
‘‘ముంబైలో మాయం అయి.. కోటాలో దొరికి’’
బాలీవుడ్ నటుడుపై కాల్పుల నిందితులను రాజస్థాన్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై ముంబైలో జరిగిన కాల్పుల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ముగ్గురు షూటర్లను రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినప్పటికీ, ఆ వాదనపై పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టయిన ముగ్గురూ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులేనని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
కోటా ఎస్పీ తేజస్వని గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుల్లో ఇద్దరు హర్యానాకు చెందినవారు కాగా, మరొకరు బీహార్‌కు చెందినవారు. వీరిని రైలులో ప్రయాణిస్తుండగా కోటా జిల్లా పోలీసులు పట్టుకున్నారు.
దర్యాప్తు అధికారులు ఈ దాడి పక్కా ప్రణాళికతో జరిగినట్లు అనుమానిస్తున్నారు. నిందితులు ముందుగానే టైగర్ ష్రాఫ్ కదలికలపై నిఘా పెట్టి, రెక్కీ నిర్వహించినట్లు భావిస్తున్నారు. ఆదివారాల్లో టైగర్ జుహూలోని ఫుట్‌బాల్ మైదానానికి వెళ్తాడని గుర్తించిన దుండగులు, ఆయన కారులో వెళ్తున్న సమయంలో కాల్పులు జరిపినట్లు సమాచారం.
దాడి తర్వాత తప్పించుకునేందుకు కూడా నిందితులు ముందుగానే మార్గాన్ని సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. విలే పార్లే, అంధేరీ మీదుగా ఎస్వీ రోడ్డును ఉపయోగించి పారిపోయేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. కాల్పుల అనంతరం అంధేరీ వెస్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో బైక్‌లను వదిలేసి, బోరివాలీ వైపు వెళ్లే రైలు ఎక్కినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత వారు గుజరాత్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
ఆదివారం సాయంత్రం ముంబైలోని జుహూ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి బుల్లెట్ గాయాలయ్యాయి.
ఈ ఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కాల్పులకు పాల్పడినవారితో పాటు, వారి వెనుక ఉన్నవారిని కూడా పట్టుకుంటామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని ఆయన తెలిపారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులకు కీలక ఆధారాలు లభించాయని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని నాగ్‌పూర్‌లో మీడియాకు వెల్లడించారు.
నిందితులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్న నేపథ్యంలో, వారిని పట్టుకునేందుకు ఇతర దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకుంటామని ఫడ్నవీస్ తెలిపారు. అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థల సహాయం కూడా తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ఈ కాల్పుల ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు, దాడికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

