కరువు రాగంపై రాజకీయ తాళం: 'సీమ'ను వణికిస్తున్న వర్షాభావం
అనంతపురంలో ఆరు లక్షల ఎకరాల్లో నిలిచిన సాగు. బీమా ప్రీమియం భారం.
సూపర్ ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితిలో రాయలసీమలో కరువు పంజా విసిరింది. ఆకాశం వైపు చూస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది. రుతుపవనాలు మందగించి, వర్షాలు ముఖం చాటేశాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యానవన పంటల వాతావరణ బీమా చేయించే గడువు శుక్రవారంతో ముగిసింది. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రీమియం ప్రభుత్వమే చెల్లించింది. ఇప్పటి టీడీపీ కూటమి ప్రభుత్వం కష్టల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు ఆ విధంగా సమకారం అందించడం లేదని వైసీపీ నిలదీస్తోంది.
ఒక్క అనంతపురం జిల్లాలోనే ఈ ఖరీఫ్ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 8 లక్షల 48 వేల ఎకరాలు. కానీ, ఇప్పటివరకు సాగైంది కేవలం 2 లక్షల 59 వేల ఎకరాలు మాత్రమే! అంటే దాదాపు 6 లక్షల ఎకరాల్లో పంటలు అసలు సాగుకే నోచుకోలేదు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే, నాయకులు మాత్రం పరామర్శలు, టెంకాయల రాజకీయాల్లో మునిగిపోయారు!
ఖరీఫ్ సాగు గడువు ముగిసి..
రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా వేరుశెనగ పంటనే వర్షాధారంగా లక్షలాది ఎకరాల్లో సాగు చేస్తారు. సాధారణంగా జూలై నెలాఖరుతో ఖరీఫ్ విత్తనాల వేత గడువు ముగుస్తుంది. అదును దాటిన తర్వాత ఎంత వర్షం కురిసినా రైతులకు పెద్దగా ఉపయోగం ఉండదు. భూమి ఆరిపోయి విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేదు.
అనంతపురం జిల్లా ఓ ఉదాహరణ
ఈ ఖరీఫ్ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 8.48 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 2.59 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. అంటే దాదాపు 6 లక్షల ఎకరాల్లో సాగు అసలు ప్రారంభమే కాలేదు.
ఉద్యానవన పంటల బీమా రగడ
వాతావరణ ఆధారిత ఉద్యానవన పంటల బీమా నమోదు గడువు జూలై 31తో ముగిసింది. అయితే, ఈ ప్రీమియంను రైతులే సొంతంగా చెల్లించాలని అధికారులు ప్రచారం చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తమ హయాంలో బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతులకు సహాయం అందించకుండా వారి నెత్తిన భారాలు రుద్దుతోందని వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రైతుల గోడు వదిలేసి.. పొలిటికల్ గేమ్స్!
పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే, అధికార-ప్రతిపక్ష పార్టీలు మాత్రం తమ సొంత రాజకీయ మైలేజ్ కోసమే తాపత్రయపడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార టీడీపీ 'రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి సంక్షేమం' పేరుతో ఇంటింటి ప్రచారాలు, శంకుస్థాపనలు, టెంకాయలు కొట్టే కార్యక్రమాలు, పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తున్న నేతలను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు.
ప్రతిపక్ష వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ మాత్రం.. కేసులు ఎదుర్కొని జైళ్లకు వెళ్లిన నేతల కుటుంబాలను పరామర్శించడం, బలప్రదర్శనలు నిర్వహించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే హంద్రీ-నీవా కాలువ లైనింగ్ పనులపై వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు ర్యాలీలు నిర్వహించగా, మరుసటి రోజే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దానికి కౌంటర్ పర్యటనలు చేశారు. కడప జిల్లా రాజంపేట వద్ద చెయ్యేరు నదిలో అక్రమ ఇసుక తోడకాలపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర పరస్పర ఆరోపణలు సాగాయి.
"గండికోట ప్రాజెక్టు నుంచి కాలేటి వాగు ద్వారా సాగునీరు అందిస్తే రాయచోటి ప్రాంతానికి మేలు జరుగుతుంది" అని వైసీపీ మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సూచించారు.
ఒకవైపు విత్తనాలు మొలకెత్తక, సాగునీరు అందక రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే.. నాయకులు మాత్రం పరామర్శలు, ఇసుక ఆరోపణలు, శంకుస్థాపనల చుట్టూనే రాజకీయాలు చేస్తున్నారు. కరువుతో అల్లాడుతున్న అన్నదాత కష్టాలపై కేవలం మొసలి కన్నీళ్లు కారుస్తున్న ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఎలాంటి తక్షణ ఉపశమన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
Next Story

