యూసుఫ్ పఠాన్ కు భూ కేటాయింపులు చేసిన గుజరాత్ సర్కార్
x

యూసుఫ్ పఠాన్ కు భూ కేటాయింపులు చేసిన గుజరాత్ సర్కార్

14 ఏళ్లుగా నానుతున్న వివాదం


Click the Play button to hear this message in audio format

14 ఏళ్లుగా కొనసాగుతున్న భూమి వివాదంలో మాజీ క్రికెటర్, బెహరంపూర్ ఎంపీ యూసుఫ్ పఠాన్‌కు కీలక ముందడుగు లభించింది. వడోదరలోని ఆయన నివాసం పక్కన ఉన్న భూమిని కేటాయించేందుకు గుజరాత్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే, కేటాయింపు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. మున్సిపల్ కార్పొరేషన్ ఆమోదంతో పాటు భూమికి చెల్లించాల్సిన తుది మొత్తంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

వడోదరలోని తాండల్జా ప్రాంతంలో ఉన్న 978 చదరపు మీటర్ల స్థలాన్ని 99 ఏళ్ల లీజుపై తనకు కేటాయించాలని యూసుఫ్ పఠాన్ 2012లో కోరారు. దీనిపై వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ప్రక్రియ ప్రారంభించినా, 2014లో గుజరాత్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది.

ఈ భూమి వ్యవహారం 2024లో మరోసారి తెరపైకి వచ్చింది. స్థలాన్ని పఠాన్ ఆక్రమించుకున్నారనే ఆరోపణలతో మున్సిపల్ కార్పొరేషన్ ఖాళీ చేయించే చర్యలు చేపట్టింది. దీంతో ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, 2025 ఆగస్టు 21న ఆయన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీనిపై ఆయన డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేశారు.

2026 జూన్ 8న విచారణ సందర్భంగా, చట్టబద్ధంగా భూమి కేటాయింపు జరగకపోయినా, డబ్బులు చెల్లించకపోయినా ప్రభుత్వ స్థలం స్వాధీనంలో ఎలా ఉందని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో మున్సిపల్ అధికారుల పాత్రపైనా సందేహాలు వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఆగస్టు 31న యూసుఫ్ పఠాన్ తన అప్పీల్‌ను ఉపసంహరించుకున్నారు.

తాజాగా గుజరాత్ ప్రభుత్వం భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది. మొత్తం 978 చదరపు మీటర్ల స్థలంలో 500 చదరపు మీటర్లను నివాస అవసరాల కోసం ఉచితంగా, మిగిలిన 478 చదరపు మీటర్లను రాయితీ ధరకు కేటాయించాలని ప్రతిపాదించింది. ఈ భూమి విలువను సుమారు రూ.20.53 కోట్లుగా అంచనా వేశారు.

ప్రభుత్వ ఆమోదం లభించినప్పటికీ, వడోదర మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఈ ప్రతిపాదనను పరిశీలించాల్సి ఉంది. భూమికి సంబంధించిన కనీస ధరను నిర్ణయించి, యూసుఫ్ పఠాన్ చెల్లించాల్సిన తుది మొత్తాన్ని ఖరారు చేసిన తర్వాతే కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో 14 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకున్నప్పటికీ, తుది నిర్ణయాల కోసం వేచి చూడాల్సి ఉంది.


Read More
Next Story