రాయలసీమలో రాచరిక పాలనకు చెరగని జ్ఞాపకాలుగా మిగిలిన కోటల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్యాత్మిక, పర్యాటక విధానం చారిత్రక ప్రదేశాల ఉనికిని కాపాడుతోంది. చరిత్ర వారసత్వ సంపదకు ఉత్సవాల రూపంలో ప్రభుత్వం మెరుగులు దిద్దుతోంది. అందులో భాగంగానే శతాబ్దాల కాలంగా రాళ్లగుట్టల మధ్య రాజఠీవిని ప్రదర్శించే గుత్తి కోట (Gooty Fort ) ఉత్సవాలు ఈ నెల 14 నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. దీనికి అనంతపురం జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ ఉత్సవాల నిర్వహణకు గత ఏడాది ఏపీ టూరిజం శాఖకు 50 లక్షల రూపాయల కూడా కేటాయించింది.
అనంతపురం జిల్లా గుత్తి రైల్వే జంక్షన్ కు సమీపంలోని గుత్తి కోట ఉత్సవాల ప్రచార పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆవిష్కరించారు.
"ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయండి. ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించండి" అని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ దిశా నిర్దేశం చేశారు.
అనంతపురం జిల్లా పర్యాటక శాఖ గుత్తి కోట వద్ద పర్యాటక అభివృద్దికి 80 లక్షల రూపాయలతో పంపిన ప్రతిపాదనలు ఏడాదిగా ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వీటికి ఆమోదముద్ర పడితే, పర్యాటకులను మరింతగా ఆకర్షించడానికి ఆస్కారం ఉంటుందనేది స్థానికుల అభిప్రాయం.
గుత్తి కోట ఉత్సవాల్లో జానపద, గ్రామీణ కళాకారులకు ప్రాధాన్యత ఇస్తామని జిల్లా పర్యాటక శాఖ అధికారి జయకుమార్ బాబు చెప్పారు.
"కూచిపూడి, క్లాసికల్ డ్యాన్స్, సాహస క్రీడలకు కూడా చోటు కల్పిస్తాం. రాజుల కాలం నాటి వ్యవహారాలను కళారూపాల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు.
కోటపైకి ఎలా ...
గుత్తి పట్టణంలోని కోట ప్రవేశ ద్వారం నుంచి 300 అడుగుల ఎత్తులో ఉన్న కోటపైకి వెళ్లాలంటే కాలినడక మాత్రమే ఉంటుంది. సొంత వాహనాలపై వెళ్లడానికి కాస్త కష్టతరంగానే ప్రయాణం చేయాలి. గుత్తి కోటను చాళుక్యుల కాలంలో నిర్మించాలని చరిత్ర చెబుతుంటే విజయనగర సామ్రాజ్యంలో దీనిని మరింత పటిష్ట పరిచినట్లు శాసనాలు అందుబాటులో ఉన్నాయి, అది కూడా సంస్కృతం, మరాఠీ భాషలో ఉన్నట్లు గుర్తించిన పరిశోధకులు ఇవి ఏడవ శతాబ్దం కాలం నాటి అని అంచనా వేశారు.
ఎవరి పాలన ఎలా సాగింది..
గుత్తి కోటను విజయనగర రాజుల పాలనానంతరం కుతుబ్షా ఆధీనంలోకి తీసుకున్నారు. 1746లో మరాఠీ ఆర్మీ జనరల్ మురారి రావు గోరపడే ఈ కోటను ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అయితే, 8 సంవత్సరాల తర్వాత 1775లో మైసూర్ పాలకుడు హైదర్ అలీ ఈ కోటను చుట్టుముట్టారు. 2 నెలలు మురారీ రావు లొంగిపోయాడు. ఆ తర్వాత కోట ఈ స్టిండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చింది. దీనితో కోట ప్రాభవం ముగిసింది. తిరుగుబాటుదారులను నిర్బందించేందుకు ఈస్టిండియా కంపెనీ కోటను ఒక జైలుగా మార్చింది. ప్రస్తుతం ఈ గుత్తి కోట పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.
గుత్తి కోట ప్రస్తుతం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ( Archaeological Survey of India ASI ) పరిధిలో ఉంది. చెదురుతున్న శిధిలాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరాన్ని గుత్తి కోట సంరక్షణ సమితి నేత విజయ భాస్కర చౌదరి గుర్తు చేశారు.
గుత్తి కోటపై అద్భుతాలు..
