
ఢిల్లీ- ముంబై హైవేపై ఘోర ప్రమాదం
ఎనిమిది మంది మధ్యప్రదేశ్ వాసుల మృతి
రాజస్థాన్లోని ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్వేపై ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లోతైన గుంటలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. కోటా జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాకు చెందిన వారు రాజస్థాన్లోని ఖాటు శ్యామ్ ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి భోపాల్ నుంచి బయలుదేరిన వీరు నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆలయానికి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎక్స్ప్రెస్వేపై ప్రయాణిస్తున్న సమయంలో వాహనం అదుపుతప్పి సుమారు 15 అడుగుల లోతున్న డ్రైనేజీలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైనేజీలో బురద, నీరు పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో క్రేన్ల సహాయంతో దెబ్బతిన్న వాహనాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు.
గాయపడిన వారిని కోటాలోని న్యూ మెడికల్ కాలేజీ ఆసుపత్రి, ఎంబీఎస్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

