భోగాపురం విమానాశ్ర‌యం ప్రారంభోత్స‌వం.. ఓ అట్ట‌హాసం !
x
భోగాపురం ఎయిర్‌పోర్టు ముఖచిత్రం

భోగాపురం విమానాశ్ర‌యం ప్రారంభోత్స‌వం.. ఓ అట్ట‌హాసం !

ఉత్త‌రాంధ్ర‌లో అందుబాటులోకి రానున్న భోగాపురం ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు ఆగ‌స్టు ఒక‌టో తేదీన అత్యంత అట్ట‌హాసంగా ప్రారంభం కానుంది.

భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్రారంభోత్స‌వాన్ని కూట‌మి ప్ర‌భుత్వం ఎంతో అట్ట‌హాసంగా చేస్తోంది. న‌భూతో అన్నంత‌గా హ‌డావుడి చేస్తోంది. ఈ ఎయిర్‌పోర్టు రాక‌తోనే ఉత్త‌రాంధ్ర రూపురేఖ‌లు మారిపోతాయ‌న్నంతగా జ‌నంలో పెద్ద ఎత్తున ఊద‌ర‌గొడుతోంది. ఈ విమానాశ్ర‌యం క్రెడిట్‌ను త‌మ ఖాతాలో వేసుకోవ‌డానికి కూట‌మిలోని టీడీపీ, బీజేపీ నేత‌లు ఎంత‌గానో పోటీ ప‌డుతున్నారు. విచిత్ర‌మేమిటంటే.. ఈ ఎయిర్‌పోర్టు రోడ్ల‌ క‌నెక్టివీటీ, ఇత‌ర ప‌నులు పూర్తి కాకుండానే ప్రారంభోత్స‌వానికి సిద్ధం చేశారు. అల్లూరి సీతారామ‌రాజు ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టుగా నామ‌క‌ర‌ణం చేసిన ఈ విమానాశ్ర‌యాన్ని ఆగ‌స్టు ఒక‌టో తేదీన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయ‌నున్నారు.


భోగాపురం ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు

హంగామా ఎంత‌లా చేస్తున్నారంటే?

ఉత్త‌రాంధ్ర‌లో ఒక ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రావ‌డాన్ని అంద‌రూ స్వాగ‌తించాల్సిందే. ఘ‌నంగా దానిని ప్రారంభించాల్సిందే. కానీ ఇప్పుడు చేస్తున్న‌దేమిట‌న్న‌దే అంద‌రిలోనూ రేకెత్తిస్తున్న ప్ర‌శ్న‌! అస‌లే దేశంలో ఆర్థిక ప‌రిస్థితులు అంతంత‌మాత్రంగా ఉన్న రోజులివి. ప్ర‌ధాని నుంచి ముఖ్య‌మంత్రులు, మంత్రుల వ‌ర‌కు పొదుపు మంత్రాలు జ‌పిస్తున్న త‌రుణ‌మిది. కొంద‌రు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు త‌మ ఖ‌రీదైన వాహ‌నాల‌ను వ‌దిలి సైకిళ్ల‌పై స‌చివాల‌యాలు, కార్యాల‌యాల‌కు వెళ్తూ మీడియాకెక్కుతున్నారు కూడా. ఇటీవ‌ల కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌లు కోకొల్ల‌లు. కానీ భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్స‌వం విష‌యంలో మాత్రం పొదుపు స్థానంలో దుబారా చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్స‌వానికి రూ.30 కోట్ల వ‌ర‌కు మంచినీళ్ల‌లా ఖర్చు చేస్తున్న‌ట్టు చెబుతున్నారు. కానీ హంగామాను చూస్తుంటే అంత‌కు మించే వ్వ‌యం చేస్తున్నార‌న్న వాద‌న ఉంది.

ఎయిర్‌పోర్టు ముందు ఏర్పాటు చేసిన నీటి కొల‌ను

మూడు ల‌క్ష‌ల మందితో ప్ర‌ధాని స‌భ‌..

