
హైదరాబాద్ వచ్చిన ఇన్వెస్టర్లకు అదిరిపోయే గిఫ్టులు
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా పోచంపల్లి శాలువాలు, ఇప్పపువ్వు లడ్డూలతో ఘన స్వాగతం
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి హాజరైన అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే ఆతిథ్యం ఇస్తోంది. సోమ, మంగళవారాలలో జరుగుతున్న ఈ సమ్మిట్ కి సుమారు 50 దేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు, డెలిగేట్స్ హాజరవుతున్నారు. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి వచ్చిన ప్రపంచ కార్పొరేట్ నేతలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆతిథ్యాన్ని అందిస్తోంది. తెలంగాణ కళ, సంస్కృతి, వంట వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా రూపొందించిన సావనీర్ కిట్లు, ఫుడ్ బాస్కెట్లు అంతర్జాతీయ ప్రతినిధులకు అందజేస్తున్నారు.
అధికార వర్గాల కథనం ప్రకారం, పలు దేశాల మంత్రులు, బహుళజాతి సంస్థల CEOలు, రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, గ్లోబల్ థింక్‌ట్యాంక్ సభ్యులు హాజరు అయ్యారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నుంచి ప్రత్యేక ఆహ్వానాలు అందుకున్న ప్రముఖ వ్యాపారవేత్తలకు స్పెషల్ అరేంజ్మెంట్లు కూడా చేశారు.
పోచంపల్లి ఇక్కత్ బ్రాండింగ్‌తో ప్రత్యేక కిట్లు..
సమ్మిట్ కోసం రూపొందించిన సావనీర్ కిట్లపై ‘Telangana Rising Global Summit’ లోగోతో పాటు పోచంపల్లి ఇక్కత్ డిజైన్‌లతో అలంకరించారు. ప్రతి కిట్‌లో తెలంగాణ ప్రత్యేకతను చాటేలా ఆహార పదార్థాలు, తెలంగాణ వంటకాలు, ఇతర వస్తువులు ఉంచారు. వాటిలో పొచ్చంపల్లి శాలువాలు, చేరియల్ మాస్కులు, హైదరాబాదీ అత్తర్ (ఇతర్), హైదరాబాదీ ముత్యాలతో తయారైన బ్రేస్‌లెట్‌లు, చెవిపోగులు ఉన్నాయి. రాష్ట్ర హస్త కళల వైశిష్ట్యాన్ని ప్రపంచ వేదికపై ప్రతిష్టాత్మకంగా ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా ఎంపిక చేశారు.
తెలంగాణ రుచులతో ఫుడ్ బాస్కెట్లు...
అతిథుల కోసం సిద్ధం చేసిన ఫుడ్ బాస్కెట్లు ప్రీమియం బ్రాండింగ్‌తో, తెలంగాణ వంట సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించారు. వీటిలో మహువా (ఇప్ప పువ్వు) లడ్డూలు, తెలంగాణ సకినాలు, అప్పాలు , చక్కిడాలు, బాదం కి జాలి, నువ్వుల ఉండలు, మొక్కజొన్న పేలాలతో చేసిన లడ్లు ఉన్నాయి. రాష్ట్రానికి చెందిన ప్రత్యేక వంటకాల రుచులను ప్రపంచ వ్యాపార నాయకులకు పరిచయం చేయడానికి ఈ ఫుడ్ బాస్కెట్లు ప్రధాన పాత్ర పోషించనున్నాయి.
ప్రపంచ పెట్టుబడిదారుల వేదికగా భారత్ ఫ్యూచర్ సిటీ
బహుళజాతి పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ సంస్థలు, ఆర్థిక సంస్థలు, దౌత్యవేత్తలు ఒకేచోట చేరే ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ అభివృద్ధి అవకాశాలను గ్లోబల్ మార్కెట్‌కు పరిచయం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.
ఈ అంతర్జాతీయ ఈవెంట్ రాష్ట్ర భవిష్యత్తులో కీలక మలుపుగా భావిస్తున్నారు.
తెలంగాణ కళలు, వంటలు, కార్మిక సంప్రదాయాలను ప్రపంచం ముందు ఉంచే ఈ ఆతిథ్య ప్యాకేజీలు- సమ్మిట్ కు వస్తున్న ప్రతినిధులకు, పారిశ్రామిక వేత్తల చేతుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Next Story