గుత్తి కోట అంటే కొన్ని వందల అడుగులు కాలిబాటలో పైకి చేరుకుంటే అసలు కొండపై ఉన్న ధ్యాస కలగదు. కొండపై విశాలమైన చదునుగా ఉన్న ప్రదేశంలో 108 బావులు తవ్వించారనేది స్థానికుల కథనం. ప్రస్తుతం పది బావుల వరకు కనిపిస్తున్నాయని చెప్పారు.
రాయలసీమలో అనంతపురం జిల్లా అంటే కరువుకు నిలయం. భూగర్భ జలాలు అడుగంటి ఉంటాయి. గుత్తి ప్రాంతంలో మాత్రం దాదాపు 150 నుంచి 200 అడుగుల లోపల భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయనేది భూగర్భ పరిశోధకులు చెప్పే మాట. 680 మీటర్ల ఎత్తులో ఉన్న గుత్తి కోటకొండపై గమనిస్తే 150 అడుగుల లోపల భూగర్భ జలాలు పైకి రావడం అనేది ఈ కొండలకు ఉన్న ప్రత్యేకత.
గుత్తి కోటపై వేసవిలోనూ చల్లదనం సేదదీరుస్తుంది. ఊడిపడిన రాళ్లు మొండి గోడలు తాకిన చల్లగానే కనిపిస్తాయి. కొండపైకి వెళ్లాక గుర్రపు శాల భవనం చతురస్కారంలో అంటే సి ఆకారంలో అద్భుతమైన కట్టడం గా కనిపిస్తుంది. ఈ గోడలకు ఉన్న రంధ్రాల నుంచి చూస్తే శత్రుజాడలు సునాయాసంగా కనిపెట్టే వారిని చరిత్రకారులు చెబుతారు.
గుత్తి కోట పైన గుప్త నిధులు దాచే గది కూడా ఉంది. ఇక్కడి తవ్వకాలు చూస్తే నిద్ర కోసం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. రాజుల కాలంలో ఈ కోట గోడలకు డోర్ లాక్ సిస్టం చాలా పగడ్బందీగా ఉండేది. భవన ముఖద్వారానికి ఒకవైపు గోడలు రాతి డోర్ లాక్ ఇప్పటికీ నాటి చరిత్రను గుర్తు చేసేందుకు చిహ్నం గా కనిపిస్తుంది.
గుత్తి కోటకు గతంలో 50 అడుగుల దూరం వరకు విశాలంగా ఉండేది. ఇళ్లు, ఇతర నిర్మాణాలు కోట గోడను ఆనుకుని నిర్మించడం వల్ల చరిత్ర మరుగున పడిపోతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని గుత్తి ప్రాంతానికి చెందిన ఓ జర్నలిస్టు అభిప్రాయపడ్డారు.
అద్భుతమైన నిర్మాణం..
గుత్తి కోట సముద్రమట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపై నిర్మించారు. ఈ కొండపై మైదానం కంటే దాదాపు 300 మీటర్ల ఎత్తులో భవనాలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. ఈ కోట గోడలను నల్ల గుల్ల, శంఖము, గవ్వ ( సెల్ఫ్ ఆకారంలో 15 బురుజులతో 15 ముఖద్వారాలకు ఏర్పాటు చేయడం ద్వారా నిర్మాణం చేశారు. ఈ కోట ద్వారానికి ఎదురుగా రెండు పురాతన ఉక్కు ఫిరంగులు పహారా కాస్తున్నట్లు ఆనాటి రాచరిక వ్యవస్థలో భద్రతను గుర్తుచేస్తాయి. ఈ కోటలో పశ్చిమ కొండ వైపు రెండు భవనాలు కనిపిస్తాయి. ఇందులో ఒకటి ధాన్యాకారం మరొకటి గన్ పౌడర్ నిర్వహించడానికి అవసరమైన గది శిథిలమైన నరసింహ స్వామి ఆలయం శిఖరం దగ్గర చూడవచ్చు. వ్యాయామశాల కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.
గుత్తి కోటను మరాఠీ ఆర్మీ జనరల్ మురారి రావు గోర్పడే ఆధీనంలో ఉండేదని చెప్పడానికి చారిత్రక గుర్తుగా ఇప్పటికీ 300 మీటర్ల ఎతైన కొండపై మురారి రావు గద్దె అనే ఒక చిన్న కూడా ఉంది. ఈ ప్రదేశానికి వెళితే గుత్తి పట్టణమంతా కళ్ళముందు కనువిందు చేస్తుంది. ప్రస్తుతం కోటపై శిధిల భవనాలు చరిత్రగా ఆనవాళ్లుగా నిలిచి ఉంటే వీటిని ఈస్ట్ ఇండియా కంపెనీలో అధికారిగా పనిచేసిన థామస్ మన్రో జైలుగా కూడా ఉపయోగించారనేది చరిత్రకారులు చెబుతున్న మాట.
ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన గుత్తి కోట ఉత్సవాలపై ఏపీ టూరిజం శాఖ అనంతపురం జిల్లా అధికారి జయకుమార్ బాబు ఇంకా ఏమి చెప్పారంటే..
"కోటకు సమీపంలో పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే, ప్యాకేజీ టూర్లకు ఆస్కారం ఉంటుంది. పర్యాటకులకు కోట వద్ద సదుపాయాలు కల్పించవచ్చు" అని జయకుమార్ బాబు చెప్పారు కోటకు సమీపంలో 79 సెంట్లు, మరో చోట 52 సెంట్లు రెవెన్యూ స్థలం అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. ఇక్కడ హరిత రెస్టారెంట్, అతిథి గృహాల ఏర్పాటుకు అనువైన ప్రదేశం ఉందని ఆయన వివరించారు.
"కోట వద్దకు పర్యాటకుల తాకిడి గాబానే ఉంది. వారంలో కనీసంగా 600 మంది వస్తున్నారు. గుత్తి వద్ద మంగే రమేశ్ అనే వ్యక్తిని గైడ్ గా అందుబాటులో ఉంచాం" అని జిల్లా పర్యాటక అధికారి జయవర్ధనబాబు తెలిపారు.
మన్రోను మరిచారు..?
ఏ ఉత్సవం, కార్యక్రమం అయినా సరే, జిల్లా కలెక్టర్ సారధ్యంలో నిర్వహించడం సహజం. వారసత్వ సంపద చరిత్ర విద్యార్థులకు అందించడానికి గుత్తి కోట ఉత్సవాల నిర్వహణకు సన్నద్ధం అవుతున్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలు ప్రధానంగా రైతాంగానికి మేలు చేసిన బ్రిటీష్ అధికారిని మాత్రం మరిచినట్లే కనిపిస్తోంది.
దేశాన్ని బ్రిటీషర్లు కొల్లగుట్టారు. రాయలసీమలో శాంతిభద్రతలు నెలకొల్పడంతోపాటు రైత్వారీ వ్యవస్థ ద్వారా రైతులకు భూమిపై హక్కులు కల్పించిన బ్రిటీష్ కలెక్టర్ సర్ థామస్ మన్రో ప్రజలతో భూదేవుడిగా ప్రసంశలు అందుకున్నారు. 1827 జూలై ఆరో తేదీ కలరా వ్యాధితో మరణించిన ఆయన భూతికకాయాన్ని గుత్తిలోని యూరోపియన్ శ్మశానవాటికలోనే ఖననం చేసిన సమాధి కూడా ఇక్కడ చిరస్మరణీయ స్థలాల్లో ఒకటిగా ఉంది.
200 ఏళ్ల కిందటే 2,06,819 మంది దున్నేవారికే పట్టాలు ఇచ్చిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిన మన్రో సమాధి గుత్తిలో సందర్శకులు, చరిత్రకారులను ఆకర్షిస్తోంది. ఈ ప్రదేశాన్ని కూడా పర్యాటక జాబితాలో చేర్చాలని గుత్తి ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
గుత్తికి ఎలా చేరుకోవాలంటే..
అనంతపురం నుంచి 52 కిలోమీటర్ల దూరంలో గుత్తి పట్టణం ఉంది. ఇక్కడి ఆర్టీసీ బస్టాండ్ నుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే కోట ప్రవేశమార్గం వద్దకు చేరుకోవచ్చు. తిరుపతి నుంచి హైదరాబాద్, ముంబై వెళ్లే రైళ్లలో గుత్తి జంక్షన్ లో దిగవచ్చు. బెంగళూరు మార్గంలో వచ్చే కొన్ని రైళ్లు ఈ మార్గంలోనే ప్రయానిస్తాయి.
గుత్తి పట్టణానికి అనంతరం, తిరుపతి నుంచి బస్సులు ఉన్నాయి. కర్నూలు నుంచి అనంతపురం వెళ్లే మార్గంలో గుత్తి బస్టాండుకు చేరవచ్చు.