ప్ర‌ధాని స‌భ‌కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మూడు ల‌క్ష‌ల మందిని త‌ర‌లిస్తున్నామ‌ని కూట‌మి నేత‌లు గొప్ప‌గా చెప్పుకుంటున్నారు. వీరంద‌రినీ భోగాపురానికి త‌ర‌లించ‌డానికి ఐదు వేల బ‌స్సుల‌ను సిద్ధం చేశారు. వీటిలొ రెండు వేల బ‌స్సులు ఆర్టీసీవే. ఇవి కాకుండా కార్లు, ఇత‌ర వాహ‌నాలు వెర‌సి మ‌రో ఏడు నుంచి ప‌ది వేల వ‌ర‌కు ఉంటాయ‌ని పోలీసు అధికారులే చెబుతున్నారు. ఏడు వేల మందితో పోలీసు బందోబ‌స్తును ఏర్పాటు చేస్తున్నారు. ప‌ర్య‌వేక్ష‌ణ‌కు 30 మంది ఐపీఎస్ అధికారుల‌ను నియ‌మించారు. వీరితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారుల‌ను పెద్ద సంఖ్య‌లో రప్పిస్తున్నారు. నాలుగంచెల పోలీసు భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. మ‌రోవైపు అధికారులు ఉత్త‌రాంధ్ర క‌ల‌ల‌కు రెక్క‌లు పేరుతో ఆరు రోజుల పాటు ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హిస్తున్నారు. భోగాపురం విమానాశ్ర‌యం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లోని విద్యా సంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. ప్ర‌ధాని స‌భ‌కు వేలాదిగా వాహ‌నాలు, ల‌క్ష‌లాదిగా జ‌నం వ‌స్తున్నందున అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ప్ర‌జ‌లు ప్ర‌యాణాలు చేయ‌వ‌ద్ద‌ని అధికారులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

సంక్రాంతి ముగ్గుల ఆకారంలో రూపొందించిన టెర్మిన‌ల్ పైభాగం

గిన్నిస్ రికార్డు కోసం థింసా నృత్యం..

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్స‌వానికి వ‌స్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌మ‌క్షంలో గిరిజ‌న సంప్ర‌దాయ నృత్యం థింసాను ప్ర‌ర‌ర్శించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం గిరిజ‌న జిల్లాలైన పోల‌వ‌రం, అల్లూరి సీతారామ‌రాజు, పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాల నుంచి 13 వేల మంది గిరిజ‌న బాలిక‌లు, మ‌హిళ‌ల‌ను ర‌ప్పిస్తున్నారు. ఇప్ప‌టికే వీరికి శిక్ష‌ణ‌/ రిహార్స‌ల్స్ కూడా చేయిస్తున్నారు. వీరంతా థింసా నృత్యంతో ప్ర‌ధానికి స్వాగ‌తం ప‌లుకుతారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్య‌లో ఇప్ప‌టివ‌ర‌కు థింసా నృత్యం ఎక్క‌డా జ‌ర‌గ‌లేదు. దీంతో ఈ మెగా థింసా నృత్యాన్ని గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు పాల‌కులు. మ‌రోవైపు ఎయిర్‌పోర్టు ప్రాంగ‌ణంలో 30 వేల మొక్క‌ల‌తో ప్ర‌ధాని మోదీకి స్వాగ‌తం ప‌లికేలా అక్ష‌ర క్ర‌మంతో ఏర్పాటు చేశారు.

విమానాశ్ర‌యంలో జ‌రుగుతున్న ప‌నులు

భోగాపురం విమానాశ్ర‌యం స్వ‌రూపం ఇదీ..

