
కాల్పుల కేసు: ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఢిల్లీ నుంచి ఆయుధం తీసుకువచ్చిన మహిళలు
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల కేసులో ఢిల్లీ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. విదేశాల్లో ఉంటూ భారత్‌లో నేర కార్యకలాపాలను నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ పండిట్ ఆదేశాల మేరకు వీరు పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అరెస్టయిన వారిలో కునాల్ (21), సుమిత్ (19) హర్యానాలోని సోనీపట్‌కు చెందినవారు కాగా.. బబిత (23), రాధ (23) ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. వీరిని ట్రాన్సిట్ వారెంట్‌పై ముంబైకి తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ వివరాల ప్రకారం.. ఇటీవలే బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన కునాల్‌కు ఓ స్నేహితుడి ద్వారా అనిల్ పండిట్‌తో పరిచయం ఏర్పడింది. అమెరికాలో నివసిస్తున్న 32 ఏళ్ల పండిట్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలున్న వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ తర్వాత కునాల్ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ ద్వారా పండిట్‌తో సంప్రదింపులు జరిపేవాడని పోలీసులు తెలిపారు.
పండిట్ సూచనల మేరకు కునాల్, అతని సహచరుడు సుమిత్ అమృత్సర్ నుంచి ఓ పిస్టల్‌తో పాటు 20 రౌండ్ల బుల్లెట్లను సేకరించారు. సుమారు రెండు నెలల క్రితం రాధతో పరిచయం పెంచుకున్న కునాల్.. తన కార్యకలాపాల గురించి ఆమెకు వివరించి, ఆయుధంతో ముంబైకి వెళ్లాలని సూచించినట్లు అధికారులు వెల్లడించారు.
అక్టోబర్ 15న కునాల్.. రాధ, ఆమె స్నేహితురాలు బబితను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో దింపాడు. రాధ తన బ్యాగులో పిస్టల్‌ను దాచుకుని ప్రయాణించగా, కునాల్ ఎన్క్రిప్టెడ్ యాప్ ద్వారా వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పండిట్ నుంచి వచ్చిన సూచనలను చేరవేసేవాడని పోలీసులు తెలిపారు.
అక్టోబర్ 17న ముంబై చేరుకున్న రాధ, బబిత దాదర్‌లో రైలు దిగి ఓ హోటల్లో బస చేశారు. మరుసటి రోజు ఉదయం 11 గంటల సమయంలో అక్కడికి వచ్చిన ఓ మైనర్ బాలుడు వారి వద్ద ఉన్న బ్యాగును తీసుకెళ్లాడు.
అదే రోజు సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. కాల్పులకు పాల్పడిన వ్యక్తులు ముంబైలో చిక్కుకుపోయినట్లు అనిల్ పండిట్ కునాల్‌కు తెలియజేసి, వారిని అక్కడి నుంచి తప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు పోలీసులు వివరించారు.
దీంతో అక్టోబర్ 18న రాధ, బబిత దాదర్–హరిద్వార్ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. అనంతరం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కునాల్, సుమిత్‌లను సోనీపట్‌లో అరెస్ట్ చేశారు.
ఈ కేసులో నలుగురి పాత్రతో పాటు, విదేశాల నుంచి నేర కార్యకలాపాలను నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ పండిట్‌తో ఉన్న సంబంధాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

