ఈల వేసి గోల చేసిన ఈ దళపతి విజయ్ ఎవరు? ఏమా కథ!!
x

'ఈల' వేసి గోల చేసిన ఈ 'దళపతి' విజయ్ ఎవరు? ఏమా కథ!!

ఆవేళ ఎంజీ రామచంద్రన్.. ఇవాళ 'ఇళయ థళపతి'.. ఇద్దరూ ఇద్దరే.. సునామీ సృష్టించిన వారే.


తమిళ తీరాన్ని ఓ సునామీ తాకింది. తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త తార వెలిసింది. ఆవేళ ఎంజీ రామచంద్రన్.. ఇవాళ 'ఇళయ థళపతి'.. ఇద్దరూ ఇద్దరే.. సునామీ సృష్టించిన వారే. పార్టీ పెట్టిన అనతికాలంలోనే అధికారానికి చేరువయ్యారు. ఇంతకీ ఎవరీ ఇళయ థళపతి? ఏమిటా కథ!?.. ఇక్కడ చూద్దాం.

నేడు రాజకీయాల్లో 'దళపతి'గా ప్రభంజనం సృష్టిస్తున్న జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ జీవితం ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) ద్వారా ఆయన సాధించిన విజయం, దశాబ్దాల నాటి ద్రావిడ రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చేసింది. ద్రావిడ అనే పేరు లేకుండానే ప్రబంజనం సృష్టించడం విజయ్ ప్రత్యేకత.
పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ప్రముఖ సినీనటుడు. 1974 జూన్ 22న చెన్నైలో పుట్టారు. ఆయన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్. ఆయనా ప్రముఖ తమిళ సినీ దర్శకుడే. తల్లి శోభా చంద్రశేఖర్. నేపథ్య గాయని, కర్ణాటక సంగీత విద్వాంసురాలు. విజయ్ తండ్రి క్రైస్తవుడు, తల్లి హిందువు. మతాంతర వివాహం. విజయ్ ఒక రోమన్ కాథలిక్ కుటుంబంలో పెరిగారు. విజయ్ తండ్రి ఒక సందర్భంలో, "నేను క్రైస్తవుడిగా పుట్టాను, నా భార్య హిందువు. మా ఇంట్లో అన్ని మతాల పండుగలను జరుపుకుంటాం" అన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
విజయ్ ని కుంగదీసిన సోదరి మరణం..
విజయ్ జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఆయన సోదరి విధ్య మరణం. ఆమె తన రెండవ ఏటనే అనారోగ్యంతో మరణించింది. ఈ ఘటన విజయ్‌ను తీవ్రంగా కుంగదీసింది. అప్పటివరకు చాలా చురుగ్గా ఉండే విజయ్, సోదరి మరణం తర్వాత చాలా మౌనంగా, గంభీరంగా ఉండేవారని ఆయన తల్లి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

తన తండ్రి దర్శకత్వంలోనే 1984లో 'వెట్రి' సినిమాతో బాలనటుడిగా పరిచయమయ్యారు. 18 ఏళ్ళ వయసులో 1992లో 'నాళయ తీర్పు' సినిమాతో హీరోగా మారారు. ఆరంభంలో విజయ్ తన రూపం, నటనపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ మొక్కవోని దీక్ష ఆయనది. చెక్కుచెదరకుండా ముందుకు సాగారు.
'పూవే ఉనక్కాగ', 'కాదలుక్కు మరియాదై', 'గిల్లి', 'తుపాకి' వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. హిందీ సహా వివిధ భాషాల్లో ఆయన నటించారు.
కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు..
విజయ్ జీవితంలో కొన్ని ఒడిదుడుకులూ లేకపోలేదు. 1999లో సంగీత సోర్నలింగంను వివాహం చేసుకున్నారు. ఆమె శ్రీలంక తమిళ వ్యాపారవేత్త కుమార్తె. విజయ్‌కు వీరాభిమాని. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు జాసన్ సంజయ్. సినిమా మేకింగ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. కుమార్తె దివ్య సాషా.
2026 ప్రారంభంలో విజయ్, సంగీత విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హోరెత్తాయి. అదో సంచలనం. పరస్పర విభేదాల కారణంగా వారు విడివిడిగా ఉంటున్నారని ప్రచారం జరిగింది. దీనిపై విజయ్ అధికారికంగా స్పందించలేదు.
విజయ్ తన భార్య సంగీతతో విడిపోయారని, వారిద్దరి మధ్య సినీనటి త్రిష ప్రవేశమే విభేదాలకు కారణమని తమిళ మీడియా కోడై కూసింది.
2024-25లో జరిగిన విజయ్ కుటుంబ వేడుకల్లో సంగీత కనిపించకపోవడం ఈ అనుమానాలను మరింత బలాన్ని ఇచ్చింది. సూపర్ స్టార్‌గా, కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి ప్రత్యర్థి పార్టీలు ఈ 'త్రిష' ఇష్యూను ఆయుధంగా వాడుకున్నాయి.
సరిగ్గా ఈ సమయంలోనే పార్టీ పేరుపై తండ్రితో విభేదాలు వచ్చాయి. 2020లో విజయ్ పేరుతో తన తండ్రి 'ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్' అనే రాజకీయ పార్టీని ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేశారు. ఈ విషయంలో విజయ్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన తల్లిదండ్రులతో సహా 11 మందిపై చెన్నై కోర్టులో సివిల్ దావా వేశారు. తన పేరుతో సమావేశాలు నిర్వహించకూడదని, తన అభిమానులను తప్పుదోవ పట్టించకూడదని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల తండ్రీకొడుకుల మధ్య దూరం పెరిగింది.