భోగాపురం ఇంట‌ర్నేష‌న‌ల్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును 2,203 ఎక‌రాల్లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో నిర్మించారు. దీనికి దాదాపు రూ.4,750 కోట్లు వెచ్చించారు. జీఎంఆర్ సంస్థ దీని నిర్మాణాన్ని చేపట్టింది. 3.8 కిలోమీట‌ర్లు (3800 మీట‌ర్ల‌) ర‌న్‌వే. దేశంలో ఐదో పొడ‌వైన ర‌న్‌వే ఇది. భారీ బోయింగ్ విమానాలు సైతం రాక‌పోక‌లు సాగించే కోడ్‌-4ఈ ర‌న్‌వే నిర్మాణాన్ని చేప‌ట్టారు. 18 ఎక‌రాల్లో టెర్మిన‌ల్ నిర్మించారు. ఇక్కడ 40 అత్యాధునిక చెకిన్ కౌంట‌ర్లు, విశాల‌మైన లాంజ్‌లు, ఎస్క‌లేట‌ర్లు, వేగ‌వంత‌మైన స్కాన‌ర్లు వంటివి ఏర్పాటు చేశారు. భ‌ద్ర‌తా త‌నిఖీలు, ప్ర‌వేశాలు సుల‌భ‌త‌రం చేసేలా 12 డిజి యాత్ర పాడ్‌ల‌ను పెట్టారు. సెల్ప్ స‌ర్వీస్ కియోస్కులు, ఆటోమేటిక్ బ్యాగేజి హ్యాండ్లింగ్ సిస్ట‌మ్‌ను సిద్ధం చేశారు. 10 డొమెస్టిక్‌, ఐదు ఇంట‌ర్నేష‌న‌ల్ సెక్యూరిటీ స్క్రీనింగ్ సెక్ష‌న్లు, 10 ఈ-గేట్లు ఉన్నాయి. ఐదు వేల చ‌ద‌ర‌పు మీట‌ర్ల విస్తీర్ణంలో కార్గో కాంప్లెక్స్‌ను నిర్మించారు జాతీయ ర‌హ‌దారిపై ఇంట‌ర్ చేంజ్ ట్రంఫెట్ ను నిర్మించారు. కోల్‌క‌తా చెన్నై హైవేపై విజ‌య‌వ‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం, శ్రీ‌కాకుళం నుంచి వ‌చ్చే వాహ‌నాల‌కు ఇబ్బంది లేకుండా దీనిని ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్‌పోర్టు విశాఖ‌ప‌ట్నానికి 50 కి.మీలు, విజ‌య‌న‌గరానికి 20, శ్రీ‌కాకుళం ప‌ట్ట‌ణానికి 48 కి.మీల దూరంలో ఉంది.

నిర్మాణంలో ఉన్న ఎయిర్‌పోర్టుకు వెళ్లే రోడ్డు

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్ర‌త్యేక‌త‌లివీ..

ఎయిర్‌పోర్టు టెర్మిన‌ల్‌కు ఎదురుగా నీటి కొల‌నును త‌ల‌పించే విశాల‌మైన‌ పాండ్‌ను ఏర్పాటు చేశారు. బ‌డా స్విమ్మింగ్ పూల్ లాంటి ఆ కొల‌ను బుల్లి బుల్లి కెర‌టాల‌తో అల‌రిస్తోంది. ఫ్ల‌యింగ్ ఫిష్ (ఎగిరే చేప‌) ఆకృతిలో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని చేప‌ట్టారు. ఈ వాట‌ర్ పూల్ (కొల‌ను) ఆవ‌ల నుంచి చూస్తే డాల్ఫిన్ చేప ఎగురుతున్న అనుభూతి క‌లుగుతుంది. ఈ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ట‌వ‌ర్‌, ఇత‌ర క‌ట్ట‌డాలు గంట‌కు 275 కి.మీల గాలుల వేగాన్ని సైతం త‌ట్టుకుని నిలిచేలా నిర్మించారు. 28 విమానాలు ఒకేసారి పార్కింగ్ చేసుకునే వీలుంటుంది. ప్ర‌స్తుతానికి ఏడాదికి 60 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణించ‌వ‌చ్చు. భ‌విష్య‌త్తులో దాని సామ‌ర్థ్యం 4 కోట్ల‌కు పెంచేలా నిర్మించారు. మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రాచీన‌, జాన‌ప‌ద క‌ళ‌లు ఉట్టిప‌డేలా ఏటికొప్పాక ల‌క్క‌బొమ్మ‌లు, కొండ‌ప‌ల్లి బొమ్మ‌లు, తోలు బొమ్మ‌లు, బొబ్బిలి వీణ‌ల‌తో పాటు బంగిన‌ప‌ల్లి మామిడి, గుంటూరు మిర్చి, ఉద‌య‌గిరి ఉడెన్ క‌ట్ల‌రీ వంటి చిత్రాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నాయి. ఇంకా ఎయిర్‌పోర్టు టెర్మిన‌ల్ పైభాగంలో ప్ర‌యాణికుల‌ను మంత్ర‌ముగ్గుల‌ను చేసేలా సంక్రాంతి ముగ్గుల‌ను పోలిన విద్యుత్ లైట్ల‌ను అమ‌ర్చారు.

ప్ర‌ధాని మోదీ షెడ్యూలు ఇలా..

భోగాపురం విమానాశ్ర‌యం ప్రారంభోత్స‌వానికి వ‌స్తున్న ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి. శ‌నివారం ఉద‌యం ఉదయం 10:45 గంటలకు ప్రత్యేక విమానం లో దిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:50 గంట‌ల‌కు కారు లో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు. 10.55 గంట‌ల‌కు కూచిపూడి, గిరిజ‌న థింసా నృత్యాల‌తో మ‌హిళ‌లు ప్ర‌ధానికి ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతారు. 11 గంట‌ల‌కు విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలిస్తారు. 11:30 – 12:55 వ‌ర‌కు విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం ఉంటాయి. అనంత‌రం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కార్య‌క్ర‌మం పూర్త‌య్యాక మధ్యాహ్నం 1:10 గంట‌ల‌కు భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణమ‌వుతారు.

