్వీసులు
తిరుపతి నుంచి రోజువారీగా ప్రధాన నగరాలకు సర్వీసులు నడుస్తున్నాయి. హైదరాబాద్ (HYD), బెంగళూరు, విజయవాడ , శాఖపట్నం , రాజమండ్రి, న్యూఢిల్లీ, శివమొగ్గ, నవీ ముంబై నగరాల మధ్య వారంలో 14 విమాన సర్వీసులు మూడు రోజులు 13 విమానాల రాకపోకలు సాగిస్తున్నాయి. వీటికి అదనంగా ఆధ్మాత్మిక, పర్యాటకానికి మరింత ఊతం ఇచ్చే విధంగా ముంబై, అహ్మదాబాద్, కోల్ కతా, అలహాదాబాద్, మధురై తిరువనంతపురం విమానాశ్రయాల నుంచి తిరుపతి మధ్య విమాన సర్వీసులు నడపడానికి కూడా కార్యాచరణ సిద్ధం చేశారు.
Next Story