"నా పేరును గానీ, ఫోటోలను గానీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడకూడదు" అని స్వయంగా తండ్రిపైనే కేసు వేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే, మొన్నిటి ఎన్నికల విజయం తర్వాత తండ్రి ఎస్.ఏ.సి. తన కుమారుడి విజయాన్ని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. తన కుమారుడు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారని ప్రకటించడం మరో మలుపు.
విజయ్ తన పార్టీ టీవీకే (TVK) సిద్ధాంతాలను లౌకికవాదం, సామాజిక న్యాయం, అంబేద్కర్, పెరియార్, కామరాజ్ వంటి నాయకుల అడుగుజాడల్లో నడుస్తామని ప్రకటించారు. ఈ సిద్ధాంతాలు కాంగ్రెస్ భావజాలానికి దగ్గరగా ఉండటంతో భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టవచ్చునని భావిస్తున్నారు.
విజయ్ బీజేపీని తన 'సైద్ధాంతిక శత్రువు'గా ప్రకటించారు. ఈ క్రమంలో బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చకుండా, కాంగ్రెస్‌తో చేతులు కలపడం వ్యూహాత్మకంగా మేలని ఆయన భావించారు.
మొత్తానికి, తండ్రి తనను ఒక 'బొమ్మ'లా వాడాలని చూశారని విజయ్ అప్పట్లో విభేదించగా, ఇప్పుడు స్వయంగా తన పార్టీని స్థాపించి, సొంత వ్యూహాలతో అధికారం వైపు వెళ్లే క్రమంలో కాంగ్రెస్‌ను ఒక మిత్రపక్షంగా చూస్తున్నారు.
టీవీకే ఎన్నికల ప్రభంజనం సృష్టించింది. 2024 ఫిబ్రవరిలో రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్, సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారారు.
ముఖ్యంగా Gen Z, మొదటిసారి ఓటు వేసే యువత విజయ్ వైపు మొగ్గు చూపారు. మే 2026 ఎన్నికల ఫలితాల్లో 106కు పైగా స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించి, డిఎంకె, అన్నాడిఎంకె వంటి దిగ్గజ పార్టీలకు గట్టి పోటీనిస్తూ అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగారు.
విజయ్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరు. ఆయన ఆస్తుల విలువ దాదాపు ₹450 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
చెన్నై నీలాంకరైలో ఆయనకు అత్యంత విలాసవంతమైన ఇల్లు ఉంది. ఇది అమెరికాలోని 'టామ్ క్రూజ్' ఇంటి నమూనాలో ఉంటుంది.
ఏదిఏమైనా, విమర్శలను ధీటుగా ఎదుర్కుంటూనే సాగిన విజయ్ ప్రయాణం వెండితెర నుండి అసెంబ్లీ వరకు ఒక అద్భుతం. యువతకు స్ఫూర్తి. క్రమశిక్షణ, నిబద్ధతకు మారుపేరు. ఇవే ఆయనను నేడు తమిళనాడు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి చేర్చాయి.
ఆల్ ది బెస్ట్ విజయ్.
Read More
Next Story