ఇంకా పూర్తికాని రోడ్లు.. ప‌నులు..

ఎంతో అట్ట‌హాసంగా ప్రారంభిస్తున్న భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్త‌యింద‌ని అధికారులు, కూట‌మి నాయ‌కులు చెబుతున్నారు. కానీ ఎయిర్‌పోర్టు ప్రాంగ‌ణంలో ఇప్ప‌టికీ ప‌నులు జ‌రుగుతూనే ఉన్నాయి. విమానాలు రాక‌పోక‌లు సాగించ‌డానికి సాంకేతికంగా అన్ని ప‌నులూ కొలిక్కి వ‌చ్చాయి. విశాఖ‌ప‌ట్నం నుంచి భోగాపురానికి వెళ్లే క‌నెక్టివిటీ రోడ్లు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ప్ర‌ధానంగా ఏడు మాస్ట‌ర్‌ప్లాన్ రోడ్ల‌లో ఇప్ప‌టివ‌రకు నాలుగే పూర్త‌య్యాయి. మిగిలిన వాటికి ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇవి పూర్తి కావ‌డానికి కొన్నాళ్ల స‌మ‌యం ప‌డుతుంది.
ఇదే ఇప్పుడు విమాన ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న రేకెత్తిస్తోంది. విమానాశ్ర‌యంకంటే క‌నెక్టివిటీ రోడ్ల‌ను పూర్తి చేయాల్సి ఉంది. అయితే అందుకు భిన్నంగా ఈ రోడ్ల‌కంటే ఎయిర్‌పోర్టే ముందుగా సిద్ధం కావ‌డం విశేషం!

భోగాపురానికి 20 విద్యుత్ బ‌స్సులు..

విశాఖ‌ప‌ట్నం నుంచి భోగాపురానికి దాదాపు 50 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించ‌డానికి రెండు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్ర‌స్తుతానికి 20 విద్యుత్ బ‌స్సుల‌ను భోగాపురానికి న‌డ‌పాల‌ని నిర్ణ‌యించారు. మ‌రోవైపు విమాన ప్ర‌యాణికుల కోసం ప్ర‌త్యేకంగా తొమ్మ‌ది చోట్ల బిజెనెస్ లాంజ్‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నారు. ఇవి అందుబాటులోకి రావ‌డానికి కొన్ని నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది.

రైతుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..

భోగాపురం విమానాశ్ర‌యానికి భూములిచ్చిన రైతుల్లో కొంద‌రికి ప్ర‌భుత్వం ఇంకా పూర్తి స్థాయిలో ప‌రిహారం చెల్లించ‌లేదు. ఆ ప‌రిహారం కోసం రైతులు అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల చుట్టూ కాళ్ల‌రిగేలా తిరుగుతున్నారు. కానీ ఈ రైతుల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం కోసం వారిని విమానంలో ఉచితంగా తీసుకెళ్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇటీవ‌లే బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. కానీ ఉచిత విమాన ప్ర‌యాణంకంటే త‌మ‌కు రావ‌ల‌సిన ప‌రిహారం ఇవ్వాల‌ని రైతులు కోరుతున్నారు.

16 వ‌ర‌కే విశాఖ ఎయిర్‌పోర్టు..

భోగాపురం ఎయిర్‌పోర్టును ఆగ‌స్టు ఒక‌టిన ప్రారంభిస్తున్నా అ విమానాశ్ర‌యం నుంచి 16వ తేదీ అర్థ‌రాత్రి నుంచే మొద‌లు కానున్నాయి. అందువ‌ల్ల అప్ప‌టి వ‌ర‌కు విశాఖప‌ట్నం ఎయిర్‌పోర్టు నుంచే విమానాల రాక‌పోక‌లు సాగిస్తారు. ఆ త‌ర్వాత నుంచి వైజాగ్ ఎయిర్‌పోర్టు కేవ‌లం ర‌క్ష‌ణ‌రంగ విమాన‌నాల‌కు, అత్య‌వ‌స‌ర‌, ప్ర‌త్యేక విమాన స‌ర్వీసుల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేస్తారు.
Read More
Next Story