‘సొంతింటి’ సెగ: బాబు చేతిలో రిపోర్ట్ కార్డ్.. వైసీపీలో సమన్వయ ‘షాక్’!
ఒకే సమస్య.. వేర్వేరు సవాళ్లు: ఏపీలో కూటమి, వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వర్గపోరు!
రాష్ట్ర రాజకీయాల్లో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ 'సొంతింటి పోరు' ఎక్కువైంది. ఓ వైపు ఎన్నికల ఓటమి తర్వాత శ్రేణులను ఏకం చేసేందుకు వైసీపీ అధిష్ఠానం చేపట్టిన ఇన్ ఛార్జిల నియామక ప్రయోగాలు వికటిస్తుంటే, మరోవైపు అధికారంలోకి వచ్చినా టీడీపీ-జనసేన నేతల మధ్య వర్గ పోరు, ప్రజాప్రతినిధులపై వస్తున్న ఆరోపణలు కూటమికి పెద్ద తలనొప్పిగా మారాయి. వాటికి తోడు జనసేన మాజీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యానించినట్లుగా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ ప్రశ్నలు జనసేనను ఆత్మరక్షణలో పడేసినట్లు కనిపిస్తోంది.
తీరుమారదా..?
అధికారంలోకి వచ్చి కొన్ని నెలలు కావస్తున్నా పలువురు టీడీపీ ఎమ్మెల్యేల తీరు మారకపోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి ఆరోపణలు, నియోజకవర్గాల్లో కూటమి నేతల సమన్వయంపై సమగ్ర ప్రగతి నివేదికలు చంద్రబాబు చేతికి చేరాయి. పనితీరు మెరుగుపడని, వివాదాల్లో చిక్కుకున్న ఎమ్మెల్యేలకు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరికలు వెళ్లాయి.
"భవిష్యత్తులో టికెట్లు, పదవుల కేటాయింపులో ఈ రిపోర్టులే కీలక ప్రామాణికం" అని కూడా సీఎం చంద్రబాబు పదేపదే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా, అధికార కూటమిలో ఆధిపత్య పోరు ఎక్కువ అవుతోంది. బహిరంగంగానే ఘర్షణలు పడుతున్నారు. దీంతో జనసేన, టీడీపీ నేతల మధ్య సమన్వయ లోపంతో పాటు పార్టీ అంతర్గత విబేధాలు రచ్చకెక్కుతున్నాయి.
ఇదే నిదర్శనం
చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో టీడీపీ సమన్వయకర్త మార్పుపై వర్గాలు బాహాబాహీకి దిగగా, తంబళ్లపల్లెలో సస్పెండ్ అయిన నేతలు, మాజీ ఎమ్మెల్యే వర్గీయుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న ఘటనలే నిదర్శనం. అనంతపురం అర్బన్ లో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గుంతకల్లులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, జితేంద్ర గౌడ్ ల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది.
జనసేనలో 'బొలిశెట్టి' మాటల కలకలం...
సోషల్ మీడియా వేదికగా జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కూటమి సమన్వయాన్ని ప్రశ్నించేలా ఉండటంతో జనసేన డిఫెన్స్ లో పడింది.
ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో జనసేన సీనియర్ నేత బాలినేని శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ మధ్య బహిరంగ యుద్ధం నడుస్తోంది. ఈ ఎపిసోడ్ లో బొలిశెట్టి వ్యాఖ్యలు జనసైనికులను ఉలికి పాటుకు గురి చేశాయి.
"నియోజకవర్గాల వారీగా నామినేటెడ్ పదవుల కేటాయింపుపై పారదర్శకంగా శ్వేతపత్రం విడుదల చేయాలని, ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తే 'కూటమి ధర్మం' నెరవేరదు" అని బొలిశెట్టి సత్యనారాయణ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో కార్యకర్తల ఆవేదన ఆవిష్కరించే విధంగా జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఘాటుగా స్పందించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
"కూటమి విజయం ఊరకే రాలేదు.. దాని వెనుక రక్తం, చెమట చిందించిన వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు" అని బొలిశెట్టి వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూటమి అధికారంలోకి వచ్చినా క్షేత్రస్థాయి కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం, గుర్తింపు దక్కడం లేదని ఆయన గుర్తు చేశారు.
వికటిస్తున్న ప్రయోగాలు..
ఇదిలా వుంటే... వైసీపీలో 'ఇన్ ఛార్జ్' ప్రయోగాలు.. వికటిస్తున్న గ్రూపులను చక్కదిద్దడానికి పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా వైసీపీ చీఫ్ జగన్ జిల్లాల వారీగా సమీక్షలు జరుపుతున్నప్పటికీ, ప్రాంతీయ సమన్వయకర్తల నిర్ణయాలు క్షేత్రస్థాయి కేడర్ కు మింగుడుపడటం లేదు.
దీనికి నిదర్శనం నెల్లూరు జిల్లా గూడూరు లో ఎంపీ మిథున్ రెడ్డి ఏకపక్షంగా ఇన్ ఛార్జిలను రుద్దారంటూ స్థానిక కేడర్ తిరుగుబాటు బావుటా ఎగరవేసింది. గూడూరులోని ఐదు మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు కొత్త నియామకాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. నగరి, సత్యవేడు, జీడీ నెల్లూరు స్థానాల్లో పాత, కొత్త వర్గాల మధ్య తీవ్ర వైషమ్యాలు నెలకొన్నాయి.
అనంతపురం జిల్లాలో మడకశిర, పెనుగొండ, కల్యాణదుర్గం వంటి నియోజకవర్గాల్లో నేతలు తీసుకున్న నిర్ణయాల వల్ల సీనియర్ల అసంతృప్తి వైసీపీని వెంటాడుతోంది. ఒకవైపు ఎమ్మెల్యేల అవినీతి, వర్గపోరును అణచివేసేందుకు చంద్రబాబు సర్వే నివేదికలతో కఠిన చర్యలకు సిద్ధమవుతుంటే, మరోవైపు దెబ్బతిన్న కేడర్ ను నిలబెట్టుకోవడానికి వైసీపీకి సరైన రీజినల్ సమన్వయం కొరవడినట్లు భావిస్తున్నారు. పరిస్థితి అధికారంలోని కూటమికీ, ప్రతిపక్ష వైసీపీకి కూడా అనివార్యంగా మారింది.
Next Story

